
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు.