అధ్వానంగా కేజీబీవీల నిర్వహణ
అధ్వానంగా కేజీబీవీల నిర్వహణ
Published Thu, Aug 4 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఏప్రిల్ నుంచి రూపాయి కూడా మంజూరుకు నోచుకోని వైనం
మూడు నెలలలుగా ఎస్‌ఓలు, సిబ్బందికి జీతాల్లేవ్
ఎనిమిది నెలలుగా విద్యార్థులకు అందని ఉపకారవేతనం
అనంతపురం ఎడ్యుకేషన్ : అనాథలు, చదువుకుంటూ మధ్యలో బడిమానేసిన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. మూన్నెళ్లుగా నిర్వహణకు పైసా కూడా విడుదల చేయకపోవడంతో ప్రత్యేకాధికారుల(ఎస్‌ఓలు) కష్టాలు వర్ణణాతీతం. నిత్యావసర సరుకులు టెండరుదారులు సరఫరా చేస్తుండగా, రోజువారి అవసరమయ్యే కూరగాయలు, అకుకూరలు, పాలు తదితర వాటి కొనుగోలుకు పలు ఇబ్బందులు పడుతున్నారు. నెలంతా ఖర్చు చేసి నెలతర్వాతైనా బిల్లులు వస్తాయంటే అవీ ఇవ్వడం లేదని ఎస్‌ఓలు వాపోతున్నారు. వీటికి తోడు కరెంటు బిల్లులు చెల్లించలేక, గ్యాస్ సిలిండర్ల కొనుగోలు చేయలేక దిక్కులు చూస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు దాదాపు రూ. 25 వేలు దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కరెంటు బిల్లు ఆలస్యమైతే అపరాధ రుసుం పడుతోంది. సిలిండర్లకు డబ్బు చెల్లించకపోతే ఇవ్వడం లేదు. బిల్లులు పెండింగ్ కారణంగా మెనూ అమలు గాలికి వదిలేస్తున్నారు. మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో మొన్నటిదాకా 36 కేజీబీవీలు ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నడుస్తుండగా, 18 కేజీబీవీలు ఏపీఆర్‌ఐఈ సొసైటీ కింద, 5 కేజీబీవీలు గిరిజన సంక్షేమశాఖ, 3 కేజీబీవీలు సాంఘిక సంక్షేమశాఖ కింద పని చేసేవి. అయితే గత నెలలో అన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయి. వీటిల్లో సుమారు 12 వేల మంది దాకా విద్యార్థినులు చదువుతున్నారు.
మూడు నెలలుగా అవస్థలు
కేజీబీవీల నిర్వహణ ఇక్కట్లు ఇలా ఉంటే.. మరోవైపు మూడు నెలలుగా వారికి జీతాలు మంజూరు కాలేదు. ఎస్‌ఓలు మొదలుకుని సీఆర్టీలు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఏప్రిల్, జూన్, జూలై నెలల జీతాలు రాలేదు. నిర్వహణ బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాజీతాలు కూడా ఇవ్వకుండా పెండింగ్ పడుతున్నారని కొందరు ఎస్‌ఓలు వాపోతున్నారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఓ కేజీబీవీ ఉద్యోగిని వాపోయింది.
సబ్బులూ కొనలేదంటున్న విద్యార్థినులు
ఉపకారవేతనం రాక విద్యార్థినులు అగచాట్లు పడుతున్నారు. నెల కాదు రెన్నెళ్లు కాదు ఏకంగా ఎనిమిది నెలలుగా విద్యార్థినులకు ఉపకార వేతనం అందలేదు. వ్యక్తిగత అవసరాల కోసం నెలకు ఒక్కో విద్యార్థినికి రూ. 100 ఇవ్వాల్సి ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సబ్బులు, నూనె, ఇతర వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వస్తువులను కొనడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement