సాక్షి, అమరావతి: రాష్ట్రంలోబాలికల కోసం జూనియర్ కాలేజీ కానీ, కస్తూరిబా బాలికా విద్యాలయం కానీ లేని 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈమేరకు విద్యా శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హైస్కూల్ ప్లస్‌లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్లస్ 2 (ఇంటర్మీడియెట్) తరగతులు ప్రారంభిస్తున్నారు.
వీటిలో 40 చొప్పున విద్యార్థినులను చేర్చుకొనేలా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. వీటిలో ఈ విద్యాసంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఒకటికన్నా ఎక్కువ జూనియర్ కాలేజీలు ఉన్న మండలాల్లో ఒక కళాశాలను బాలికలకు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా అమలు పరుస్తున్నారు. ఇలా 13 మండలాల్లో బాలికల కోసం ఒక జూనియర్ కాలేజీని కేటాయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి.
హైస్కూల్ ప్లస్‌గా అన్ని కేజీబీవీలు
రాష్ట్రంలోని అన్ని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 328 కస్తూరిబా బాలికా విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 220 కేజీబీవీల్లో 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగతా కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. వీటిని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ ప్లస్ (12వ తరగతి వరకు)కు మారుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 11వ తరగతి ప్రారంభం అవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి ఆరంభం అవుతుంది.
హైస్కూల్ ప్లస్‌పై విస్తృత ప్రచారం చేయాలి
బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న హైస్కూల్ ప్లస్ పాఠశాలల గురించి తల్లిదండ్రులు, విద్యార్ధులందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని పాఠశాల విద్యా శాఖ అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించింది. అలాగే బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఎంపిక చేసిన స్కూళ్లలో తరగతి గదులు, ల్యాబ్‌లు వంటి సదుపాయాలకు వీల్లేని పరిస్థితి ఉంటే సమీపంలోని ఏపీ మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని సదుపాయాలను వినియోగించాలని పేర్కొంది. బోధనా సిబ్బంది ఏర్పాటు అయ్యేవరకు హైస్కూళ్లలోని ప్రస్తుత సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది.
బాలికల హైస్కూలు ప్లస్‌గా 292 హైస్కూళ్లు
Published Thu, Jul 7 2022 3:38 AM | Last Updated on Thu, Jul 7 2022 2:49 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment