
సాక్షి, పాడేరు/చింతపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి నుంచి చలిగాలులు విజృంభించాయి. ఆదివారం ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుంది.
ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తరువాత కూడా చలి తీవ్రత తగ్గలేదు. అరకులోయలో 5.9 డిగ్రీలు, జీకే వీధి 6.1, పాడేరు 6.9, హుకుంపేట 6.9, డుంబ్రిగుడ 7, చింతపల్లి 7.3, పెదబయలు 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలితీవ్రతతో మన్యంలోని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10 గంటల వరకూ మంచు అధికంగా కురవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. సాయంత్రం 4 గంటల నుంచి చలి గాలులు వీస్తుండటంతో వృద్దులు, చిన్నారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment