Girls High School
-
బాలికల హైస్కూలు ప్లస్‌గా 292 హైస్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోబాలికల కోసం జూనియర్ కాలేజీ కానీ, కస్తూరిబా బాలికా విద్యాలయం కానీ లేని 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈమేరకు విద్యా శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హైస్కూల్ ప్లస్‌లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్లస్ 2 (ఇంటర్మీడియెట్) తరగతులు ప్రారంభిస్తున్నారు. వీటిలో 40 చొప్పున విద్యార్థినులను చేర్చుకొనేలా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. వీటిలో ఈ విద్యాసంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఒకటికన్నా ఎక్కువ జూనియర్ కాలేజీలు ఉన్న మండలాల్లో ఒక కళాశాలను బాలికలకు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా అమలు పరుస్తున్నారు. ఇలా 13 మండలాల్లో బాలికల కోసం ఒక జూనియర్ కాలేజీని కేటాయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి. హైస్కూల్ ప్లస్‌గా అన్ని కేజీబీవీలు రాష్ట్రంలోని అన్ని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 328 కస్తూరిబా బాలికా విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 220 కేజీబీవీల్లో 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగతా కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. వీటిని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ ప్లస్ (12వ తరగతి వరకు)కు మారుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 11వ తరగతి ప్రారంభం అవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి ఆరంభం అవుతుంది. హైస్కూల్ ప్లస్‌పై విస్తృత ప్రచారం చేయాలి బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న హైస్కూల్ ప్లస్ పాఠశాలల గురించి తల్లిదండ్రులు, విద్యార్ధులందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని పాఠశాల విద్యా శాఖ అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించింది. అలాగే బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఎంపిక చేసిన స్కూళ్లలో తరగతి గదులు, ల్యాబ్‌లు వంటి సదుపాయాలకు వీల్లేని పరిస్థితి ఉంటే సమీపంలోని ఏపీ మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని సదుపాయాలను వినియోగించాలని పేర్కొంది. బోధనా సిబ్బంది ఏర్పాటు అయ్యేవరకు హైస్కూళ్లలోని ప్రస్తుత సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. -
నా ఫ్రెండ్‌ను చదివించండి
కౌడిపల్లి(నర్సాపూర్): తాను చదువుకుం టోంది... తన స్నేహితురాలు మాత్రం చదువు మాని ఇంటివద్దే ఉంటోంది. అది ఆమెను బాధించింది. అందుకే ‘నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ పాఠశాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంది. మెదక్ జిల్లా మహ్మద్ నగర్‌గేట్ తండాకు చెందిన సంధ్య, కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన ఆమె ఫ్రెండ్ నందిని నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. ఇటీవలే ఆమె స్కూల్ మానేసి ఇంటివద్దే ఉంటోంది. స్నేహితురాలు పాఠశాలకు రాకపోవ డం సంధ్యను బాధపెట్టింది. ఈ క్రమంలో పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెండ్లీ పంచాయత్, లింగ వివక్ష’ అవగాహన సదస్సులో విద్యార్థులు పలు సమస్యలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంధ్య ‘నా ఫ్రెండ్ నాకంటే బాగా చదువుతుంది. కానీ తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ కోరింది. బాలిక అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు.. నందినిని తప్పకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు. -
తెలంగాణ: బాలికల పాఠశాలలో 14 మందికి వైరస్
సాక్షి, కరీంనగర్‌టౌన్/మంచిర్యాల అర్బన్: ఉపాధ్యాయ వర్గాలు.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కరోనా టెన్షన్ మొదలైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వా హకులు, ఓ విద్యార్థికి పాజిటివ్‌గా నమోదైంది. మూడు రోజుల కిందట పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడటంతో సోమ వారం ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపారు. పాఠశాలలోని 33 మంది ఉపా ధ్యాయులు, ఇద్దరు వంట నిర్వాహ కులు, 20 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. వారిలో 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వా హకులు, ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యా ర్థులకు ఎలాంటి లక్షణాలు లేవు. డీఈవో వెంకటేశ్వర్లు హుటాహుటిన పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మరికొంత మంది ఉపాధ్యాయులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు. కరీంనగర్లో నలుగురికి.. కరీంనగర్‌లోని రెండు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి నాలుగైదు రోజులుగా జ్వరం ఉండటంతో పాఠశాలకు సెలవుపెట్టి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఆయనకు పాజిటివ్‌గా తేలింది. సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆయన భార్యకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సుభాష్‌నగర్ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో మరో ఉపాధ్యాయుడికి, ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది. చదవండి: (కరోనా టీకా కోసం మరో వెయ్యి ఆస్పత్రులు) -
ఈ రాజా చెయ్యి వేస్తే అంతా మంచే
ఆయన ప్రజాసేవలోనే కాదు.. దాతృత్వంలో సైతం రాజానే. పాఠశాలల్లో పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బాగోలేదని గుర్తించిన ఎమ్మెల్యే రాజా తన సొంత ఖర్చుతో వారికి భోజనాలు పంపిస్తున్నారు. రోజూ వందలాది విద్యార్థులకు ఆయన రుచికరమైన భోజనాలు పెడుతున్నారు. అలా పెద్దల్లోనే కాదు.. పిల్లల మనస్సులో సైతం చెరగని ముద్ర వేసుకుంటున్నారు. సాక్షి, తుని : ధనం అందరికీ ఉంటుంది కానీ దాతృత్వ గుణం కొందరికే ఉంటుంది. దాతృత్వం ఉన్న వారిలో తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అగ్రగణ్యుడు. మధ్యాహ్న భోజనం బాగుండక పోవడంతో తినలేకపోతున్న విద్యార్థుల అవస్థలను గుర్తించి 740 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చుతో పదిరోజులుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బెండపూడిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. ఆ భోజనాలు మెనూ ప్రకారం అందకపోవడంతోపాటు పురుగులు పట్టిన అన్నం, సాంబారు సరఫరా చేస్తుండటంతో పిల్లలు పురుగులను తొలగించి తినాల్సిన దుస్ధితి ఏర్పడింది. కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేస్తుండటంతో వాటిని తినకుండా పారేస్తున్నారు. దీనిపై పై అధికారులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా పట్టించుకొనేవారే లేకుండా పోయారు. ఆ పరిస్థితుల్లో ఈనెల ఆరో తేదీన ఎమ్మెల్యే రాజా పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు తింటున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం బాగుండడం లేదని, దాన్ని తినలేక పారేస్తున్నామని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అలాగే తొండంగి మండలం శృంగవృక్షంలోని జెడ్పీ హైస్కూల్‌ను, ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదికూడా అలాగే అధ్వానంగా ఉండడంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అంతవరకూ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనాన్ని పంపుతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు సన్న భియ్యం అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిస్తున్నారు. తుని గర్ల్స్ హైస్కూల్లో 300 మందికి, శృంగవృక్షం జెడ్పీ హైస్కూల్లో 290 మందికి, ప్రాథమిక పాఠశాలలో 150 మందికి మొత్తం 740 మందికి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పంపించారు. అధ్వానంగా ఉండే భోజనాన్ని తినలేక, ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకునే ఆర్థిక స్థోమతలేని పేద, మద్యతరగతి వర్గాల పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా భోజనాలు పంపించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రుచికరమైన భోజనం అందించి పిల్లల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. -
హైస్కూల్ విద్యార్థినులకు అస్వస్థత
విశాఖ, రావికమతం(చోడవరం): రావికమతం బాలికల హైస్కూల్ విద్యార్థినులు పలువురు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌పాయిజన్ కారణంగా వీరు అస్వస్థతకు గురయ్యారని అందరూ ఆందోళన చెందారు. అయితే ఫుడ్‌పాయిజన్ వల్ల కాదని దుర్వాసన వల్లే ఇబ్బందికి గురయ్యారని వైద్యాధికారి ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం హైస్కూల్‌కు నవప్రయాస్ సంస్థ ద్వారా శుక్రవారం మధ్యాహ్నం భోజనాలు వచ్చాయి. పిల్లలంతా తిని తరగతి గదిల్లోకి వెళ్లాక ఆరోతరగతికి చెందిన 10 మంది విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీంతో ఆహారం కలుషితమై ఉంటుందని మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. బాధిత విద్యార్థినులను హుటాహుటిన రావికమతం ఆస్పత్రికి తరలించారు. వైద్యసేవలందించడంతో వారు తేరుకున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల కాదని, దుర్వాసన వల్ల వచ్చిందని తేల్చారు. ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థులందరూ అస్వస్థతకు గురై ఉండాలని వైద్యాధికారి విమలగిరి స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
లక్ష్యం ముందు తలవంచిన విధి
వారు ఏడాదంతా కష్టపడి చదివారు. విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతిలో ఉత్తీర్ణులుగా నిలిచి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి విధి పరీక్ష పెట్టింది. ఇంట్లో తల్లి శవం ఉండగా.. ఓ కూతురు.. నిన్నటి వరకు తనతో ఆడుకున్న చెల్లెలు విగతజీవిగా పడి ఉండగా ఓ అన్న దుఃఖాన్ని దిగమింగి విధి పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలను రాశారు. మరో చోట చేతులు లేవని దిగులు చెందకుండా పరీక్ష రాస్తే.. తన అనారోగ్యానికి కుంగిపోకుండా సహాయకుడి ద్వారా పరీక్ష రాసి ఆదర్శంగా నిలిచిందో విద్యార్థిని. వరంగల్ జిల్లాలో పరీక్షకు కొద్ది గంటల ముందే తండ్రి మరణించగా, కన్నీరుమున్నీరవుతూ పరీక్ష రాసి వచ్చింది. మరో విద్యార్థినికి తండ్రి మరణించిన విషయం పరీక్షా కేంద్రం వద్దగానీ తెలియలేదు. ఇంట్లో తల్లి శవం.. ఇల్లెందు: తల్లి మృతదేహం ఇంట్లో ఉండగానే ఆ కూతురికి ‘విషమపరీక్ష’ ఎదురైంది. ఓ పక్క తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోపక్క ఆమె పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తిరుమలాపురంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ నాగేశ్వరరావు-కౌసల్యల కూతురు రుక్ష్మిణీబాయి ఇల్లెందు బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఎస్టీ(న్యూ) బాలికల హాస్టల్లో ఉంటోంది. రుక్మిణీబారుు తల్లి కౌసల్య ఆదివారం మృతి చెందింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం స్వగ్రామంలో కౌసల్య అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతుండగానే, రుక్మిణీబారుు ఇల్లెందులోని గురుకుల పాఠశాల సెంటర్లో పదోతరగతి పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగియగానే వెళ్లి తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది. కాలితో పరీక్ష సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థి భానుప్రసాద్ కాలితో పరీక్ష రాశాడు. ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భానుప్రసాద్‌కు పుట్టినప్పటి నుంచి రెండు చేతులు చచ్చుబడి పోవడంతో కుడి కాలితో రాయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు హాజరై కాలితో పరీక్ష రాశాడు. పక్షవాతంతో పరీక్షకు.. కడెం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న తపన ముందు విధి తలవంచింది. పరీక్షలకు రెండు నెలల ముందు పక్షవాతం బారిన పడిన ఆ విద్యార్థిని మొక్కవోని ధైర్యంతో పరీక్షలకు హాజరైంది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామానికి చెందిన మునిగంటి భూలక్ష్మీ, లక్ష్మణ్‌ల కూతురు రజిత మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకులంలో పదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం ఒక్కసారిగా ఆమె పక్షవాతం బారిన పడింది. ఎడమ చేరుు, ఎడమ కాలు పని చేయడం లేదు. అప్పటి నుంచి కుటుంబమంతా విషాదంలో ఉండగా, సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు రజిత తల్లి సహాయం తో హాజరైంది. కడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరీ క్షకు హాజరైంది. అధికారుల అనుమతితో సహాయకుడితో పరీక్ష రాసింది. పరీక్షకు కొద్ది గంటల ముందే.. వరంగల్: వరంగల్ జిల్లా జనగామ మండ లం యశ్వంతాపూర్‌కు చెందిన కట్ట అయోధ్య(40) ఆటో నడుపుతూ భార్య, నలుగురు పిల్లలను పోషించేవాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. సోమవారం వేకువజామున గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. అయితే, అయోధ్య రెండో కూతురు శ్వేత రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షకు కొద్ది గంటల మెందే తండ్రి చనిపోవడంతో బోరున విలపించింది. అరుునా తిరిగి ధైర్యం తెచ్చుకుని పరీక్షకు హాజరైంది. అలాగే, వర్ధన్నపేటకు చెందిన గుడికందుల దేవేందర్(39) కూతురు కావ్య స్థానిక అరబిందో పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దేవేందర్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆదివారం రాత్రి తాను పని చేసే పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. సోమవారం వేకువజామున అస్వస్థతకు గురయ్యూడు. 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందాడు. అరుుతే తండ్రి మరణవార్త కావ్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తోటి స్నేహితులతో కలసి ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి వచ్చాక.. మరి కొందరు మిత్రుల ద్వారా విషయం తెలిసింది. బోరున విలపించిన కావ్యకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పడంతో పరీక్ష రాసింది. సోదరి చనిపోయినా.. ధరూరు: తోడబుట్టిన సోదరి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన దరెప్ప, లక్ష్మీలకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. దరెప్ప ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. వీరి రెండవ కుమార్తె బేబీ(12) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పెద్దకుమారుడు రాజు పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోదరి మృతదేహం ఇంట్లో ఉండగా, రాజు సోమవారం తెలుగు పరీక్ష రాశాడు. తర్వాత సోదరి అంత్యక్రియలకు హాజరయ్యాడు. స్నేహితుడి సహాయంతో.. జహీరాబాద్: స్నేహితుడి సహాయంతో ఓ మరుగుజ్జు పదో తరగతి పరీక్ష రాశాడు. సోమవారం మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల కేంద్రానికి టి.శ్రీకాంత్(మరుగుజ్జు)ను అతని స్నేహితుడు చవాన్ కిషన్ ఎత్తుకుని తీసుకొచ్చాడు. శ్రీకాంత్‌కు రాయడం రానందునా స్నేహితుడి సహాయం తీసుకునేందుకు పరీక్ష కేంద్రం నిర్వాహకులు అనుమతించారు. జహీరాబాద్ మండలం గుడ్‌పల్లికి చెందిన శ్రీకాంత్ సమీపంలోని మొగుడంపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివాడు. -
రాత్రికి రాత్రే..
ఆదిలాబాద్ : కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం బదిలీ అయ్యారన్న సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్రమణదారులు విజృంభించారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ గోడకు ఆనుకొని గురువారం రాత్రికి రాత్రే స్తంభాలు పాతి కబ్జాలకు దిగారు. దీంతో పాటు గర్ల్స్ హైస్కూల్ పక్కన రోడ్డుకు ఇరుైవైపుల దారిపొడవున ఆక్రమణలు వెలిశాయి. కాగాఐదు నెలల క్రితం కలెక్టర్ చొరవతో పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్లకు ఇరువైపుల కబ్జాలను తొలగించడం జరిగింది. అధికార పార్టికి చెందిన ఓ నేత ప్రమేయంతోనే పలువురు కబ్జాదారులు తిరిగి ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ వ్యవహారం రాత్రికి రాత్రే జరిగిందని చర్చించుకుంటున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డును దర్జాగా ఆక్రమించి పలువురు షెల్టర్లు వేసి వ్యాపారాలు కొనసాగించారు. వాటిని అద్దెకిచ్చుకుంటూ లాభాలు పొందారు. ప్రధానంగా ఈ ఆక్రమణలో రాజకీయ నాయకుల పాత్ర ఉందన్న చర్చ జోరుగా సాగుతున్నది.