
మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ-లెర్నింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మోడల్ స్కూళ్లు, 46 కస్తుర్బాగాంధీ బాలికా విద్యాల యాల్లో (కేజీబీవీ) ఈ-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ, రోటరీ ఇండియా లిటరసీ మిషన్ సంయుక్తాధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 50 జిల్లా పరిషత్తు పాఠశాలల్లోనూ పెలైట్ ప్రాజెక్టు కింద ఈ-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ తరువాత ఇతర పాఠశాలలు, జిల్లాలకు విస్తరించే అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది.
ఆన్‌లైన్ ఆధారంగా ఈ-లెర్నింగ్ కేంద్రాల్లో విద్యార్థులకు బోధనను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఒక్కో స్కూల్లో ఈ-లెర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ. 30 వేల చొప్పున వెచ్చించనుంది.
డిజిటల్ తరగతులు..
మరోవైపు రాష్ట్రంలోని 5,200 పాఠశాలల్లో త్వరలోనే డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్ప టికే 70 శాతం ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రొజెక్టర్లు ఉన్నాయి. దీంతో డిజిటల్ తరగతులు, లెర్నింగ్‌ను దశల వారీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్‌ను సిద్ధం చేశారు.
వీలైన చోట ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన చేపడతారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో 250 స్కూళ్లలో, ఐటీ శాఖ ఆధ్వర్యంలో 500 స్కూళ్లలో మొదట అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా పాఠశాలలకు వర్తింపజేస్తారు. ప్రైమరీ విద్యార్థుల కోసం యూనిసెఫ్ ఆధ్వర్యంలో టాకింగ్ బుక్స్ సిద్ధం చేశారు. ఇందులో ఏదేనీ బొమ్మ, పదంపై పెన్ను పెట్టగానే అదేంటన్న దానిపై వాయిస్ వస్తుంది. దీనిని ఆరునెలల్లోగా అమల్లోకి తెస్తారు.