‘కడుపు’పై కొట్టారు.. చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన | TDP Govt Eliminated small-scale workers across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘కడుపు’పై కొట్టారు.. చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన

Published Wed, Aug 7 2024 4:47 AM | Last Updated on Wed, Aug 7 2024 9:58 AM

TDP Govt Eliminated small-scale workers across Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన

టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్న అధికార గణం

ఖాళీ అయిన స్థానంలో తమ వారిని నియమించాలని అధికారులకు అల్టిమేటం

కొత్త నియామకాలకు ముడుపులు దండుకుంటున్న టీడీపీ నేతలు

2.65 లక్షల మంది వలంటీర్లను ఇప్పటికే పక్కన పెట్టిన ప్రభుత్వం

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు వేలాది మంది తొలగింపు

ఇప్పటికే 2,360 మంది ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామా 

టీడీపీ నేతల వేధింపులతో నలుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆత్మహత్య 

నైట్‌ వాచ్‌మెన్లు, స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులపై కూడా వేటు

ఏళ్ల తరబడి పని చేస్తున్న రేషన్‌ డీలర్లతో రాజీనామాలు..అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల రాజీనామాలకు ఒత్తిడి 

వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు బ్రేక్‌

కూటమి నేతల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఎన్నికల ముందు..
‘వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తాం.. సంపద సృష్టించి పంచుతాం’ అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు.
గద్దెనెక్కాక..
మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. చేస్తున్న చిన్న చిన్నఉద్యోగాలను సైతం అన్యాయంగా ఊడగొడుతున్నారు. చిన్న జీతం తీసుకునే చిరుద్యోగుల పొట్ట గొడుతూ ‘తమ్ముళ్ల’ జేబులు నింపుకోమంటున్నారు. చివరకు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్ర పరిచే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి.. ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. 

అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపు పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ‘ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు’ అని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి.

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ : కాకినాడ జిల్లా కోటనందూరు (అల్లిపూడి) కేజీబీవీలో 2017 ఫిబ్రవరిలో నియమితులైన ఆయా కాళ్ల సత్యవతి(బీసీ)ని టీడీపీ నేతలు తొలగించారు. భర్త లేని ఆమె ఈ వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇదే కేజీబీవీలో రెండేళ్ల నుంచి వంటమనిషిగా పని చేస్తున్న దారా ఆదిలక్ష్మి(ఎస్సీ)ని సైతం గురువారం టీడీపీ నేతలు తొలగించి, తమ మనిషిని నియమించున్నారు. ఇలా ఒక్క చోట కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్లో చూసినా దుర్మార్గపు తొలగింపులు పరిపాటిగా మారాయి. 

ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రేషన్‌ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్‌ వాచ్‌మెన్‌ల వరకూ అందరినీ తొలగించాలంటూ టీడీపీ నేతలు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఆదేశిస్తున్నారు. 

ముడుపులు దండుకుంటున్న ‘పచ్చ’ నేతలు
తొలగించిన వారి స్థానంలో నియమిస్తామంటూ ఆశావహుల నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించకూడదంటూ అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. 10, 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లతోపాటు.. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను కూడా తొలగిస్తున్నారు. 

ఆ స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తాళలేక ఇప్పటికే 2,360 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను అధికారులు తొలగించారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక నలుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బెదిరింపులు.. తొలగింపులు..
ప్రభుత్వ బడుల్లో, కేజీబీవీల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజనం వంట కార్మీకులు, ఆయాలు, స్వీపర్లను బెదిరించి బలవంతంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో అన్ని విభాగాల్లోనూ పార్ట్‌టైమ్‌ సిబ్బంది సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది 14 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. వీరి నియామకం రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో జరిగింది. 

ఇప్పుడు తొలగింపు మాత్రం స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట కొత్త వారి నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు డీఈవోలు, ఏపీడీలను ఆదేశించారు. ఇదే అదనుగా టీడీపీ వారు గతంలో నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, తమ వారిని నియమించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపి ఆమోదించుకుంటున్నారు. పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

అన్ని జిల్లాల్లోనూ కన్నీటి గాథలే..
⇒ విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాణి మల్లమ్మదేవి, యుద్ధ స్తంభం, డివైడర్ల మధ్య ఉన్న మొక్కల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న 16 మంది చిరు ఉద్యోగులను తొలగించారు. గంట్యాడ మండలం కొటారుబిల్లి కేజీబీవీలో 2019 నుండి పని చేస్తున్న వంట మనిషి రొంగలి శ్రీలక్ష్మి, వాచ్‌మెన్‌ ఆర్‌.దుర్గను తొలగించి, తమ వాళ్లను పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని చుక్కవలస, ఏనుగువలస, వెదుళ్లవలస, మెరకముడిదాం మండలంలో భైరిపురం, గర్భాం, కొత్తవీధి, శ్యామయావలస రేషన్‌ డీలర్లను తొలగించారు. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, మెరకముడిదాం మండలంలోని రామయవలస, గుర్ల, తెట్టంగి, పెనుబర్తి గ్రామాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. చీపురుపల్లి మండలం పేరిపిలో వేధింపులు భరించలేక ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామా చేశారు. గుర్ల మండలం శేషపుపేటలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను తొలగించారు.   
⇒   పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘంలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 50 మంది ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మీకులను (ఆప్కాస్‌) టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు తొలగించారు. వీరు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబును కలిసినా, వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు అంగీకరించలేదు. 

⇒   వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె, బాలాయపల్లె, గంగనపల్లె, ఓబులాపురం, ఉప్పలూరులో రేషన్‌ డీలర్లను తొలగించారు. కలసపాడు మండలంలో పలువురు డీలర్లను తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పలువురు లబి్ధదారుల పింఛన్‌ తొలగించాలని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.    

⇒   కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామంలోని డ్వాక్రా గ్రూప్‌ బుక్‌కీపర్‌ కె శివనాగేంద్రమ్మను తొలగించారు. పెనమలూరు నియోజకవర్గంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని తొలగించారు. 
 
⇒   ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలంలో 10 మంది వీవోఏలను, కందుల భవాని, మరో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను తొలగించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో 20 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను, జయం­తిపురం గ్రామంలో 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీదారులను తొలగించారు.   

⇒   ఏలూరు జిల్లాలో అంగన్‌వాడీలు, మధ్యాహ్న¿ోజన కార్మీకులు, డ్వాక్రా రిసోర్స్‌ పర్సన్స్, డీఆర్‌డీఏలో ఉండే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అడ్మిని్రస్టేటర్లు ఇలా 67 మంది మహిళల ఉద్యోగాలు తొలగించారు. ఏలూరు నగరంలో అధికార పార్టీ వేధింపులు తాళలేక డ్వాక్రా రిసోర్స్‌ పర్సన్‌ పిల్లి విజయలక్ష్మి, ఉంగుటూరు మండలంలో పి.కనకదుర్గలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్నారు.  

⇒   ప్రకాశం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 300 మంది వీవోఏలు, 370 మంది మధ్యాహ్న భోజన కార్మీకులు, 200 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, వంద మంది మున్సిపల్‌ కార్మికులు, 50 మంది ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, 20 మంది పంచాయతీ కార్మీకులు, 15 మంది స్వచ్ఛభారత్‌ కార్మికులను తొలగించారు.  

2.65 లక్షల వలంటీర్లకు ఉద్వాసనే..
2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే పక్కన పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.పది వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వారిని పక్కన పెట్టారు.   

దేవుడి సాక్షిగా తొలగింపు 
అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న 48 మంది దినసరి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 80 మంది మధ్యాహ్న భోజనం కార్మీకులను తొలగించారు. పలువురు రేషన్‌ డీలర్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా తొలగించి, వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి  జాబితాలు తయారు చేశారు. ప్రైవేటు కంపెనీలనూ వదలడం లేదు. 

స్థానికంగా కంపెనీలు నడపాలంటే తమకు కప్పం కట్టడంతో పాటు తాము చెప్పిన వారినే కార్మీకులుగా పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. రణస్థలంలోని యూబీ బీర్ల కంపెనీలో ఏం జరిగిందో అందరూ చూశారు. కూటమికి అనుకూలంగా లేని కార్మీకులను తొలగించారు. మూలపేట పోర్టులోనూ అదే జరిగింది. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులంతా పోర్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేయడమే కాకుండా కార్యకలాపాలకు అడ్డు తగలడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు.  

ఫోర్జరీ సంతకాలతో డీలర్ల తొలగింపు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం దాచూరులో పొదుపు గ్రూపులకు సంబంధించిన వీఓఏ (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)గా పని చేస్తున్న మహిళను తొలగించి ఆ స్థానాన్ని రెండుగా విభజించి టీడీపీకి చెందిన కార్యకర్తలను నియమించాలని డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సిఫార్సు లేఖ పంపారు. కోవూరు నియోజకవర్గం గంగవరంలో రేషన్‌ షాపు డీలర్‌ను తొలగించి ఆ పోస్టును స్థానిక టీడీపీ నాయకుడు లక్ష్మీనరసారెడ్డి (బాబురెడ్డి) బేరంపెట్టి రూ.2 లక్షలకు వేరొక వ్యక్తికి కట్టబెట్టాడు. 

కందుకూరులో 16 రేషన్‌షాపు డీలర్లను తొలగించేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. స్థానిక డిప్యూటీ తహసీల్ధారుతో కుమ్మక్కై డీలర్లకు తెలియకుండానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి రాజీనామా చేసినట్లు లేఖలు పంపడం సంచలనంగా మారింది. తాము రాజీనామాలు చేయలేదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. కందుకూరు, కావలిలలో వైన్‌షాపులలో పనిచేసే 70 మంది సేల్స్‌మెన్‌లు, సూపర్‌వైజర్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను పెట్టాలని స్థానిక టీడీపీ నేతలు ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. 

కందుకూరులో 50 మందిని తొలగించి వారి స్థానంలో ఆ పోస్టులకు మామూళ్లు దండుకుని టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా జాబితా తయారైంది. మున్సిపాలీ్ట, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిటీల్లో దాదాపు 15 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించేందుకు ఏకంగా స్థానిక టీడీపీ నేతలు ఉపాధి హామీ పనులను నిలిపివేశారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు, కొడవలూరు మండలాల పరిధిలో పొదుపు గ్రూపులకు సంబంధించిన 10 మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

192 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లతో బలవంతపు రాజీనామాలు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మీకులు, డీలర్లు, సంఘమిత్రలు, ఆర్‌పీలను తప్పుడు ఫిర్యాదుల ద్వారా టీడీపీ నేతలు తొలగిస్తున్నారు. పలుచోట్ల అధికారులు తలొగ్గి చిరుద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ఆయాలు, అంగన్‌వాడీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పాలు, సరుకులు ఇవ్వడం లేదని, కేంద్రాలు తెరవడం లేదని, పిల్లలు రావడం లేదని తప్పుడు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 

ఆర్‌పీలు, సంఘమిత్రల తొలగింపునకు గ్రామాల్లో డ్వాక్రా సంఘాలను రెచ్చగొట్టి వీధుల్లోకి లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో 192 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను రాజీనామా చేయించారు. రేషన్‌ డీలర్లు 190 మంది, సంఘమిత్రలు 65 మందిని తొలగించారు. చిత్తూరు జిల్లాలో 86 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను అడ్డగోలుగా తొలగించారు. 126 మందిని పని చేయనివ్వకుండా అడ్డుకున్నారు. 34 మందికి నోటీసులు ఇచ్చారు. 47 మంది సంఘమిత్రలను తొలగించాలని అధికారులకు సిఫార్సులు వెళ్లాయి. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది 112 మందిపై వేటు వేయాలని చూస్తున్నారు.  

ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీనే అడ్డుకున్న టీడీపీ నేతలు  
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులకు కొరత లేకుండా ఉండేలా గత ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన జిల్లా స్థాయి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్‌ జాబితాలను సిద్ధం చేశారు. 

అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్‌ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్‌ నర్స్‌ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. 

ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెపె్టంబర్‌లో విడుదల చేసిన స్టాఫ్‌ నర్స్‌ నోటిఫికేషన్‌లోని మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఈ ఏడాది జూన్‌లో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేశారు. 

అదే నెల 6న కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని ప్రకటించారు. కాగా, అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని నోటిఫికేషన్‌లో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తుండటంపై వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, వివిధ జిల్లాల నుంచి కూడా కూటమి నేతలు పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.  

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఊస్టింగ్‌
రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఉద్యోగులపై కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమించారన్న ఏకైక కారణంతో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్‌ బోర్డు వంటి కీలక సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో  నియమితులైన ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తగా తమ వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

ఇందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న ఏపీఐఐసీలోని జీఎం స్థాయి అధికారి వేగంగా పావులు కదుపుతున్నారు. 2019 జూన్‌ తర్వాత నియమించిన ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించాలంటూ ఇటీవల కొంత మంది పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆ వెంటనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ ఆ ఉన్నతాధికారి జీఎంలకు లేఖలు రాసి, వివరాలు తెప్పించారు. ఇప్పటికే నెల జీతం రూ.40,000 పైన ఉన్న ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన ఏపీఐఐసీ, తాజాగా ఇప్పుడు అంతకంటే తక్కువ జీతం ఉన్న వారిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. 

ఇలా సుమారు 170 నుంచి 180 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఏపీ మారిటైమ్‌ బోర్డు, దాని అనుబంధ సంస్థల్లోని ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ మారిటైమ్‌ బోర్డు కింద ఉన్న రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు లిమిటెడ్‌లో రూ.40 వేలకు పైగా జీతం ఉన్న ఉద్యోగులను తొలగించారు. త్వరలోనే అంతకంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా మొదలు కావచ్చని చెబుతున్నారు.  

డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారు
ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎటువంటి రిమార్కు లేకుండా ప్రజలకు రేషన్‌ పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం రాగానే డీలర్‌ షిప్‌లకు రాజీనామా చేయాలని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలలుగా కమీషన్‌ కూడా ఇవ్వలేదు. మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. 
– పాటిల్‌ ప్రకాష్‌రెడ్డి, పెద్దకోట్ల, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా  

మా ఉసురు తప్పక తగులుతుంది
మధ్యాహ్న భోజన పథకం కార్మీకురాలిగా పథకం పుట్టినప్పటి నుంచి పని చేస్తున్నా. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా మార్చేశారు. నాపై ఎలాంటి ఆరోపణలూ లేవు. అయినా నువ్వు వంట చేయొద్దంటూ నా వంట పాత్రలన్నీ బయట పడేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తప్పించారు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలి. లేదంటే మాలాంటి వారి ఉసురు తగులుతుంది. 
        – ఎస్‌.సరస్వతి, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మీకురాలు, గంగవరం, బెళుగుప్ప మండలం, అనంతపురం జిల్లా

సంఘాల మద్దతున్నా తొలగించారు
నేను 18 మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యుల మద్దతుతో తుంగాన పుట్టుగ గ్రామైక్య సంఘానికి వీఓఏగా ఎన్నికయ్యాను. నా బాధ్యతల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చేసిన సేవల్ని గుర్తించిన అధికారులు మహిళా దినోత్సవం నాడు జ్ఞాపికతో సత్కరించారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే నన్ను అకారణంగా తొలగించారు. 18 సంఘాల వారు నన్ను కొనసాగించాలని చెబుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నా జీతం బకాయి కూడా ఇవ్వలేదు. 
– తుంగాన అంజలి, తుంగానపుట్టుగ గ్రామైక్య సంఘం వీఓఏ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా

బలవంతంగా రాజీనామా చేయించారు
గతంలో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చేసిన ఉపాధి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి సరైన ఆధారాలు దొరకడంతో తొలగించారు. ఆ స్థానంలో ఉపాధి కూలీగా పనిచేస్తున్న నా అనుభవం, విద్యార్హత చూసి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించారు. ఏటా నిర్వహించే సామాజిక తనిఖీలో నాపై ఎలాంటి రికవరీలు లేవు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వారికి అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఇలా చిరుద్యోగుల కడుపు కొట్టడం సరికాదు.  
           – మునెయ్య, కందాడు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా

నా జీవనం ప్రశ్నార్థకంగా మారింది
గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వాచ్‌మెన్‌గా రెండేళ్లుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశాననే నెపంతో నన్ను విధుల నుంచి తొలగించారు. నా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్యాయంగా పొట్ట కొట్టడం సరికాదు.  
– మాలాజీ ఏసుబాబు, జయంతి, వీరులపాడు మండలం, ఎన్టీఆర్‌ జిల్లా

346 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు
శ్రీసత్యసాయి జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మీకులు, ఏజెన్సీల నిర్వాహకులు, రేషన్‌ షాపుల డీలర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పాఠశాలల వాచ్‌మెన్లు, వలంటీర్లను బలవంతంగా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 520 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను, 7,836 మంది వలంటీర్లను తీసేశారు. 346 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారు. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,730 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మీకులను వీధిన పడేశారు. 

97 మంది వాచ్‌మెన్లను తొలగించారు. 1,367 మంది రేషన్‌ డీలర్లను మార్చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,125 రేషన్‌ డీలర్లను మార్చేశారు. 420 మంది యానిమేటర్లను తప్పించారు. 677 స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,300 మందికి పైగా కార్మికులను తొలగించారు. 274 మంది వాచ్‌మెన్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాలు 450 మందికి పైగా తొలగించారు. 

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 100 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లతో రాజీనామా చేయించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, స్కూళ్లలో టాయ్‌లెట్స్‌ క్లీన్‌ చేసే ఆయాలు, నైట్‌ వాచ్‌మెన్లపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. చౌక డిపో డీలర్లు అత్యధిక శాతం టీడీపీ వారే ఉన్నారు. ప్రతి పది షాపులకు ఒకరిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తున్నారు. వారి ద్వారా మామూళ్లు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement