
నిందితుడు వంతల గెన్ను
ఇద్దరు అక్కడికక్కడే మృతి
ప్రాణాపాయ స్థితిలో మరొకరు
అల్లూరి జిల్లాలో దారుణం
సీలేరు (అల్లూరి జిల్లా): ముగ్గురు బావమరుదులపై బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, సీలేరు మేజర్ పంచాయతీ, చింతపల్లి క్యాంపు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడు కృష్ణ (36) కిముడు రాజు (40) కిముడు రాజు (25)అన్నదమ్ములు. వీరు ముగ్గురికీ వివాహాలు జరిగాయి. వీరికి నలుగురు, ముగ్గురు, ఇద్దరు చొప్పున పిల్లలున్నారు.
బంధువు దినకార్యానికిగాను ఆదివారం చింతపల్లి క్యాంప్‌లో నివాసముంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతోసహా హాజరయ్యారు. బావ ఇంట్లోనే రాత్రి బస చేశారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవపడుతూ, కొడుతుండటంతో ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది.
సుమారు ఒంటిగంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరులను ఒకరి తర్వాత ఒకరిని కడుపులో పేగులు బయటికి వచ్చేలా పొడిచాడు. తరువాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, గాయాలతో ఉన్న రాజు అనే మరో బావ మరిదిని కుటుంబ సభ్యులు, స్థానికులు సీలేరు పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.
నిందితునిపై ఇప్పటికే రెండు హత్య కేసులు
నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతనిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందట ఒడిశాలో ఒకరిని కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలితో నరకగా కేసు నమోదై, జైలుకి వెళ్లొచ్చి ప్రస్తుతం చిన్నా చితకా పనులు చేస్తున్నాడు.