జీఎం కొత్తురు కేజీబీవీలో వివరాలు సేకరించిన డీఈవో
నివేదిక అనంతరం.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
ఈ విషయాన్ని మేనేజ్ చేస్తానంటూ ఎస్‌వోను బ్లాక్‌మెయిల్ చేసిన టీడీపీ నేత
జి.మాడుగుల: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అసెంబ్లీకి సమయానికి రాలేదని ఇంటర్ సెకండియర్‌కు చెందిన 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఈవో బ్రహ్మాజీరావు, కేజీబీవీ జీసీడీవో కె.సూర్యకుమారి సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జీఎం కొత్తూరులోని కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను విచారించారు.
కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం పూజలకు వెళ్లి అసెంబ్లీకి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రత్యేక అధికారి(ఎస్‌వో) సాయిప్రసన్న తమను కొట్టి.. జత్తు కత్తిరించారని విద్యార్థినులు వాపోయారు. దేవుని మొక్కు ఉందని చెప్పినా వినలేదని చెప్పారు. ఎస్‌వో ప్రవర్తనపై విద్యార్థినుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా వివరాలను నమోదు చేసుకున్నారు.
ఎస్‌వో సాయిప్రసన్న మాట్లాడుతూ.. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థినుల జుత్తు కత్తిరించానని.. చేసింది తప్పేనని.. తనను క్షమించాలని కోరింది. చిన్నచిన్న తప్పులకు ఇంత దారుణంగా దండిస్తారా? అంటూ ఎస్‌వో సాయిప్రసన్నపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు అందించి.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికను తమకు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్‌వోను బ్లాక్‌మెయిల్ చేసిన టీడీపీ నేత
ఈ ఘటన బయటకు రాకుండా చూసుకుంటానని.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇచ్చేందుకు రూ.లక్ష కావాలంటూ వంజంగిపాటుకి చెందిన టీడీపీ నేత లకే రామకృష్ణ ఎస్‌వోను బ్లాక్‌మెయిల్ చేశాడు. తమ పేర్లు వాడినందుకు రామకృష్ణపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment