KGBV
-
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై విచారణ
జి.మాడుగుల: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అసెంబ్లీకి సమయానికి రాలేదని ఇంటర్ సెకండియర్‌కు చెందిన 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఈవో బ్రహ్మాజీరావు, కేజీబీవీ జీసీడీవో కె.సూర్యకుమారి సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జీఎం కొత్తూరులోని కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను విచారించారు. కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం పూజలకు వెళ్లి అసెంబ్లీకి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రత్యేక అధికారి(ఎస్వో) సాయిప్రసన్న తమను కొట్టి.. జత్తు కత్తిరించారని విద్యార్థినులు వాపోయారు. దేవుని మొక్కు ఉందని చెప్పినా వినలేదని చెప్పారు. ఎస్వో ప్రవర్తనపై విద్యార్థినుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా వివరాలను నమోదు చేసుకున్నారు. ఎస్వో సాయిప్రసన్న మాట్లాడుతూ.. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థినుల జుత్తు కత్తిరించానని.. చేసింది తప్పేనని.. తనను క్షమించాలని కోరింది. చిన్నచిన్న తప్పులకు ఇంత దారుణంగా దండిస్తారా? అంటూ ఎస్వో సాయిప్రసన్నపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు అందించి.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికను తమకు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్వోను బ్లాక్మెయిల్ చేసిన టీడీపీ నేతఈ ఘటన బయటకు రాకుండా చూసుకుంటానని.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇచ్చేందుకు రూ.లక్ష కావాలంటూ వంజంగిపాటుకి చెందిన టీడీపీ నేత లకే రామకృష్ణ ఎస్వోను బ్లాక్మెయిల్ చేశాడు. తమ పేర్లు వాడినందుకు రామకృష్ణపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘కడుపు’పై కొట్టారు.. చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన
ఎన్నికల ముందు..‘వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తాం.. సంపద సృష్టించి పంచుతాం’ అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు.గద్దెనెక్కాక..మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. చేస్తున్న చిన్న చిన్నఉద్యోగాలను సైతం అన్యాయంగా ఊడగొడుతున్నారు. చిన్న జీతం తీసుకునే చిరుద్యోగుల పొట్ట గొడుతూ ‘తమ్ముళ్ల’ జేబులు నింపుకోమంటున్నారు. చివరకు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్ర పరిచే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి.. ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపు పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ‘ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు’ అని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కాకినాడ జిల్లా కోటనందూరు (అల్లిపూడి) కేజీబీవీలో 2017 ఫిబ్రవరిలో నియమితులైన ఆయా కాళ్ల సత్యవతి(బీసీ)ని టీడీపీ నేతలు తొలగించారు. భర్త లేని ఆమె ఈ వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇదే కేజీబీవీలో రెండేళ్ల నుంచి వంటమనిషిగా పని చేస్తున్న దారా ఆదిలక్ష్మి(ఎస్సీ)ని సైతం గురువారం టీడీపీ నేతలు తొలగించి, తమ మనిషిని నియమించున్నారు. ఇలా ఒక్క చోట కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్లో చూసినా దుర్మార్గపు తొలగింపులు పరిపాటిగా మారాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్ల వరకూ అందరినీ తొలగించాలంటూ టీడీపీ నేతలు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఆదేశిస్తున్నారు. ముడుపులు దండుకుంటున్న ‘పచ్చ’ నేతలుతొలగించిన వారి స్థానంలో నియమిస్తామంటూ ఆశావహుల నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించకూడదంటూ అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. 10, 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు.. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగిస్తున్నారు. ఆ స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తాళలేక ఇప్పటికే 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులు తొలగించారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులు.. తొలగింపులు..ప్రభుత్వ బడుల్లో, కేజీబీవీల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజనం వంట కార్మీకులు, ఆయాలు, స్వీపర్లను బెదిరించి బలవంతంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో అన్ని విభాగాల్లోనూ పార్ట్‌టైమ్ సిబ్బంది సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది 14 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. వీరి నియామకం రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు తొలగింపు మాత్రం స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట కొత్త వారి నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు డీఈవోలు, ఏపీడీలను ఆదేశించారు. ఇదే అదనుగా టీడీపీ వారు గతంలో నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, తమ వారిని నియమించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపి ఆమోదించుకుంటున్నారు. పలు గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.అన్ని జిల్లాల్లోనూ కన్నీటి గాథలే..⇒ విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాణి మల్లమ్మదేవి, యుద్ధ స్తంభం, డివైడర్ల మధ్య ఉన్న మొక్కల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న 16 మంది చిరు ఉద్యోగులను తొలగించారు. గంట్యాడ మండలం కొటారుబిల్లి కేజీబీవీలో 2019 నుండి పని చేస్తున్న వంట మనిషి రొంగలి శ్రీలక్ష్మి, వాచ్మెన్ ఆర్.దుర్గను తొలగించి, తమ వాళ్లను పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని చుక్కవలస, ఏనుగువలస, వెదుళ్లవలస, మెరకముడిదాం మండలంలో భైరిపురం, గర్భాం, కొత్తవీధి, శ్యామయావలస రేషన్ డీలర్లను తొలగించారు. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, మెరకముడిదాం మండలంలోని రామయవలస, గుర్ల, తెట్టంగి, పెనుబర్తి గ్రామాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. చీపురుపల్లి మండలం పేరిపిలో వేధింపులు భరించలేక ఓ ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేశారు. గుర్ల మండలం శేషపుపేటలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించారు. ⇒ పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘంలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 50 మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మీకులను (ఆప్కాస్) టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు తొలగించారు. వీరు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును కలిసినా, వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు అంగీకరించలేదు. ⇒ వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె, బాలాయపల్లె, గంగనపల్లె, ఓబులాపురం, ఉప్పలూరులో రేషన్ డీలర్లను తొలగించారు. కలసపాడు మండలంలో పలువురు డీలర్లను తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పలువురు లబి్ధదారుల పింఛన్ తొలగించాలని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామంలోని డ్వాక్రా గ్రూప్ బుక్‌కీపర్ కె శివనాగేంద్రమ్మను తొలగించారు. పెనమలూరు నియోజకవర్గంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని తొలగించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో 10 మంది వీవోఏలను, కందుల భవాని, మరో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, జయంతిపురం గ్రామంలో 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీదారులను తొలగించారు. ⇒ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు, మధ్యాహ్న¿ోజన కార్మీకులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్, డీఆర్డీఏలో ఉండే విలేజ్ ఆర్గనైజేషన్ అడ్మిని్రస్టేటర్లు ఇలా 67 మంది మహిళల ఉద్యోగాలు తొలగించారు. ఏలూరు నగరంలో అధికార పార్టీ వేధింపులు తాళలేక డ్వాక్రా రిసోర్స్ పర్సన్ పిల్లి విజయలక్ష్మి, ఉంగుటూరు మండలంలో పి.కనకదుర్గలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్నారు. ⇒ ప్రకాశం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 300 మంది వీవోఏలు, 370 మంది మధ్యాహ్న భోజన కార్మీకులు, 200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వంద మంది మున్సిపల్ కార్మికులు, 50 మంది ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, 20 మంది పంచాయతీ కార్మీకులు, 15 మంది స్వచ్ఛభారత్ కార్మికులను తొలగించారు. 2.65 లక్షల వలంటీర్లకు ఉద్వాసనే..2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే పక్కన పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.పది వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వారిని పక్కన పెట్టారు. దేవుడి సాక్షిగా తొలగింపు అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న 48 మంది దినసరి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 80 మంది మధ్యాహ్న భోజనం కార్మీకులను తొలగించారు. పలువురు రేషన్ డీలర్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా తొలగించి, వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి జాబితాలు తయారు చేశారు. ప్రైవేటు కంపెనీలనూ వదలడం లేదు. స్థానికంగా కంపెనీలు నడపాలంటే తమకు కప్పం కట్టడంతో పాటు తాము చెప్పిన వారినే కార్మీకులుగా పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. రణస్థలంలోని యూబీ బీర్ల కంపెనీలో ఏం జరిగిందో అందరూ చూశారు. కూటమికి అనుకూలంగా లేని కార్మీకులను తొలగించారు. మూలపేట పోర్టులోనూ అదే జరిగింది. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులంతా పోర్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేయడమే కాకుండా కార్యకలాపాలకు అడ్డు తగలడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఫోర్జరీ సంతకాలతో డీలర్ల తొలగింపుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం దాచూరులో పొదుపు గ్రూపులకు సంబంధించిన వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)గా పని చేస్తున్న మహిళను తొలగించి ఆ స్థానాన్ని రెండుగా విభజించి టీడీపీకి చెందిన కార్యకర్తలను నియమించాలని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సిఫార్సు లేఖ పంపారు. కోవూరు నియోజకవర్గం గంగవరంలో రేషన్ షాపు డీలర్‌ను తొలగించి ఆ పోస్టును స్థానిక టీడీపీ నాయకుడు లక్ష్మీనరసారెడ్డి (బాబురెడ్డి) బేరంపెట్టి రూ.2 లక్షలకు వేరొక వ్యక్తికి కట్టబెట్టాడు. కందుకూరులో 16 రేషన్‌షాపు డీలర్లను తొలగించేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. స్థానిక డిప్యూటీ తహసీల్ధారుతో కుమ్మక్కై డీలర్లకు తెలియకుండానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి రాజీనామా చేసినట్లు లేఖలు పంపడం సంచలనంగా మారింది. తాము రాజీనామాలు చేయలేదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. కందుకూరు, కావలిలలో వైన్‌షాపులలో పనిచేసే 70 మంది సేల్స్మెన్లు, సూపర్వైజర్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను పెట్టాలని స్థానిక టీడీపీ నేతలు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. కందుకూరులో 50 మందిని తొలగించి వారి స్థానంలో ఆ పోస్టులకు మామూళ్లు దండుకుని టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా జాబితా తయారైంది. మున్సిపాలీ్ట, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో దాదాపు 15 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు ఏకంగా స్థానిక టీడీపీ నేతలు ఉపాధి హామీ పనులను నిలిపివేశారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు, కొడవలూరు మండలాల పరిధిలో పొదుపు గ్రూపులకు సంబంధించిన 10 మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామాలుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మీకులు, డీలర్లు, సంఘమిత్రలు, ఆర్పీలను తప్పుడు ఫిర్యాదుల ద్వారా టీడీపీ నేతలు తొలగిస్తున్నారు. పలుచోట్ల అధికారులు తలొగ్గి చిరుద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ఆయాలు, అంగన్వాడీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పాలు, సరుకులు ఇవ్వడం లేదని, కేంద్రాలు తెరవడం లేదని, పిల్లలు రావడం లేదని తప్పుడు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆర్పీలు, సంఘమిత్రల తొలగింపునకు గ్రామాల్లో డ్వాక్రా సంఘాలను రెచ్చగొట్టి వీధుల్లోకి లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో 192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజీనామా చేయించారు. రేషన్ డీలర్లు 190 మంది, సంఘమిత్రలు 65 మందిని తొలగించారు. చిత్తూరు జిల్లాలో 86 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అడ్డగోలుగా తొలగించారు. 126 మందిని పని చేయనివ్వకుండా అడ్డుకున్నారు. 34 మందికి నోటీసులు ఇచ్చారు. 47 మంది సంఘమిత్రలను తొలగించాలని అధికారులకు సిఫార్సులు వెళ్లాయి. ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది 112 మందిపై వేటు వేయాలని చూస్తున్నారు. ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీనే అడ్డుకున్న టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులకు కొరత లేకుండా ఉండేలా గత ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన జిల్లా స్థాయి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్ నర్స్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెపె్టంబర్లో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్‌లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఈ ఏడాది జూన్‌లో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. అదే నెల 6న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని ప్రకటించారు. కాగా, అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని నోటిఫికేషన్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తుండటంపై వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, వివిధ జిల్లాల నుంచి కూడా కూటమి నేతలు పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఉద్యోగులపై కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించారన్న ఏకైక కారణంతో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్ బోర్డు వంటి కీలక సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తగా తమ వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న ఏపీఐఐసీలోని జీఎం స్థాయి అధికారి వేగంగా పావులు కదుపుతున్నారు. 2019 జూన్ తర్వాత నియమించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలంటూ ఇటీవల కొంత మంది పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆ వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ ఆ ఉన్నతాధికారి జీఎంలకు లేఖలు రాసి, వివరాలు తెప్పించారు. ఇప్పటికే నెల జీతం రూ.40,000 పైన ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన ఏపీఐఐసీ, తాజాగా ఇప్పుడు అంతకంటే తక్కువ జీతం ఉన్న వారిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఇలా సుమారు 170 నుంచి 180 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఏపీ మారిటైమ్ బోర్డు, దాని అనుబంధ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు కింద ఉన్న రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు లిమిటెడ్‌లో రూ.40 వేలకు పైగా జీతం ఉన్న ఉద్యోగులను తొలగించారు. త్వరలోనే అంతకంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా మొదలు కావచ్చని చెబుతున్నారు. డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారుప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎటువంటి రిమార్కు లేకుండా ప్రజలకు రేషన్ పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం రాగానే డీలర్ షిప్‌లకు రాజీనామా చేయాలని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలలుగా కమీషన్ కూడా ఇవ్వలేదు. మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – పాటిల్ ప్రకాష్‌రెడ్డి, పెద్దకోట్ల, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా మా ఉసురు తప్పక తగులుతుందిమధ్యాహ్న భోజన పథకం కార్మీకురాలిగా పథకం పుట్టినప్పటి నుంచి పని చేస్తున్నా. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా మార్చేశారు. నాపై ఎలాంటి ఆరోపణలూ లేవు. అయినా నువ్వు వంట చేయొద్దంటూ నా వంట పాత్రలన్నీ బయట పడేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తప్పించారు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలి. లేదంటే మాలాంటి వారి ఉసురు తగులుతుంది. – ఎస్.సరస్వతి, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మీకురాలు, గంగవరం, బెళుగుప్ప మండలం, అనంతపురం జిల్లాసంఘాల మద్దతున్నా తొలగించారునేను 18 మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యుల మద్దతుతో తుంగాన పుట్టుగ గ్రామైక్య సంఘానికి వీఓఏగా ఎన్నికయ్యాను. నా బాధ్యతల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చేసిన సేవల్ని గుర్తించిన అధికారులు మహిళా దినోత్సవం నాడు జ్ఞాపికతో సత్కరించారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే నన్ను అకారణంగా తొలగించారు. 18 సంఘాల వారు నన్ను కొనసాగించాలని చెబుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నా జీతం బకాయి కూడా ఇవ్వలేదు. – తుంగాన అంజలి, తుంగానపుట్టుగ గ్రామైక్య సంఘం వీఓఏ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాబలవంతంగా రాజీనామా చేయించారుగతంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాధి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి సరైన ఆధారాలు దొరకడంతో తొలగించారు. ఆ స్థానంలో ఉపాధి కూలీగా పనిచేస్తున్న నా అనుభవం, విద్యార్హత చూసి ఫీల్డ్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించారు. ఏటా నిర్వహించే సామాజిక తనిఖీలో నాపై ఎలాంటి రికవరీలు లేవు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వారికి అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఇలా చిరుద్యోగుల కడుపు కొట్టడం సరికాదు. – మునెయ్య, కందాడు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లానా జీవనం ప్రశ్నార్థకంగా మారిందిగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాచ్‌మెన్‌గా రెండేళ్లుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాననే నెపంతో నన్ను విధుల నుంచి తొలగించారు. నా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్యాయంగా పొట్ట కొట్టడం సరికాదు. – మాలాజీ ఏసుబాబు, జయంతి, వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుశ్రీసత్యసాయి జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మీకులు, ఏజెన్సీల నిర్వాహకులు, రేషన్ షాపుల డీలర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పాఠశాలల వాచ్మెన్లు, వలంటీర్లను బలవంతంగా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 7,836 మంది వలంటీర్లను తీసేశారు. 346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,730 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మీకులను వీధిన పడేశారు. 97 మంది వాచ్మెన్లను తొలగించారు. 1,367 మంది రేషన్ డీలర్లను మార్చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,125 రేషన్ డీలర్లను మార్చేశారు. 420 మంది యానిమేటర్లను తప్పించారు. 677 స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,300 మందికి పైగా కార్మికులను తొలగించారు. 274 మంది వాచ్మెన్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాలు 450 మందికి పైగా తొలగించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో రాజీనామా చేయించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్కూళ్లలో టాయ్‌లెట్స్ క్లీన్ చేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. చౌక డిపో డీలర్లు అత్యధిక శాతం టీడీపీ వారే ఉన్నారు. ప్రతి పది షాపులకు ఒకరిని ఇన్చార్జ్గా నియమిస్తున్నారు. వారి ద్వారా మామూళ్లు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. -
బాధ్యతలు పెంచినా.. జీతాలు పెంచలే!
సాక్షి, హైదరాబాద్: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు.. తమ సమస్యలను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు అనేక బాధ్యతలు అప్పగించి, వేతనం మాత్రం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని అంటున్నారు. ఇటీవల కేజీబీవీ సంఘ నేతలు, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం నేతలు దీనిపై సర్కారుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నా.. వారితో సమాన గౌరవం లభించడం లేదని అందులో వాపోయారు. కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేస్తున్నప్పటికీ అందుకు తగినట్టుగా మౌలిక వసతులు కల్పించడం లేదని.. పట్టించుకోకుంటే చదువుల నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు చేయాల్సిన పనులన్నీ ఏళ్ల తరబడి కాంట్రాక్టు కొలువుల్లో ఉన్న తమపై వేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. పెరిగిన విధులు.. పెరగని వేతనం.. బాలికలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితిని మార్చే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2010–11లో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. హాస్టల్‌తోపాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో 450 కేజీబీవీలున్నాయి. తొలుత ఆరు, ఏడు తరగతులే ప్రారంభించి.. తర్వాత టెన్త్ వరకూ, 2018–19లో ఇంటర్మీడియట్ వరకూ అప్‌గ్రేడ్ చేశారు. ప్రతీ కేజీబీవీకి ఒక స్పెషల్ ఆఫీసర్ సహా ముగ్గురిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వారికి చాలా ఏళ్లుగా నెలకు రూ.32,500 వేతనమే అందుతోంది. ఇంటర్మీ డియట్ వరకు అప్‌గ్రేడ్ చేయడంతో విధులు పెరిగాయి. నెలకు కేవలం రెండే క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అత్యవసరమై అదనంగా సెలవు పెడితే వేతనంలో కోతపడుతుంది. అనుక్షణం విధుల్లోనే.. స్కూల్, హాస్టల్, ఇంటర్ కాలేజీల నిర్వహణ మొత్తం ప్రత్యేక అధికారి చూసుకోవాలి. కొన్ని జిల్లాల్లో మోడల్ స్కూళ్ల బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. కొత్తగా నిర్మిస్తున్న కేజీబీవీల్లో స్కూల్ ఒకచోట హాస్టల్ మరోచోట ఉంటున్నాయి. దీంతో అన్ని విధులు నిర్వర్తించడం కష్టంగానే ఉందని వారు చెబుతున్నారు. రాత్రి విధులప్పుడు చాలా ఇబ్బందిపడుతున్నామంటున్నారు. ఆ రోజు మధ్యా హ్నం నుంచి మర్నాడు మధ్యాహ్నం వరకూ నిరంతరం డ్యూటీ ఉంటుందని, దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. 2017లో జాబ్‌చార్ట్ ఇచ్చినా అందులో మార్గదర్శకాలు ఇవ్వలేదని.. దీనితో అధికారులు ఇష్టానుసారం బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. హాస్టల్లో విద్యార్థులను గమనించడం, భోజనం నాణ్యత పరిశీలించడం, కాలేజీలో విద్య నాణ్యత వంటి విధుల్లో ఎక్కడ తేడా వచ్చిన అధికారులు తమనే బలిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని సానుభూతితో పరిశీలించాలని కోరుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నాం కేవలం చిన్న స్కూళ్ల విధుల కోసమంటూ మమ్మల్ని తీసుకుని తర్వాత రెట్టింపు బాధ్యతలు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా వేతనం పెంచలేదు. టీచర్ల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థినుల ఉన్నతికి తోడ్పడుతున్నాం. మాకు పని ఒత్తిడి తగ్గించి, వేతనం పెంచితే తప్ప మేం సంతృప్తిగా పనిచేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా గోడు ఆలకిస్తుందని ఆశిస్తున్నాం. – దోపతి శ్రీలత, రాష్ట్ర కేజీబీవీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వారి పరిస్థితి మెరుగుపర్చాలి.. కేజీబీవీ ప్రత్యేక అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ఇటీవల వినతిపత్రం ఇచ్చాం. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా కేజీబీవీ ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపర్చాలి. –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లోని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మిడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు 100 రోజుల ‘పంచతంత్ర’ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్, టీచర్లతోపాటు డీఈవోలు, ప్రాజెక్టు కో–ఆరి్డనేటర్లు, జీసీడీవోలు, ఎంఈవోలు చేపట్టాల్సిన విధివిధానాలను సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు రూపొందించి కేజీబీవీలకు పంపారు. శనివారం నుంచి వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ వరకు (100 రోజులు) అనుసరించాల్సిన రోజువారీ ప్రణాళికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థులపై శ్రద్ధ పెట్టేలా.. కేజీబీవీల్లో 2022–23 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో 67 శాతం, ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 59.37 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 41.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ వందరోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులు 13,217 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 9,654 మంది, రెండో ఏడాది విద్యార్థులు 8,093 మంది, మొత్తం 3,0964 మంది ఉన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా పాఠ్యాంశాల వారీగా యాక్షన్ ప్లాన్‌ను తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థినులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలకు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సమగ్ర శిక్ష ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమంచాలని ఇప్పటికే సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వచ్చే నెలాఖరు నాటికి విద్యార్థినులకు డబుల్ బంకర్ బెడ్లు అందించనున్నారు. ఉత్తమ ఫలితాలకు పురస్కారం గత ఏడాది ఫలితాలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. పది, ఇంటర్మిడియెట్ పరీక్షలు రాసే విద్యార్థినులు, ఉపాధ్యాయులపై ఈ వందరోజులు రాష్ట్ర స్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ రోజువారీ స్టడీ ప్లాన్, టైం టేబుల్ ఇచ్చాం. వెనుకబడిన విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కూడా ఇస్తాం. ఇంటర్లో బాగా చదివేవారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఇస్తాం. వారు నీట్, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా శిక్షణ ఉంటుంది. – డి.మధుసూదనరావు, కేజీబీవీ కార్యదర్శి -
కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్లు
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్మిడియెట్ వరకు చదువుతున్న 98,560 మంది విద్యార్థినులకు మంచాలు అందించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విద్యార్థినులకు అన్ని రకాలుగా అనువుగా ఉండేలా స్టోరేజీ బాక్స్‌తో ఉండే రెండు లేదా మూండంచెల బంకర్ బెడ్లను అందించాలన్నారు. వీటిని డిసెంబర్ నెలాఖరుకు ఆయా పాఠశాలలకు అందించాలని యోచిస్తున్నారు. దీంతో 98,560 మంది విద్యార్థినులకు మేలు కలగనుంది. కేజీబీవీలకు గత టీడీపీ ప్రభుత్వం 2018లో మందపాటి బొంతలను మాత్రమే ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై సమగ్ర శిక్ష, కేజీబీవీ అధికారులు ఆరా తీశారు. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ డిసెంబర్‌లోగా మంచాలు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే కేజీబీవీల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి మాత్రలు అందజేసింది. ఆ పరీక్షల రిపోర్టును రికార్డు చేసేందుకు ‘హెచ్‌బీ పర్సంటేజ్’ కార్డులను సైతం ఆయా స్కూళ్లకు అందించింది. చదువుకునేందుకు కూడా ఉపయోగపడేలా.. ఏపీలో 2004–05 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను అందుబాటులోకి తెచ్చారు. తొలుత 6 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించారు. అనంతరం ఇంటర్మిడియెట్ వరకు పెంచారు. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో 98,560 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి గత ప్రభుత్వం బొంతలు మాత్రమే అందించడంతో నేలపై పడుకోవాలి్సన దుస్థితి తలెత్తింది. పేదింటి ఆడపిల్లలు చదువుకునే విద్యాలయాల్లో వారికి మంచాలు అందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థినులు పడుకునేలా, వాటిపై కూర్చుని చదువుకునేందుకు అనువైన ఎత్తు ఉండేలా బంకర్ బెడ్లను తయారు చేయిస్తున్నారు. ఒకదానిపై ఒకటి ఉండి ఇనుముతో చేసిన బంకర్ బెడ్లు అడుగున విద్యార్థినుల పుస్తకాలు, ఇతర సామగ్రి దాచుకునేందుకు వీలుగా స్టోరేజీ బాక్స్‌లను సైతం బిగించనున్నారు. -
ఐరాస సదస్సుకు ఎటపాక కేజీబీవీ విద్యార్థిని
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్‌కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్లైన్లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం. -
రోడ్డు ప్రమాదంలో కేజీబీవీ ఎస్ఓ మృతి
సాక్షి, శ్రీకాకుళం: బూర్జ మండలం వైకుంఠపురం కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్.ఎన్.పేట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మండల శ్రీదేవి(38) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పెద్దకాపు వీధికి చెందిన శ్రీదేవి ఐదు నెలలుగా ఎల్.ఎన్.పేట కేజీబీవీ ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ పాలకొండ నుంచి ఆమదాలవలస వరకు స్కూటీపై వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఎల్.ఎన్.పేట వెళ్లేవారు. ఎప్పట్లాగే శుక్రవారం కూడా విధుల్లో భాగంగా స్కూటీపై వస్తుండగా వైకుంఠపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొట్టారు. ఈ ఘటనలో దవడ భాగం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చదవండి: (షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి) స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. సిబ్బంది వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. అదే వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీదేవికి తల్లి విజయలక్ష్మి, తమ్ముడు దినేష్, వివాహితురాలైన చెల్లి రేణుక ఉన్నారు. దినేష్ ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేటలో విషాదం.. శ్రీదేవి మృతితో ఎల్.ఎన్.పేటలో విషాదం అలముకుంది. కేజీబీవీ ఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బోధనతో పాటు విద్యారి్థనులను తోబుట్టువులా చూసుకునేవారని స్థానికులు చెబుతున్నారు. మంచి ఎస్ఓను కోల్పోయామని సిబ్బంది, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతి పట్ల ఎల్.ఎన్.పేట జెడ్పీటీసీ కిలారి త్రినాథులు సంతాపం తెలియజేశారు. -
నేరడిగొండ కేజీబీవీ ఎస్వో సస్పెండ్
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యం(కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ సస్పెండ్ అయ్యారు. ఈ కేజీబీవీలో నాసిరకం భోజనం తిని విద్యార్థినులు ఆదివారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. సోమవారం కూడా కిచిడీలో వెంట్రుకలు, అన్నం, పప్పులో పురు గులు, వెంట్రుకలు వచ్చాయి. ఆది వారం జరిగిన సంఘటన మర్చిపోక ముందే మళ్లీ ఇలా జరగడంతో పాఠశా లకు విచ్చేసిన పలువురు ఇదేంటని మండిపడ్డారు. పాఠశాలలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి కొంతమంది విద్యార్థిను లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీఈవో ప్రణీత అక్కడికి చేరుకుని జయశ్రీని సస్పెండ్ చేయడంతో పాటు వంట నిర్వాహకులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే పాఠశాలలో 248 మంది విద్యార్థినులుండగా ఇలా జరగడంతో పలువురు ఇంటిబాట పట్టారు. సోమవారం రాత్రి వరకు 72 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారు. -
కేజీబీవీలో నాసిరకం ఆహారం
నేరడిగొండ: నాసిరకం భోజనం కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో 248 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం టిఫిన్ (చపాతి, పెసరపప్పు) చేసిన 11మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో మిగతా విద్యార్థులు కేజీబీవీ భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. ఇటీవల భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సెలవుదినం కావడంలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూడా సిబ్బందిని నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ జయశ్రీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సెక్టోరల్ అధికారి ఉదయశ్రీకి పలువురు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయగా, సోమవారం వచ్చి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపాల్‌ను ఈ విషయమై సంప్రదించగా.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. కాగా, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విద్యార్థినుల నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. -
వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్‌నగర్‌టౌన్: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్‌కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్‌నగర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్‌కు చెబితే పెయిన్‌బామ్ రాసుకోమనడంతో, జండూబామ్ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్‌కు చెప్పారు. చదవండి: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన సమాచారం అందుకున్న తండ్రి శంకర్ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్ ముందే ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మృతికి కారణమైన ఎస్వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
కేజీబీవీల కేటాయింపుపై కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 2022–23లో అదనంగా 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) కేటాయించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కేజీబీవీల్లో 696 అంటే దాదాపు 15 శాతం విద్యాలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కలిపి మొత్తం 31 కేజీబీవీలను కేటాయిస్తే అందులో రాష్ట్రానికి 20 కేటాయించారన్నారు. నాలుగేళ్లలోనే కేంద్రం తెలంగాణకు 104 నూతన కేజీబీవీలను కేటాయించిందని చెప్పారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారని కిషన్‌రెడ్డి వివరించారు. బడుగు బలహీన, అణగారిన వర్గాల పిల్లలను ఒకేచోట చేర్చి వారి మధ్య సమానత్వ భావనను పెంపొందించడం వీటి ఉద్దేశమని పేర్కొన్నారు. -
ఆ మేడం వస్తే మేం వెళ్లిపోతాం!
ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు మారడం లేదు. గతనెల జిల్లా కేంద్రంలోని రూరల్ కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 90 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు కన్నీరుమున్నీరు కాగా, కలెక్టర్ విచారణ చేపట్టి రూరల్ కేజీబీవీ ప్రత్యేక అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఎస్వోపై సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈమేరకు విద్యార్థులతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎస్వోను తిరిగి విధుల్లోకి తీసుకుంటే తాము ఈ పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, బిస్కెట్లు పెడతామని.. ఫుడ్ పాయిజన్ తర్వాత పరిస్థితి మారిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువుతోపాటు నాణ్యమైన భోజనం పెడుతున్నారని పేర్కొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం పాఠశాలలో పనిచేసే స్వీపర్ కవిత, వంటచేసే సిబ్బంది సుందరమ్మ, సరస్వతి, అనిత బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు చేయించారని విద్యార్థులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాలలో డ్యూటీ సీఆర్టీ మాత్రమే ఉన్నారు. వీరితోపాటు ఈ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి చికెన్ తింటారా.. బిస్కెట్లు కావాల అని అడిగి 7, 8వ తరగతి విద్యార్థులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే మీకు చికెన్, బిస్కెట్లు తెప్పించడానికని వారిని నమ్మించారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా సంతకం పెట్టించలేదని, కొత్తగా ఎందుకు పెట్టిస్తున్నారని మరికొంతమంది అడిగారు. ఈ సిబ్బంది సస్పెన్షన్‌కు గురైన ఎస్వోకు మద్దతుగా సంతకాలు చేయించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరితోపాటు ఓ దళిత సంఘానికి చెందిన నాయకుడు ఫుడ్‌పాయిజన్ జరిగిన సమయంలో విద్యార్థులకు మద్దతుగా నిలవగా, ప్రస్తుతం ఎస్వోకు మద్దతుగా విద్యార్థులతో సంతకాలు పెట్టించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంటున్నారు. ‘మీరు రెండు సంవత్సరాలు ఉండి వెళ్లిపోతారు.. పాత టీచర్‌ను తీసుకుంటే మీకేం ఇబ్బంది’ అని విద్యార్థులను ప్రశ్నించారని తెలిపారు. నిబంధనల ప్రకారం కేజీబీవీలోకి ఎవరినీ అనుమతించరాదు. అయినా అక్కడ పనిచేసే సిబ్బందిని బెదిరించి సదరు నాయకుడు క్యాంపస్‌లోనికి వచ్చి విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం. తల్లిదండ్రుల ఆందోళన.. కేజీబీవీలో విద్యార్థినిలను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కేజీబీవీ వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను, అక్కడ పనిచేసే సిబ్బందిని నిలదీశారు. తమకు తెలియకుండా తమ పిల్లలతో తెల్లకాగితంపై ఎందుకు సంతకాలు తీసుకున్నారని నిలదీశారు. తమ పిల్లలకు ఏమైన జరిగితే వారే బాధ్యులని హెచ్చరించారు. ఎస్వోను తిరిగి ఈ పాఠశాలలో తీసుకుంటే తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్న సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చదువుకోం మా పాత మేడం ఉన్నప్పుడు సరిగా మాకు భోజనం పెట్టేవారు కాదు. నాసిరకం భో జనం, కలుషిత నీరు అందించారు. దీంతో తాము అనారోగ్యం బారిన పడ్డాం. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యాం. ఆ మేడం సస్పెండ్ అయినప్పటి నుంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. మళ్లీ ఆమె వస్తే మేం ఇక్కడ చదువుకోం. – నిక్షిత, విద్యార్థిని బలవంతంగా సంతకాలు.. రెండు రోజుల కింద స్వీపర్, అటెండర్ నన్ను గేటు దగ్గరికి పిలిచి ఒక తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారు. ఎందుకోసమని అడిగితే చికెన్, బిస్కెట్లు ఎంతమంది తింటారనేది రాసుకుంటున్నామని చెప్పారు. వారు ఒత్తిడి చేయడంతో నాకు తోచక సంతకం చేశాను. – ప్రసన్న, విద్యార్థి విద్యార్థులతో మాట్లాడాను కేజీబీవీ విద్యార్థులతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడాను. సిబ్బందికి ఈ విషయమై హెచ్చరించాను. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాను. – ప్రణీత, డీఈఓ, ఆదిలాబాద్ -
బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..) ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్‌స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్‌కి పంపారు.. రెండు నెలల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల కిందట మంచాల కస్తూర్బాగాంధీ గిరిజిన బాలికల హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మంచాల ఎస్సై రామన్ గౌడ్ కథనం ప్రకారం.. నగరంలో భిక్షాటన చేసే ఆరుగురు బాలికలను చైల్డ్‌లైన్‌వారు ఆపరేషన్ స్మైల్ ద్వారా చేరదీసి నగరంలోని చంద్రాయన్‌గుట్టలోని ఎంవీ ఫౌండేషన్‌లో చేర్పించారు. అక్కడ నుంచి రెండు నెలల కిందట మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల హాస్టల్లో చేర్పించారు. వారిలో సమ్రీన్(14) 9వ తరగతి, నుస్రత్(13) 8వ తరగతి చదువుతోంది. వీరు ఇరువురు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి పారిపోయారు. గమనించిన హాస్టల్ వార్డెన్ శ్రీలతారెడ్డి ఎంవీ ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: First Gay Marriage In Telangana: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్ -
భోజనం నాణ్యత విషయంలో రాజీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్నిచోట్ల వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కోరారు. భోజనం బిల్లులు రాలేదని కొందరు చెబుతున్నారని.. వాటిని సకాలంలో పోర్టల్‌లో ఎందుకు పొందుపరచలేకపోయారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో బకాయిల వివరాలను వెంటనే పోర్టల్‌లో పొందుపరిచి నివేదిక ఇవ్వాలన్నారు. త్వరలోనే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా కాజీపేట పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదికివ్వాలని ఆదేశించారు. కొన్నిచోట్ల టీచర్ల మధ్య అంతర్గత విభేదాలతో అసత్య కథనాలు బయటకు వస్తున్నాయని, ఇలాంటి వివాదాలకు కారణమైన టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల పర్యవేక్షణకు అధికారులతో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. -
కేజీబీవీల్లో 958 టీచింగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. పోస్టులను భర్తీ చేసి ఈనెల 20వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్దేశించారు. రిజర్వుడ్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మాధ్యమంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగిస్తారు. టీచింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో, ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు, సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, డీఈవోలు విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్ జాబితా వెలువరిస్తారు. విద్యార్హతలు, నెలవారీ వేతనాలు ఇలా ప్రిన్సిపాల్ (స్పెషలాఫీసర్): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.27,755 సీఆర్టీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీతో పాటు ఏపీటెట్ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.21,755 పీఈటీ: 50 శాతం కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్లో అర్హత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వేతనం రూ.21,755 పీజీటీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12,000 పీజీటీ వొకేషనల్: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమో చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీ వొకేషనల్ పోస్టులో రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12000. -
జాగ్రత్తల నడుమ ‘కస్తూర్బా’ తరగతులు
సాక్షి, అమరావతి: అనాథ, నిరుపేద బాలికలకు విద్యాబుద్ధులు నేర్పే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) తరగతులను ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అనేక జాగ్రత్తలు చేపట్టింది. వసతి గృహాలతో కూడిన ఈ విద్యాలయాల్లో 9వ తరగతి నుంచి 12 వరకు గల విద్యార్థినులకు సోమవారం నుంచి తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ప్రస్తుతం నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో అదనపు గదులు, కిచెన్ షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన విద్యాలయాల్లో మాత్రం అక్కడి పరిస్థితుల ఆధారంగా తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ డిసెంబర్ నెలాఖరులోగా అన్ని విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేలా సూచనలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉండగా.. వాటిలో సుమారు 75 వేల మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమైన కేజీబీవీల్లో పరిపాలనా భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, డైనింగ్ హాల్స్, కిచెన్ షెడ్స్ అన్నిటినీ శానిటైజ్ చేయించారు. బియ్యం, ఇతర సరుకులు, కూరగాయలు, పాలు, వంట గ్యాస్‌ను ముందే సమకూర్చారు. నిత్య జాగ్రత్తలు తప్పనిసరి కేజీబీవీల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. ఉదయం పూట నిర్వహించే అసెంబ్లీని రద్దు చేసి కోవిడ్ ప్రతిజ్ఞ చేయించాలి. సిబ్బంది, విద్యార్థినులకు రోజుకు రెండుసార్లు విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. రాత్రివేళ విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రతి విద్యాలయంలో ఇద్దరు ఉపాధ్యాయులు, వాచ్ ఉమన్లు క్యాంపస్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి సీనియర్ సీఆర్టీ సమయ పట్టికను సిద్ధం చేయాలి. తరగతులను, విద్యార్థినుల అధ్యయనాన్ని పర్యవేక్షించాలి. వంటగది సిబ్బంది తప్పనిసరిగా హెడ్ క్యాప్స్, మాస్క్‌లు, గ్లౌజులు ధరించేలా చూడాలి. అవసరానికి అనుగుణంగా విద్యార్థినులకు గోరు వెచ్చని తాగునీరు, పరిశుభ్రమైన వేడి ఆహారం సమకూర్చాలి. డైనింగ్ హాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. విద్యార్థినులకు ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి తగిలేలా చూడాలి. పీఈటీ పర్యవేక్షణలో మాత్రమే వ్యక్తిగత వ్యాయామాలు, యోగా చేయాలి. మాస్‌డ్రిల్, ఆటలు అనుమతించరు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పడే విద్యార్థినులకు ప్రత్యేక గది కేటాయించాలి. వారి ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతను పార్ట్ టైమ్ వైద్యులకు అప్పగించాలి. అలాంటి విద్యార్థినులను సమీప ఆస్పత్రి లేదా పీహెచ్‌సీకి తీసుకువెళ్లాలి. విద్యార్థినుల ఆరోగ్య, భద్రతల పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు రోజుల్లో సిబ్బందికి విధులు అప్పగించాలి. పూర్తి జాగ్రత్తలతో.. పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కేజీబీవీలను సిద్ధం చేసేలా ప్రణాళిక ఇచ్చారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతిరోజూ ఇద్దరు చొప్పున టీచర్లకు విడతల వారీగా బాధ్యతలు అప్పగించాం.- పి.లిల్లీ ప్రకాశవాణి, స్పెషలాఫీసర్, కేజీబీవీ, పుల్లల చెరువు, ప్రకాశం జిల్లా అన్ని చర్యలూ చేపడుతున్నాం కోవిడ్ నేపథ్యంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ చేపడుతున్నాం. తల్లిదండ్రుల నుంచి విధిగా అనుమతి పత్రాలు తీసుకుని విద్యార్థినులను తరగతులకు అనుమతిస్తాం.- ఎన్.దీప్తి రాణి, సీఆర్టీ, కేజీబీవీ, బొల్లాపల్లి, గుంటూరు జిల్లా -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్
సాక్షి, అక్కన్నపేట: గిరిజన విద్యార్థుల మాతృ భాషపై కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆంక్షలు విధిస్తున్నాడు. ఆ భాషలో మాట్లాడితే జరిమానా చెల్లించాలంటూ ఎస్ఓ హుకుం జారీ చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో ఇది జరుగుతోంది. అకౌంటెంట్ ఉన్నప్పటికీ అన్నీ వ్యవహారాలు ఎస్ఓ చేతి మీదుగా సాగుతున్నాయని, నిధుల దుర్వినియోగంతో పాటు ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్ఓ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. సోమవారం అక్కన్నపేట మండల ఎంపీపీ మాలోతు లక్ష్మి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. కాగా, తరగతి గదిలో ‘గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్’వేస్తున్నారని ఓ గిరిజన విద్యార్థిని తెలిపింది. ఎంపీపీ మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకోవడానికి విద్యార్థులు భయపడుతున్నారని, గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్ విధించడాన్ని తప్పుపట్టారు. -
పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని
సాక్షి, టెక్కలి: ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవన్‌ను రాజకీయ అజ్ఞానిగా భావించవచ్చునని, ఆయన చేయబోయే లాంగ్‌మార్చ్ ప్రజలను వంచించడానికేనన్నారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని, టెక్కలి, నరసన్నపేట తదితర కేంద్రాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేందుకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.రాజు, పార్టీ నాయకులు అన్నెపు రామారావు, దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, ఆర్.శైలేంద్రకుమార్, బోయిన నాగేశ్వరరావు, దుక్క రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పాఠశాల వసతి సమస్యలు, ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
కేజీబీవీల్లో ఇంటర్
అనాథలు.. బడి మధ్యలో మానేసిన బాలికల కోసం మహానేత దివంగత సీఎం వైఎస్సార్ 2004–05 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 53 మండలాల్లో కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది నిరుపేద బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దివంగత నేత ఆశయాలే స్ఫూర్తిగా పరిపాలన సాగిస్తున్న నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యాలయల్లో సమూల మార్పు తీసుకొచ్చే క్రమంలో భాగంగా జిల్లాలోని 21 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. కర్నూలు ,ఆళ్లగడ్డ: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిస్ మీడియంలో ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. అయితే పదో తరగతి వరకు చదువున్న బాలికలు ఇంటర్ విద్యకు దూరమవుతండటంతో పాటు బాల్య వివాహాలు జరుగుతున్నా యి. వారు పదితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదవాలని భావించి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 140 కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 21 కేజీబీవీల్లో మొదటి సంవ త్సరం ఇంటర్మిడియట్ ప్రారంభించనున్నారు. నిరుపేద బాలికలకు వరం.. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. దూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలకు పంపలేని అనేక మంది బాలికల కుటుంబ సభ్యులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాంటి బాలికలకు కేజీబీవీల్లో ఇంటర్ విద్య వరంగా మారనుంది. జిల్లాలోని 53 కేజీబీవీల్లో గత సంవత్సరం రెండు చోట్ల ఇంటర్ విద్య ప్రవేశ పెట్టినప్పటికీ అవసరమైన సిబ్బంది, వసతులు కల్పించక పోవడంతో ఉపయోగంలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంటర్‌తో పాటు టెక్నికల్, ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టడంతో నిరుపేద బాలికలకు వరంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక కేజీబీవీ జూనియర్ కళాశాలలు
బి.కొత్తకోట: జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యను ప్రారంభిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యకు దూరమైన, ఆలనాపాలనా చూసేవారు లేని అనాథ బాలికల విద్య కోసం 20 కేజీబీవీలను జిల్లాలో 2004–05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. హాస్టల్ వసతి, భోజనం, దుస్తులు తదితర వాటిని సమకూర్చుతున్నారు. గత ప్రభుత్వం గత ఏడాది జిల్లాలోని 20 కేజీబీవీల్లో కేవలం రామకుప్పం, గంగవరం విద్యాలయాల్లో మాత్రమే ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో కలుపుకుని జిల్లాలో 16 కేజీబీవీల్లో ఇంటర్ విద్య బోధించనున్నారు. ఎర్రావారిపాళ్యం, కేవీబీపురం, కురబలకోట, తంబళ్లపల్లె కేజీబీవీల్లో మాత్రం పదో తరగతి వరకే విద్య అందుతుంది. పేద బాలికలకు వరం కేజీబీవీల్లో పది చదివిన తర్వాత పై చదువులకు వెళ్లలేని స్థితిలో బాలికలు విద్యకు దూరమవుతున్నారు. అలాంటి బాలికలకు ఇంటర్ విద్య వరంగా మారింది. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభించే కోర్సుల్లో హెచ్ఈసీ, సీఈసీ, బైపీసీ కోర్సులేకాక బాలికలు వారి జీవితాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా వృత్తిపరమైన కోర్సులను అమలు చేస్తున్నారు. దీనివల్ల బాలికలు ఇంటర్ పూర్తిచేయగానే సంపాదనకు మార్గం ఏర్పడుతుంది. తద్వారా బాలికల జీవితాల్లో మార్పు రావడమేగాక కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి. తంబళ్లపల్లెలో నాలుగింటికి జిల్లాలో 14 కేజీబీవీల్లో ఇంటర్ విద్య మంజూరుకాగా అందులో నాలుగు కేజీబీవీలు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందినవే. తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో మాత్రమే ఇంటర్ విద్య ప్రారంభం కావాల్సి ఉంటుంది. -
అర్ధరాత్రి కేజీబీవీలోకి ప్రవేశించిన అగంతకుడు
♦ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు వారిని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం...అమ్మాయిల పాలిట శాపంగా మారుతోంది. రెండు రోజుల కిందట యాడికి కేజీబీవీలో జరిగిన ఘటన అక్కడి ఉద్యోగులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు డు ఏకంగా ప్రహరీలోకి ప్రవేశించి భవనంపైకి ఎక్కాడు. అదృవశాత్తూ స్టడీలో ఉన్న విద్యార్థినులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమయానికి వచ్చిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు. ♦ బత్తలపల్లి కేజీబీవీలో గతేడాది అర్ధరాత్రి ఓ అగంతకుడు చొరబడి ఓ విద్యార్థిని గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. కేకలు పెట్టడంతో పారిపోయాడని బాధిత విద్యార్థిని వాపోయింది. అనంతపురం ఎడ్యుకేషన్: అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం కేజీబీవీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 62 కేజీబీవీల్లో 12,150 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ విద్యాలయాలన్నీ శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. చాలా చోట్ల ›ప్రహరీలు లేవు. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది అలసత్వం విద్యార్థినుల పాలిట శాపంగా మారుతోంది. శింగనమల నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవించింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తాడిపత్రి ప్రాంతంలోని ఓ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులను అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకులు బయటకు తీసుకెళ్లి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి వదిలి వెళ్లారు. లోపలికి వచ్చే సమయంలో గోడ దూకుతున్న విద్యార్థినులను గుర్తించిన సిబ్బంది మరుసటిరోజు బంధువులను పిలిపించి ఇంటికి పంపించేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఓ విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. గార్లదిన్నె కేజీబీవీలో ఓ విద్యార్థిని గోడదూకి ఆత్మహత్యాయత్నం చేసింది. మరో కేజీబీవీలో విద్యార్థిని చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ ఈ అమ్మాయి ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించడంతో బంధువులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలోకి తరచూ పురుషులు వస్తున్నారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే బాధ్యులెవరని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పని చేయని సీసీ కెమెరాలు తరచూ చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో కేజీబీవీల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో 231 సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేజీబీవీలో 2 నుంచి 5 దాకా కెమరాలు అమర్చారు. అయితే ఇవి చాలా చోట్ల పని చేయడం లేదు. అవి పని చేయకపోవడమే బాగుంటుందనే ధోరణిలో సిబ్బంది ఉన్నారు. రిపేరీ సాకుతో వీటిని మూలనపడేశారు. ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ముందుగా చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటున్నాం కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమరాలు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డే, నైట్ వాచ్ ఉమెన్లు ఉన్నారు. వారితో పాటు సిబ్బంది కూడా నైట్ డ్యూటీలో ఉంటారు. కేజీబీవీల వద్ద రాత్రిపూట ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంతో ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా సంబంధిత ఎస్ఓ, సిబ్బందిపై చర్యలుంటాయి. – ఉషారాణి, జీసీడీఓ -
‘కస్తూర్బా’ నిర్మాణాలకు గ్రహణం
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు సొంత భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విడతలవారీగా శాశ్వత భవనాలను కేంద్రం మంజూరు చేస్తున్నప్పటికీ వాటి నిర్మాణం సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లోనే విద్యార్థులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయి. వీటిలో దాదాపు 198 కేజీబీవీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 34 కేజీబీవీలకు కేంద్రం భవనాలు మంజూరు చేసి ఒక్కోదానికి రూ.2.75 కోట్ల చొప్పున కేటాయించింది. రూ.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో రాష్ల్ర విద్యాశాఖ టెండర్లు పిలిచి అర్హతలున్న కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించి దాదాపు నాలుగు ఏళ్లు కావస్తున్నా వీటి నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. పర్యవేక్షణ కరువు... కేజీబీవీల్లో అనాథ బాలికలతోపాటు అత్యంత నిరుపేద బాలికలకు వసతితోపాటు అక్కడే చదువుకునే వీలుంటుంది. నూరుశాతం బాలికలే ఉండడంతో ఆ భవనాలకు భద్రత కల్పించాలి. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సొంత భవనాలను మంజూరు చేస్తూ వచ్చింది. భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసే ప్రక్రియ విద్యాశాఖ చూస్తుండగా నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లపై ఆజమాయిషీ ఈడబ్ల్యూఐడీసీకే ఉంది. సకాలంలో పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు విడతలవారీగా విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ నిర్మాణ పనులపై స్పష్టత లేదు. ఈడబ్ల్యూఐడీసీ గణాంకాల ఆధారంగానే బిల్లులు చెల్లిస్తుండడంతో నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయనే అంశం విద్యాశాఖ అధికారుల వద్ద స్పష్టత లేకుండా పోయింది. -
కస్తూరి కుసుమాలు
గ్రామీణ నేపథ్యం, పేదరికం, అనాథలుగా మారడం, తదితర కారణాలతో పాఠశాలలను మధ్యలో మానేసిన బాలికలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. విద్యతో పాటు క్రీడలు, యోగా, కంప్యూటర్ తదితర అంశాలలోనూ శిక్షణ నిస్తున్నాయి. విద్యార్థినులు 6వ తరగతిలో ఈ పాఠశాలల్లో చేరితే పైసా ఖర్చు లేకుండా ఇంటర్ విద్యను పూర్తి చేసుకోవచ్చు. మదనపల్లె సిటీ: పేద విద్యార్థినుల జీవితాల్లో కేజీబీవీలు వెలుగునింపుతున్నాయి. జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో గంగవరం, రామకుప్పం మండలాల్లో ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టారు. అద్భుతం..దినచర్య ఈ విద్యాలయాల్లో దినచర్య అద్భుతంగా ఉంటుంది. నిత్యం వేకువజాము 4 గంటలకు బాలికలను నిద్రలేపి సుమారు గంటపాటు చదివిస్తారు. ఒక గంట పాటు యోగాసనాలు చేయిస్తారు. స్నానం, అల్పాహారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తారు. సాయంత్రం 5 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం గంట పాటు ఆట, పాటలు, మొక్కలు సంరక్షణ వంటి పనులు చేస్తారు. రాత్రి 7 తరువాత భోజనం, అనంతరం 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ వుంటాయి. నిత్యం అధ్యాపకులు ఒక పద్ధతి ప్రకారం విద్యార్థినులకు దినచర్య అమలు చేస్తారు. ఏడో తరగతి విద్యార్థినుల కోసం ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థినులకు మానసిక ఉల్లాసం కోసం ఆటలు కూడా ఆడిస్తున్నారు. కుట్టుపని, కంప్యూటర్ విద్య, చేతి పనులపై కూడా శిక్షణ ఇస్తున్నారు. మెరుగైన మెనూ విద్యార్థినులకు పౌష్టికాహారంతో కూడిన మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు పూటల భోజనంతో పాటు ఉద యం, సాయంత్రం ప్రత్యేకంగా స్నాక్స్‌ను అందజేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పాటు కోడిగుడ్లు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, పెన్నులు, ఏడాదికి నాలుగు జతల యూనిఫాం, బూట్లు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు అందిస్తున్నారు. వాటితో పాటు ప్రతి నెలా సబ్బులు, తలనూనె, టూత్‌పేస్టు, కాస్మోటిక్స్ కూడా అందజేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయాలుగా... విద్యార్థినులకు శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు 24 గంటలు ఒక ఎఎన్ఎం అందుబాటులో ఉంటుంది. దీనికి తోడు విద్యాలయ ఆవరణలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు,కూరగాయల తోటలను పెంచే బాధ్యతలను చిన్నారులకు అప్పగిస్తున్నారు. వాటిని విద్యార్థినులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని కేజీబీవీలు స్వచ్ఛ విద్యాలయాలుగా మారుతున్నాయి. కురబలకోట మండలంలోని కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయం జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కార్ అవార్డుకు ఎంపికై రూ.50 వేల నగదు బహుమతిని కూడా అందుకుంది.