ఆయన ప్రజాసేవలోనే కాదు.. దాతృత్వంలో సైతం రాజానే. పాఠశాలల్లో పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బాగోలేదని గుర్తించిన ఎమ్మెల్యే రాజా తన సొంత ఖర్చుతో వారికి భోజనాలు పంపిస్తున్నారు. రోజూ వందలాది విద్యార్థులకు ఆయన రుచికరమైన భోజనాలు పెడుతున్నారు. అలా పెద్దల్లోనే కాదు.. పిల్లల మనస్సులో సైతం చెరగని ముద్ర వేసుకుంటున్నారు.
సాక్షి, తుని : ధనం అందరికీ ఉంటుంది కానీ దాతృత్వ గుణం కొందరికే ఉంటుంది. దాతృత్వం ఉన్న వారిలో తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అగ్రగణ్యుడు. మధ్యాహ్న భోజనం బాగుండక పోవడంతో తినలేకపోతున్న విద్యార్థుల అవస్థలను గుర్తించి 740 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చుతో పదిరోజులుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బెండపూడిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు.
ఆ భోజనాలు మెనూ ప్రకారం అందకపోవడంతోపాటు పురుగులు పట్టిన అన్నం, సాంబారు సరఫరా చేస్తుండటంతో పిల్లలు పురుగులను తొలగించి తినాల్సిన దుస్ధితి ఏర్పడింది. కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేస్తుండటంతో వాటిని తినకుండా పారేస్తున్నారు. దీనిపై పై అధికారులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా పట్టించుకొనేవారే లేకుండా పోయారు. ఆ పరిస్థితుల్లో ఈనెల ఆరో తేదీన ఎమ్మెల్యే రాజా పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు తింటున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం బాగుండడం లేదని, దాన్ని తినలేక పారేస్తున్నామని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు.
అలాగే తొండంగి మండలం శృంగవృక్షంలోని జెడ్పీ హైస్కూల్‌ను, ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదికూడా అలాగే అధ్వానంగా ఉండడంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అంతవరకూ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనాన్ని పంపుతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు సన్న భియ్యం అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిస్తున్నారు.
తుని గర్ల్స్ హైస్కూల్‌లో 300 మందికి, శృంగవృక్షం జెడ్పీ హైస్కూల్‌లో 290 మందికి, ప్రాథమిక పాఠశాలలో 150 మందికి మొత్తం 740 మందికి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పంపించారు. అధ్వానంగా ఉండే భోజనాన్ని తినలేక, ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకునే ఆర్థిక స్థోమతలేని పేద, మద్యతరగతి వర్గాల పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా భోజనాలు పంపించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రుచికరమైన భోజనం అందించి పిల్లల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment