KGBV girls
-
బాలికల హైస్కూలు ప్లస్‌గా 292 హైస్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోబాలికల కోసం జూనియర్ కాలేజీ కానీ, కస్తూరిబా బాలికా విద్యాలయం కానీ లేని 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈమేరకు విద్యా శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హైస్కూల్ ప్లస్‌లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్లస్ 2 (ఇంటర్మీడియెట్) తరగతులు ప్రారంభిస్తున్నారు. వీటిలో 40 చొప్పున విద్యార్థినులను చేర్చుకొనేలా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. వీటిలో ఈ విద్యాసంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఒకటికన్నా ఎక్కువ జూనియర్ కాలేజీలు ఉన్న మండలాల్లో ఒక కళాశాలను బాలికలకు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా అమలు పరుస్తున్నారు. ఇలా 13 మండలాల్లో బాలికల కోసం ఒక జూనియర్ కాలేజీని కేటాయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి. హైస్కూల్ ప్లస్‌గా అన్ని కేజీబీవీలు రాష్ట్రంలోని అన్ని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 328 కస్తూరిబా బాలికా విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 220 కేజీబీవీల్లో 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగతా కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. వీటిని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ ప్లస్ (12వ తరగతి వరకు)కు మారుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 11వ తరగతి ప్రారంభం అవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి ఆరంభం అవుతుంది. హైస్కూల్ ప్లస్‌పై విస్తృత ప్రచారం చేయాలి బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న హైస్కూల్ ప్లస్ పాఠశాలల గురించి తల్లిదండ్రులు, విద్యార్ధులందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని పాఠశాల విద్యా శాఖ అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించింది. అలాగే బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఎంపిక చేసిన స్కూళ్లలో తరగతి గదులు, ల్యాబ్‌లు వంటి సదుపాయాలకు వీల్లేని పరిస్థితి ఉంటే సమీపంలోని ఏపీ మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని సదుపాయాలను వినియోగించాలని పేర్కొంది. బోధనా సిబ్బంది ఏర్పాటు అయ్యేవరకు హైస్కూళ్లలోని ప్రస్తుత సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
కేజీబీవీల్లో కంప్యూటర్ మిథ్య
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు కంప్యూటర్ విద్య సంగతి దేవుడెరుగు.. దీనికోసం పీసీ, మోనిటర్, మౌస్, కీబోర్డు వినియోగిస్తారన్న స్పృహ లేకపోవడం విచిత్రం. వీరికి బోధించేందుకు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్లు లేకపోగా, కంప్యూటర్లు మాత్రం మూలకు చేరాయి. అయితే ప్రైవేటు ఏజెన్సీకి, అధికార పార్టీ నేతలకు మధ్య మామూళ్ల పంపకాల్లో వివాదం తలెత్తడంతో వారి నియామకాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాజాం: జిల్లాలోని 32 మండలాల్లో రెండు విడతలుగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభించారు. ఈ పాఠశాలలు తొలుత 6 నుంచి 8 తరగతి వరకూ ప్రారంభించి ప్రతీ ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ 10వ తరగతి వరకూ అప్‌గ్రేడేషన్ చేశారు. ఈ ఏడాది జి.సిగడాం, కోటబొమ్మాళి మండలాల్లో పది నుంచి ఇంటర్ వరకూ అదనంగా పెంచారు. బోధకుల రిక్రూట్మెంట్ మాత్రం చేపట్టలేదు. కానరాని కంప్యూటర్ విద్య.. 2012 నుంచి అన్ని పాఠశాలలకు విడతల వారీగా కంప్యూటర్లు అందించారు. ఒక్కో పాఠశాలలో 10 నుంచి 12 కంప్యూటర్లు కేటాయించి ల్యాబ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బోధకులను నియమించ లేదు. ఫలితంగా కంప్యూటర్లు మూలకు చేరుతున్నాయి. చాలా పాఠశాలల్లో ఇవి తుప్పుపట్టాయి. నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు రూమ్‌ల్లో విద్యార్థినులకు ఇతర సబ్జెక్టులకు సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా గదుల్లో డిజిటల్ తరగతులు నిమిత్తం ఇటీవల కొనుగోలు చేసిన ప్రాజెక్టర్లు పెట్టుకుంటున్నారు. అవి కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. ఇలా కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. నోటిఫికేషన్ వేసి కూడా.. కేజీబీవీలో కంప్యూటర్ బోధకుల నియామకానికి 2018 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించారు. అప్పట్లో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు తెరవెనుక బేరసారాలు కూడా జరిగాయి. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తడంతో నోటిఫికేషన్ అర్ధాంతరంగా నిలుపుదల చేసేశారు. దీంతో పోస్టులు భర్తీ నిలిచిపోయింది. అయితే ఏజెన్సీకి, అధికార పార్టీ నేతలకు మధ్య మామూళ్ల పంపకాల్లో వివాదం రావడంతో వీటిని నిలుపుదల చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో 32 కేజీబీవీలకు సంబంధించి మొత్తం 32 మంది కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్లను నియమించాల్సి ఉంది. ఇంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగలేదు. దీంతో కంప్యూటర్ విద్య కేజీబీవీల్లో కలగానే మిగిలిపోయింది. అంతా అస్తవ్యస్తమే.. బడికి దూరంగా ఉన్న విద్యార్థినుల నిమిత్తం, తల్లి, తండ్రిలేని ఆడపిల్లలకు ఉత్తమ విద్య అందించి ఆసరాగా ఉంచేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల, గిరిజన ప్రాంతాల విద్యార్థినులకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. అటువంటి వారు ఇంగ్లిషు మీడియంలో చదవాలంటే కష్టమే. కానీ నాలుగేళ్ళుగా ఆరు నుంచి పది తరగతుల వరకూ ఆంగ్ల మాధ్యమ బోధన చేపడుతున్నారు. బోధకులు కూడా తెలుగుభాషలో బీఈడీలు చేసి వచ్చినవారే. వీరితో ఓ వైపు బోధన సాగిస్తూ మరోవైపు కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు లేకుండా నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ విద్యార్థినులకు, డ్రాపౌట్స్‌కు ఈ విద్య ఎంతమేరకు అందుతుందో అధికారులకే ఎరుక. ప్రక్రియ కొనసాగుతోంది.. కేజీబీవీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. బోధకులు లేని విషయం వాస్తవమే. వీటి భర్తీకి నోటిఫికేషన్ కూడా గతంలో ఇచ్చాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం చివరి కల్లా కంప్యూటర్ బోధకులు నియామకం చేపట్టే అవకాశం ఉంది.– ఎం త్రినాథరావు, పీవో, సర్వశిక్షా అభియాన్ -
ఏ రోజు పాఠం.. ఆ రోజే పఠనం
నల్లగొండ : బాలికలను చదువుల్లో మేటిగా తయారుచేసి.. చదువుల తల్లులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సమగ్రశిక్షా అభియాన్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థినుల్లోని సృజనాత్మకత, సామర్థ్యాలను వెలికి తీసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా కేజీబీవీల్లో విద్యార్థినులతో తరగతుల వారీగా క్లబ్‌లు ఏర్పాటు చేస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన రోజునే ఈ క్లబ్లో చర్చించి.. చదువుతారు. ఇలా వారం రోజులపాటు చదివిన అంశాలపై వారాంతంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థినుల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో చదివే బాలికల్లో సామర్థ్యం పెంపునకు క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని అదే రోజు చదివి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే పాఠ్యాంశాలవారీగా ఆ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి ఆయా పాఠ్యాంశాల వారీగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్‌ల ఏర్పాటు ఇలా.. జిల్లాలోని 27 కేజీబీవీల్లో ఆరు నుంచి పది తరగతులకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేస్తారు. ఈ క్లబ్లో బాగా చదివే, మధ్యస్థంగా చదివే, బాగా తెలివైన, చెబితే అర్థం చేసుకోగలిగే విద్యార్థినులను సభ్యులుగా ఉంచుతారు. వీరిలో ప్రతిభావంతురాలయిన విద్యార్థిని ఈ క్లబ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తారు. అవసరమైతే సంబంధిత క్లాస్ టీచర్ లేదా గైడ్ టీచర్ సలహాలు తీసుకుంటారు. రోజూ పాఠశాల ముగిసిన అనంతరం 3.45 నుంచి 4.30 గంటల వరకు ఆ రోజు తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాలను ఈ సమయంలో క్లబ్‌ల్లో పఠనం చేస్తారు. క్లాస్ టీచర్‌తోపాటు గైడ్ టీచర్ కూడా ఇందులో సభ్యురాలిగా ఉంటారు. తరగతిలోని ప్రతి విద్యార్థిని ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏరోజు పాఠం ఆ రోజే చదవడం, పాఠం ఎంతవరకు అర్థమైంది.. ఒక వేళ అర్థంకాకపోతే.. మొదట తరగతి గదిలో లీడర్‌తో చెప్పించుకుంటారు. అయినా అర్థం కాకపోతే ఉపాధ్యాయులను కూడా అడిగి దానిపై అవగాహన తెచ్చుకునే విధంగా క్లబ్‌లు దోహదం చేస్తాయి. దీని ద్వారా విద్యార్థుల మధ్య పాఠ్యాంశం చర్చకు వచ్చి సులభంగా అర్థమవుతుంది. ఇలా క్లబ్‌ల్లో పాఠ్యాంశాలను చర్చించడం ద్వారా విద్యార్థుల మెదళ్లలో ఆ అంశాలు అలాగే ఉండిపోతాయి. వారాంతంలో పోటీ పరీక్షలు వారాంతంలో ఆయా పాఠ్యాంశాలపై ప్రతి తరగతిలో విద్యార్థినులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా పరీక్షలు నిర్వహిస్తారు. అంతేగాక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత బయటకు రావడంతో పాటు వారి కళలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడనున్నాయి. క్లబ్‌లు బాలికల చదువుకు ఎంతోమేలు కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థినులు క్ల బ్లుగా ఏర్పడి ఏరో జు పాఠం ఆరోజే చదవడం వల్ల వారు జ్ఞానం సంపాదించుకుంటున్నారు. అంతేకాక ఏరోజు కారోజు చదవడం వల్ల పరీక్షల సందర్భంలో ఒకేసారి చదవాల్సిన భారం ఉండదు. దాని ద్వారా విద్యార్థులు మంచి విద్యను పొందడంతో పాటు సులువుగా పరీక్షలు రాయగలుగుతారు. – అరుణశ్రీ, సెక్టోరియల్ అధికారి -
అసభ్య రాతల్ని అడ్డుకున్న బాలికలపై దాడి
సుపౌల్: స్కూలు గోడలపై అసభ్య రాతలను అడ్డుకున్న విద్యార్థినులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సుపౌల్ జిల్లాలోని దర్పాఖ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) పక్కనే మరో స్కూలు ఉంది. అయితే కేజీబీవీ బాలికలు మైదానంలో ఆడుకుంటుండగా అక్కడకు చేరుకున్న కొందరు పక్క స్కూలు అబ్బాయిలు గోడలపై అసభ్య రాతలు రాశారు. దీంతో ఆ అమ్మాయిలు వీళ్లను తన్నితరిమేశారు. వీరంతా ఇళ్లకు వెళ్లి తమపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్తులంతా ఏకమై మైనర్ బాలికలపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో 30 మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఓ మహిళ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
ఇదేం ‘శిక్ష’
♦ ఆడపిల్లల చదువుకు ఎన్నెన్నో అడ్డంకులు ♦ కేజీబీవీ విద్యార్థినులకు సంక్షేమ కళాశాలల్లో దొరకని సీట్లు ♦ పదోతరగతితోనే ఆగుతున్న చదువులు జిల్లాలోని 26 కేజీబీవీల పరిధిలో గత ఏడాది 915 మంది బాలికలు 10వ తరగతి పరీక్ష రాయగా, ఇందులో 703 మంది ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలు గతంలో కొన్ని ఐటీడీఏ పరిధిలో, మరికొన్ని సాంఘికసంక్షేమశాఖ పరిధిలో, ఇంకొన్ని సర్వశిక్ష అభియాన్ పరిధిలో నడిచేవి. వీటన్నింటిని ఎస్ఎస్ఏ(సర్వశిక్ష అభియూన్) పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కేజీబీవీ విద్యార్థినులకు కష్టాలు మొదలయ్యూరుు. పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించిన 703 విద్యార్థినుల్లో కేవలం 100 మందికి మాత్రమే సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలల్లో సీట్లు వచ్చారుు. మిగతా వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది. - ఖమ్మం ఖమ్మం: గత విద్యాసంవత్సరంలో ఖమ్మం రూరల్ మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయ(కేజీబీవీ)లోని పదోతరగతి విద్యార్థినులు 46 మందిలో 37 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ముగ్గురికి మాత్రమే సాం ఘిక సంక్షేమ శాఖ జూనియర్ కళాశాలలో సీటు వచ్చింది. మిగిలిన వారికి రాలే దు. వీరిలో, 9.3 జీపీఏ సాధించిన పి.లక్ష్మి ప్రస న్న కూడా ఉంది. ఇన్ని మార్కులు వచ్చి నా సీటు రాకపోవడంపై ఆమె కుమిలిపోతోంది. కొణిజర్ల కేజీబీవీలోని 49 మంది పదోతరగతి విద్యార్థినుల్లో 31 మంది ఉత్తీర్ణుల య్యారు. వీరిలో ఏ ఒక్కరికీ సాంఘిక సం క్షేమ, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో సీటు రాలేదు. వీరంతా, ఎక్కడ చదవాలో తెలీక అయోమయంలో ఉన్నారు. కారేపల్లిలోని కేజీబీవీలో పదోతరగతి పరీక్షలు రాసిన 39 మందిలో 25 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఎనిమిది మంది మినహా మిగిలిన వారికి సాంఘిక సం క్షేమ, గిరిజన సంక్షేమ కళాశాలల్లో వీరికి (ఆర్డర్ ఆఫ్ మెరిట్లో) సీట్లు రాలేదు. సెకండ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘అప్పటికీ సీటు రాకపోతే..’ అనే భయాందోళన వీరిని వెంటాడుతోంది. కేజీబీవీలన్నిటినీ ‘సర్వశిక్ష అభియాన్’ కిందికి తేవడంతో వారికి సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సీటు పొందలేని కేజీబీవీ బాలికలు.. ‘మాకు ఇదేమి శిక్ష?’ అని, తీవ్ర ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని కేజీబీవీలలో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థినుల్లో అనేకమందిది ఇదే పరిస్థితి. వీరిలో కొందరికి తల్లిదండ్రులు లేరు. ఇంకొందరికి ఎవరో ఒకరు మాత్రమే ఉన్నారు. ఆలనాపాలనా అందక ఇక్కడికి చేరిన వారు మరికొందరు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న వీరందరికీ చదువు చెప్పేందుకు కేజీబీవీలను కేంద్రం ప్రారంభించింది. పదోతరగతి వరకు వీరి చదువు సాఫీగా సాగింది. ఆ తరువాతనే ఇబ్బం దు లు ఎదురవుతున్నాయి. ‘‘ఎక్కడా సీటు రాకపోతే ఎలా? ఇంతటితో చదువు ఆపేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం’’ అని, వారు తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కళాశాలల్లో తగ్గిన సీట్లు కేజీబీవీ బాలికలకు మోడల్ స్కూల్స్, డీఆర్డీఏ, సంక్షేమ జూనియర్ కళాశాలల్లోని సీట్లలో గతంలో అత్యధికం కేటాయించేవారు. కేజీబీవీలలో కొన్ని ఐటీడీఏ పరిధిలో, మరికొన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో, ఇంకొన్ని సర్వశిక్ష అభియాన్ పరిధిలో నడిచేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందికి తీసుకరావాలనే ఆలోచనతో గత విద్యాసంవత్సరం నుంచి సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) పరిధిలోకి చేర్చారు. దీంతో, గతంలో సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించిన ఆ శాఖ అధికారులు.. తమ పరిధిలో కేజీబీవీలు లేవనే సాకుతో ఆ సంఖ్యను కుదించారు. మొత్తం సీట్లలో 60 శాతం వరకు కేజీబీవీ బాలికలకు కేటాయిస్తామని చెప్పిన అధికారులు.. తీరా ఇప్పుడు ఒక్కో కళాశాలకు కేవలం మూడంటే మూడు సీట్లే కేటాయించినట్టు సమాచారం. ‘‘మా పరిస్థితిపై అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. మా అందరికీ సంక్షేమ కళాశాలల్లోగానీ, మోడల్ స్కూల్స్లోగానీ, గిరిజన సంక్షేమ కళాశాలల్లోగానీ సీట్లు కేటాయించాలి’’ అని, కేజీబీవీ విద్యార్థినులు వేడుకుంటున్నారు. అగమ్యగోచరంలో 600 మంది జిల్లాలోని కేజీబీవీల్లో పదోతరగతి పూర్తయిన వారిలో 600 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. గత ఏడాది 915 మంది పదోతరగతి పరీక్షలు రాశారు. 703 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 100 మందికి మాత్రమే బాలికల సంక్షేమ జూనియర్ కళాశాలల్లో సీట్లు వచ్చినట్టు సమాచారం. మిగతా వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులతో చర్చిస్తా కేజీబీవీల్లో పదోతరగతి పూర్తిచేసిన బాలికలు ఇక్కడే ఇంటర్ చదివించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. వీరి పరిస్థితిపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో చర్చిస్తా. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మన జిల్లాలోని బాలికలకు సీట్లు ఎలా ఇప్పించాలనే విషయంపై అధికారులతో సంప్రదించి న్యాయం చేస్తాం. ఉన్నత చదువులకు వెళ్లేలా వారిని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. - రవికుమార్, ఎస్ఎస్ఏ పీఓ ఆర్వీఎం దృష్టికి తీసుకెళ్లాను పదిలో ఉత్తీర్ణులైన 25 మందితో సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలల్లో, మోడల్ స్కూల్స్‌లో దరఖాస్తు చేయించాం. ఎనిమిది మందికి మాత్రమే సీట్లు వచ్చాయి. మిగిలిన వారి పరిస్థితి ఒకింత దయనీయంగా ఉంది. పదితోనే చదువు ఆపాల్సి వస్తుందేమోనని, కూలీనాలీ పనులకు వెళ్లక తప్పదేమోనని వారు భయపడుతున్నారు. సెకండ్ కౌన్సిలింగ్‌లోనైనా సీట్లు వస్తాయోమోనని అనుకుంటున్నాం. ఈ విషయాలను ఇప్పటికే ఆర్వీఎం దృష్టికి తీసుకెళ్లాం. - ఝాన్సీ సౌజన్య, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ,కారేపల్లి