Cold winds
-
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
ఏజెన్సీ గజగజ
సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తుండటంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో గురువారం 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11.3, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.2 -
చలిగాలుల విజృంభణ
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): శీతాకాలం ముగుస్తున్న సమయంలో అల్లూరి సీతారాజు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. చింతపల్లిలో నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 7.6 డిగ్రీలు నమోదవగా, పాడేరు మండలం మినుములూరులో 12 డిగ్రీలు, అరకులోయలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేకువజామున పొగమంచు కురుస్తున్నప్పటికీ 7గంటలకే సూర్యోదయమవుతోంది. -
అరకును వణికిస్తున్న చలిగాలులు
అల్లూరి సీతారామరాజు జిల్లాను చలిగాలులు వణికిస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. శుక్రవారం అరకు లోయలోని కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయం వద్ద 10.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 11.8, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) -
India Meteorological Department: చలి తీవ్రత ఈసారి తక్కువే
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఈసారి డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కాస్తంత అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈసారి డిసెంబర్లో చలి తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్–ఫిబ్రవరి సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా కాస్తంత ఎక్కువ నమోదవ్వొచ్చు. ఈసారి ఎల్‌నినో పరిస్థితులు ఉండటమూ ఇందుకు మరో ప్రధాన కారణం’’ అని విశ్లేషించింది. -
Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు
గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. -
అంధకారంలో అగ్రరాజ్యం.. అమెరికాలో మంచు తుఫాను విశ్వరూపం
వాషింగ్టన్: ఊహించినట్టే అమెరికాలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. దేశంలో 3,500 కిలోమీటర్ల పొడవున బీభత్సం సృష్టిస్తోంది. వాతావరణ శాఖ అనుమానించిట్టుగానే ఆర్కిటిక్ బ్లాస్ట్ కాస్తా శక్తిమంతమైన బాంబ్ సైక్లోన్‌గా రూపాంతరం చెందుతోంది. దాని దెబ్బకు చాలా రాష్ట్రాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల కంటే కూడా దిగువకు పడిపోయాయి! గడ్డ కట్టించే చలికి 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వీసే అతి శీతల గాలులు తోడయ్యాయి. దాంతో జీవితంలో కనీవినీ ఎరుగనంతటి ఎముకలు కొరికే చలి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తూర్పు అమెరికాలో పరిస్థితి భయానకంగా ఉంది. పెను గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. దాంతో దేశంలో అత్యధిక ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. 20 లక్షలకు పైగా ఇళ్లు, కార్యాలయాల్లో అంధకారం అలముకుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మంచు తుఫానుతో 20 కోట్ల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రిస్మస్ విరామ సమయంలో ఇంటి నుంచి బయట కాలు పెట్టే వీల్లేక, చలి నుంచి తప్పించుకునే మార్గం లేక వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. భరించలేని చలి కారణంగా న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు! 13 రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితి అమల్లోకి రావడం తెలిసిందే. దీన్ని దేశ చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా భావిస్తున్నారు. పొరుగు దేశం కెనడాలో కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఒంటారియో, క్యుబెక్ తదితర ప్రాంతాలు కూడా భరించలేని చలి, కరెంటు అంతరాయాలతో అతలాకుతలమవుతున్నాయి. బ్రిటిష్ కొలంబియా నుంచి న్యూఫౌండ్ లాండ్ దాకా కెనడాలోని మిగతా చోట్ల కూడా మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో విమాన సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ►పశ్చిమ అమెరికాలోని మోంటానాలో ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలకు పడిపోయింది. పలు మధ్య రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. వ్యోమింగ్‌లో రాష్ట్ర చరిత్రలోనే అత్యల్పంగా మైనస్ 42 డిగ్రీలు నమోదైంది. అయోవా తదితర చోట్ల మైనస్ 38 డిగ్రీలకు తగ్గడం లేదు. డెన్వర్, కొలరాడో వంట రాష్ట్రాల్లో గత 40 ఏళ్లలో తొలిసారిగా మైనస్ 25 డిగ్రీలకు పడిపోయింది. టెన్నెసీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత 30 ఏళ్లలో తొలిసారిగా సున్నా కంటే దిగువకు పడిపోయింది. ► ఇంతటి అతి శీతల వాతావరణంలో మంచు బారిన పడితే అవయవాలను శిథిలం చేసే ప్రాణాంతకమైన ఫ్రాస్ట్ బైట్ బారిన పడేందుకు ఐదు నిమిషాలు కూడా పట్టదని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని సూచించింది. ► ఎటు చూసినా గ్రిడ్ వైఫల్యంతో అమెరికా కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి కరెంటు కోతలతో అల్లాడిపోతోంది. ఒక్క నార్త్ కాలిఫోర్నియాలోనే 2 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా ఆగిపోయింది! వర్జీనియా, టెన్నెసీ తదితర రాష్టాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. స్టౌలు, డిష్వాషర్లు, లైట్ల వాడకం కూడా నిలిపేయాలని విద్యుత్ సరఫరా సంస్థలు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది!! ►మరోవైపు అత్యంత ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం 6,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. దాంతో క్రిస్మస్ సంబరాల కోసం సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు బయల్దేరిన వాళ్లు మార్గమధ్యంలో చిక్కుకున్నారు. గురువారం 3000కు పైగా విమానాలు రద్దవడం తెలిసిందే. ►మంచు తుఫాను వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటిదాకా 20 మందికి పైగా మరణించారు. హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోవడంతో పాటు కన్ను పొడుచుకున్నా ఏమీ కన్పించని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో న్యూయార్క్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు విధించారు. ► ఇప్పటికే 20 కోట్ల మందికి పైగా ప్రజలకు హెచ్చరికలు, ఆంక్షల పరిధిలో ఉన్నట్టు జాతీయ వాతావరణ సంస్థ పేర్కొంది. అతి శీతల పరిస్థితులు, ప్రచండమైన గాలులు మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చని హెచ్చరించింది. ► చలి భరించరానంతగా పెరిగిపోవడంతో న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ ఎమర్జెన్సీ రాష్ట్రంలో ప్రకటించారు. ‘‘ఎటు చూసినా మంచే. గడ్డ కట్టించే చలే. రాష్ట్రంలో చాలా చోట్ల హిమపాతం తీవ్రంగా ఉంది. మరికొన్ని చోట్ల వరద ముప్పు పొంచి ఉంది. ఇది నిజంగా ప్రాణాంతకమైన పరిస్థితే’’ అంటూ వాపోయారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి వచ్చే సాహసం చేయొద్దని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ► న్యూయార్క్, న్యూజెర్సీ వంటి తీర ప్రాంతాల్లో వరదలు కూడా ముంచెత్తుతున్నాయి. సాధారణంగా చాలావరకు వెచ్చగానే ఉండే లూసియానా, అలబామా, ఫ్లోరిడా, జార్జియా వంటి దక్షిణాది రాష్ట్రాలు కూడా చలికి అల్లాడుతున్నాయి. -
మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు
వాషింగ్టన్: అమెరికాపై ‘చలి తుఫాను’ విరుచుకుపడింది. కనీవినీ ఎరగని రీతిలో అతి శీతల గాలులతో ఈ మూల నుంచి ఆ మూల దాకా దేశమంతా వణికిపోతోంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల దాకా పడిపోతున్నాయి. జనాభాలో ఏకంగా 60 శాతం, అంటే 20 కోట్ల మందికి పైగా చలి గుప్పిట చిక్కి అల్లాడుతున్నారు. చివరికి సాధారణంగా వెచ్చగా ఉండే దక్షిణాది రాష్ట్రాలు కూడా చలికి వణుకుతున్న పరిస్థితి! దీన్ని తరానికి కేవలం ఒక్కసారి తలెత్తే ‘అసాధారణ పరిస్థితి’గా అమెరికా వాతావరణ శాఖ అభివర్ణించింది. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితి ‘బాంబ్ సైక్లోన్’గా రూపాంతరం చెందుతోందని పేర్కొంది. దీనివల్ల వాయు పీడనం ఉన్నట్టుండి పడిపోయి పెను తుఫాన్లకు దారి తీస్తుంది. దేశవ్యాప్తంగా ‘అత్యంత ఆందోళనకర’ వాతావరణ పరిస్థితి నెలకొందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు కదలొద్దని ప్రజలకు సూచించారు. వచ్చే రెండు మూడు రోజులు పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చన్న అంచనాల నేపథ్యంలో క్రిస్మస్కు సొంతూళ్లకు వెళ్లాల్సిన వాళ్లు తక్షణం బయల్దేరడం మంచిదన్నారు. ఇది గత 40 ఏళ్లలో ‘అత్యంత చల్లని’ క్రిస్మస్ కానుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చలి ధాటికి ఇప్పటికే చాలాచోట్ల క్రిస్మస్ వీకెండ్ సంబరాలు వెనకపట్టు పట్టాయి. ఈ పరిస్థితులు కనీసం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి! పొరుగు దేశమైన కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రాణాంతక గాలులు అతి శీతల వాతావరణం దృష్ట్యా అమెరికాలో ఇప్పటికే 13కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలాచోట్ల 100 కిలోమీటర్లకు పై చిలుకు వేగంతో అత్యంత చల్లని గాలులు ఈడ్చి కొడుతున్నాయి. వాటి దెబ్బకు దేశవ్యాప్తంగా ఎటు చూసినా కరెంటు సరఫరాలో అంతరాయం నెలకొంది. అసలే అతి శీతల వాతావరణంలో ఆదుకునే కరెంటు కూడా లేక జనం అల్లాడుతున్నారు. కనీసం 4 కోట్ల మంది కరెంటు కోతతో అల్లాడుతున్నట్టు సమాచారం. సాధారణంగా అతి శీతల వాతావరణముండే డెన్వర్‌లో కూడా గత 32 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఏకంగా మైనస్ 31 డిగ్రీలు నమోదైంది! షికాగో, డెన్వర్, డాలస్ వంటి పలుచోట్ల సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు కాస్తా గంటల వ్యవధిలోనే మైనస్లలోకి పడిపోయాయి!! దాంతో క్రిస్మస్ వేళ దేశవ్యాప్తంగా చాలాచోట్ల రోడ్డు రవాణా సేవలు స్తంభించిపోయాయి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని అతి శీతల పరిస్థితుల కారణంగా ఒక్క శుక్రవారమే ఏకంగా మూడు వేలకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏమిటీ బాంబ్ సైక్లోన్? అమెరికాను అల్లాడిస్తున్న అతిశీతల వాతావరణానికి ప్రధాన కారణం ఆర్కిటిక్ బ్లాస్ట్. ఆర్కిటిక్ నుంచి వీచే అతి శీతల గాలులు కనీవినీ ఎరగనంతటి చలికి, హిమపాతానికి కారణమవుతాయి. ఈ పరిస్థితి స్థిరంగా కొనసాగి మరింత విషమిస్తే బాంబ్ సైక్లోన్‌గా పేర్కొంటారు. పొడి, చలి తరహా భిన్న గాలులు ఒక్కసారిగా కలిసిపోతే ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. తేలికైన వెచ్చని గాలి పైకి వెళ్తుంది. ఆ క్రమంలో ఏర్పడే మేఘాల వ్యవస్థ కారణంగా వాయు పీడనం అతి వేగంగా తగ్గిపోయి తుఫాను తరహా పరిస్థితులకు దారి తీస్తుంది. చుట్టూ ఉన్న అతిశీతల పరిస్థితులు మంచు తుఫానుగా మారతాయి. పీడనం ఎంత తగ్గితే దీని తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఒకట్రెండు రోజుల్లో మరింత విషమించవచ్చని అంచనా. బాంబ్ సైక్లోన్ ధాటికి ఉష్ణోగ్రతలు గంటల్లోనే ఏకంగా 11 డిగ్రీలకు పైగా పతనమవుతుంటాయి! ఫలితంగా ప్రాణాంతకమైన చలి గాలులు చెలరేగుతాయి. -
మన్యంలో చలి విజృంభణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద 9.8 డిగ్రీలు నెలకొనగా గురువారం ఉదయం 6.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురిసింది. -
వణుకుతున్న వాయవ్య భారతం
జైపూర్: శీతగాలులు వాయవ్య భారతాన్ని వణికిస్తున్నాయి. రాజస్తాన్, పంజాబ్‌లలో గడ్డకట్టించే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. వరుసగా రెండోరోజు కూడా రాజస్తాన్‌లోని ఫతేపూర్, చురుల్లో రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఫతేపూర్‌లో మైనస్ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్ 2.6 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. గడిచిన 12 ఏళ్లలో చురులో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆదివారం సికార్, కరౌలి, చిత్తోర్‌గఢ్ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సికార్‌లో మైనస్ 2.6 డిగ్రీలు, కరౌలీలో మైనస్ 0.6, చిత్తోర్‌గఢ్‌లో మైనస్ 0.2 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భిల్వారాలో జీరో డిగ్రీలు, పిలానీలో 0.1, నాగౌర్‌లో 0.2, అల్వార్‌లో 0.4, బనస్థలిలో 1.5, సంగారియాలో 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీలు హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ కూడా చలి గుప్పిట్లో గజగజ వణికిపోతున్నాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హల్వారాలో జీరో డిగ్రీలు, భటిండా 0.1, ఫరీద్‌కోట్‌లో 1, పటాన్‌కోట్‌లో 1.5 డిగ్రీలకు శనివారం రాత్రి కనిష్ట ఉప్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం తీవ్ర చలిగాలు వీచాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్రకు బేస్‌క్యాంప్ అయిన కశ్మీర్‌లోని గుల్మార్గ్ రిసార్ట్‌లో మైనస్ 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బారాముల్లాలో మైనస్ 6.5 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాగునీటిని సరఫరా చేసే పైపుల్లో మంచు గడ్డకట్టుకుపోయింది. పలు సరస్సులు గడ్డకట్టాయి. కాకపోతే కశ్మీర్ ప్రజలకు ఇది అలవాటే కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. -
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
సాక్షి, విశాఖపట్నం: మధ్య భారతదేశం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతుంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం పదిగంటలకు కూడా పొగమంచు వీడలేదు. ఉపరితలంపై ఏర్పడిన అధికపీడనంతో పాటు ఈశాన్యగాలులు తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరోవైపు సముద్రతీరం నుంచి వీస్తున్న వెచ్చటి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 4.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో 4.4,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: బైబై.. డీలక్స్ బస్సుకు సెలవు! ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల వరకు, విశాఖ ఏజెన్సీలో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో వీస్తున్న గాలుల ప్రభావంతో విశాఖలో చలి పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. క్రమంగా కోస్తాతీర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది క్రమంగా బలహీనపడుతూ బంగాళాఖాతం వైపు చేరుకుంటుందని, క్రమంగా శ్రీలంక తీరం వైపు కదలనుందని తెలిపారు. దీని కారణంగా ఈ నెలాఖరులో దక్షిణకోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మినుములూరులో 7, అరకులోయలో 10.4, నందిగామలో 12.2, విశాఖలో 13.8, కళింగపట్నం, అమరావతిలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: తెలంగాణ గజగజ -
ఏపీలో చలిగాలులు పెరిగే అవకాశం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో చలి గాలులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. దీనికి తోడు ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం పాడేరులో 13.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 17.5, చింతపల్లిలో 18.5, అరకులో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మూడు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఎక్కువ ప్రాంతాలు పొడిగా ఉంటాయని తెలిపారు. -
రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయ్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇవి తక్కువ ఎత్తులో వీయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పెద్ద ప్రభావం లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా, మన్యం ప్రాంతాల్లో ఎక్కువగా చలి పెరిగింది. మన్యంలో మంచు కురుస్తోంది. మేఘాలు ఆవరించడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మాల్దీవుల నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణిలో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతోపాటు చల్లటి గాలుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో (గురు, శుక్రవారాల్లో) ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
వణికిస్తున్న చలి గాలులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాదిన మొదలైన చలి తీవ్రత రాష్ట్రానికీ విస్తరిస్తోంది. ఇక్కడి ప్రజల్ని గజగజా వణికిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వీస్తున్న గాలుల కారణంగా ఏర్పడుతున్న శీతల ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విలోమ పొర (ఇన్వర్షన్ లేయర్) ఏర్పడి.. కాలుష్యంతో కూడిన పొగమంచు కురుస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు అధిక పీడన ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 4 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కలవరపెడుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గటం.. దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి పెరిగింది. అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పాటు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల పెద్ద భేదమేమీ లేకపోయినా.. చలిగాలుల వల్ల ఈ వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు. సాధారణం కంటే 5 డిగ్రీలకు మించి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్)గా ప్రకటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగాల్సింది పోయి తగ్గిపోతుండటంతో చలి తీవ్రత అధికమవుతోంది. ఆ పొరతో ప్రమాదం విలోమ పొరతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మాదిరిగా.. కింది నుంచి వెళ్లే నీటి ఆవిరి, కాలుష్యం, దుమ్ము, ధూళి కణాలన్నీ కలిసి విలోమ పొర కారణంగా మధ్యలోనే ఆగిపోయి పొగమంచులా ఏర్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. విలోమ పొర అంటే.. సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ.. వాతావరణంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఉపరితలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉండగా.. పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీన్నే విలోమ పొర (ఇన్వర్షన్ లేయర్) అని పిలుస్తారు. -
కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా చలిగాలుల ఉధృతితో వణికిపోతున్న ఉత్తర భారతానికి ఇంకో రెండ్రోజులపాటు ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం శుక్రవారం తెలిపింది. తూర్పు, మధ్యభారతదేశ ప్రాంతాల్లో నూ చలితీవ్రత పెరగనుందని తెలిపింది. వాయవ్య దిక్కు నుంచి వస్తున్న శీతల పవనాలు కొనసాగుతున్న కారణంగా పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ ఉత్తర ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌లలో రానున్న రెండు రోజులు చలి లేదా అతిశీతల పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ తెలిపింది. కొత్త సంవత్సరం తొలిరోజు, అంతకుముందు రోజుల్లో దేశ వాయువ్య, మధ్య ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశముంది. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు –5.6 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ విభాగం తెలిపింది. కశ్మీర్, లడాఖ్‌ల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు మైనస్లలోకి వెళ్లాయి. కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని గుల్మార్గ్లో ఉష్ణోగ్రతలు – 9.5 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోగా, పహల్గామ్ రిసార్ట్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు – 12.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
వైరల్: మరిగే నీరు.. క్షణాల్లో మంచుగా!
చికాగో: ఓ మగ్గులో మరిగే నీటిని తీసుకొని పైకి విసిరితే ఏమవుతుంది? మనపైనే పడి.. ఒళ్లంతా కాలుతుంది! అయితే ఓ వ్యక్తి తాజాగా ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియోలో మాత్రం మరుగుతున్న నీరు.. అలా ఆకాశంలోకి విసరగానే మంచులా మారి, మాయమైపోతోంది. క్షణాల్లో జరుగుతున్న ఈ అద్భుతాన్ని నెటిజన్లు చూసి అవాక్కవుతున్నారు. అయితే అతడేమీ మ్యాజిక్ చేయడంలేదు. అంతా ప్రకృతి వింతే. అసలు విషయమేంటంటే.. పోలార్ వోర్టెక్స్ ప్రభావంతో అమెరికాలోని పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో విలవిల్లాడుతున్నాయి. చివరికి ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతాల్లో ఒకటైన నయాగారా సైతం గడ్డకట్టేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే భయాందోళనలకు గురిచేస్తున్న ఈ చలి కొందరికి వినోదాన్ని సైతం పంచుతోంది. కొందరు మంచుతో రకరకలా ప్రయోగాలు చేసేస్తున్నారు. చిత్ర విచిత్ర ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘చలి కారణంగా రాజకీయ నేతలు తమ జేబులోనే చేతులు పెట్టుకొని ఉండటం చూస్తున్నాం..’ అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. -
అమెరికాలో చలిగాలుల బీభత్సం
షికాగో: అమెరికాలోని ప్రజలు చలికి వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు.. ఆర్కిటికా నుంచి వీస్తున్న భయంకరమైన శీతల గాలుల ధాటికి జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అక్కడి మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా అంటార్కిటికా ధృవం కన్నా తక్కువగా మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎక్కడ పడిపోతాయోనన్న భయంతో స్కూళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూసివేశారు. ఈ శీతల గాలులకు ఇప్పటివరకు దాదాపు 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. చలి గాలుల తీవ్రతకు అమెరికాలోని దాదాపు 12 రాష్ట్రాల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్, ఒహియో, అయోవా, డకోటాస్, నెబ్రస్కా ప్రాంతాల్లో తపాలా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. చలి తీవ్రతకు నయాగరా జలపాతం గడ్డ కట్టుకుపోయింది. నది ప్రవాహం కూడా నిలిచిపోయింది. షికాగో నగరం మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది. గురువారం తెల్లవారుజామున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. షికాగోలో బుధవారం ఉదయం మైనస్ 30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇల్లినాయిస్లోని రాక్‌ఫోర్డ్ పట్టణంలో మైనస్ 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం షికాగోలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి వెళ్లాల్సిన దాదాపు 1,700లకు పైగా విమానాలు రద్దయ్యాయి. రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. వృద్ధులు, పిల్లల కోసం పలు చోట్ల 200లకు పైగా వెచ్చటి కేంద్రాలు (వార్మింగ్ సెంటర్స్) ఏర్పాటు చేశారు. బస్సులను కదిలే వార్మింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. షికాగోలోని వీధుల్లో జీవించే దాదాపు 16 వేల మంది కోసం శిబిరాలను పెంచారు. హిందూ దేవాలయంపై దాడి వాషింగ్టన్: అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌వెల్లీలో ఉన్న ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. విగ్రహప్రతిమపై నల్లరంగు చల్లడంతోపాటు ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు రాశారు. ఆలయ కిటికీలు సహా సామగ్రిని ధ్వంసం చేశారు. ఘటన ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య జరిగినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది జాతి విద్వేషంతో జరిపిన దాడిగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. దీనిపై ఎలాంటి వీడియో ఫుటేజీలు లభించలేదని ఆలయ అధికారులు తెలిపారు. ధ్వంసమైన స్వామి నారాయణ ఆలయాన్ని లూయిస్‌వెల్లీ మేయర్ జార్జ్ ఫిషర్ సందర్శించారు. ఆలయంపై దాడిని ఆయన ఖండించారు. ఏ మతం వారైనప్పటికీ ఇలా దేవాలయాలను ధ్వంసం చేయడం తగదని ఆలయానికి చెందిన రాజ్ పటేల్ తెలిపారు. గడ్డకట్టిన మిషిగాన్ సరస్సు -
రానున్న మూడ్రోజుల్లో పొడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లోనూ మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. -
మన్యం..మరో కశ్మీరం!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం మరో కశ్మీరాన్ని తలపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా సున్నా (0) డిగ్రీకి చేరుకుంది. ఆదివారం రాత్రి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ‘0’ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ పక్కనే ఉన్న చింతపల్లిలో 1.5 డిగ్రీలు నమోదైంది. ఏజెన్సీలోని దల్లాపల్లి, మోదపల్లిల్లో 3, పాడేరులో 4 డిగ్రీల చొప్పున కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5–10 డిగ్రీలకు పడిపోయి ఏజెన్సీ వాసులను గజగజ వణికిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏజెన్సీలో సాయంత్రం నుంచి మంచు తేలికపాటి వర్షంలా కురుస్తోంది. తెల్లారేసరికి వాహనాలు, ఇళ్ల పైకప్పులపై గడ్డకట్టిన మంచు కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే ఎముకలు కొరికే చలి మొదలవుతోంది. ఉదయం 10 గంటలకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. దీంతో అక్కడ వారు కశ్మీరంలోని మంచుకొండల్లో గడపుతున్న అనుభూతిని పొందుతున్నారు. విశాఖ రికార్డు! మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతల్లో విశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. యాభై ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం రాత్రి 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 6 డిగ్రీలు తక్కువ కావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోనూ 12 డిగ్రీలు నమోదయింది. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లోకెల్లా గుంటూరు జిల్లా రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణంకంటే 4–6 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వణికిస్తున్నాయి. మరో రెండ్రోజులు అతిశీతల గాలులు.. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య భారతదేశంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3–5 డిగ్రీలు నమోదవడం వల్ల అక్కడ శీతల ప్రభావం ఎక్కువ ఉంటోంది. అటు నుంచి దక్షిణం వైపునకు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇదే కోస్తాంధ్రలో చలి వణికించడానికి కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) కొనసాగి చలి తీవ్రతను పెంచుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని మారుమూల జీనబాడు పంచాయతీ వలసలగురువు గ్రామానికి చెందిన తామర్ల రామన్న(70) అనే వృద్ధుడు సోమవారం తెల్లవారుజామున చలితీవ్రతకు తాళలేక మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 5న అల్పపీడనం.. జనవరి 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అండమాన్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అటువైపు చేపల వేటకు వెళ్లవద్దని సోమవారం రాత్రి నివేదికలో ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్ @ 3 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భీంపూర్ మండలం అర్లి, బేలా ప్రాంతాల్లో ఏకంగా మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం జిన్నెదారి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. -
అమెరికా @ 12" మంచు
షికాగో: భారీ మంచు తుపాను, చలిగాలుల కారణంగా అమెరికాలో ఏడుగురు మృతి చెందగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 500 పైగా విమాన సర్వీసులు రద్దు కాగా 5,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ తీవ్రత రానున్న రోజుల్లో న్యూమెక్సికోతోపాటు దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చలితోపాటు భారీ వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. లూసియానా, కెన్సాస్, నార్త్ డకోటా, టెన్నిస్సీ, మిన్నెసొట్టా ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా 6,500 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 800పైగా సర్వీసులు రద్దయినట్లు వివరించారు. మంచు కారణంగా చాలా చోట్ల రహదారులను కూడా మూసి వేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ చలి పంజా
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో చలి మళ్లీ ఉధృతమైంది. పది రోజుల క్రితం పెథాయ్ తుపాను సందర్భంగా రాష్ట్రంపై పంజా విసిరిన చలిపులి.. మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు తీవ్రం కావడంతో జనం వణికిపోయారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2013 డిసెంబర్ 9న 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తాజాగా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మెదక్‌లో శుక్రవారం 6.8 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. శనివారం 5.8 డిగ్రీలకు పడిపోయింది. దక్షిణ కోస్తా ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారడంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌నూ చలి వణికిస్తోంది. శనివారం గ్రేటర్లో రికార్టు స్థాయిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2010 డిసెంబర్ 21న 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఎనిమిదేళ్ల తర్వాత సాధారణం కన్నా ఐదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఢిల్లీ ‘చిల్’ మార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ శీతాకాలంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఇవాళ ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. చలిగాలికి తోడు మంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఉదయం వేళల్లో శీతల గాలులు, మంచు ఢిల్లీని వణికిస్తున్నా ముందుముందు గరిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌కు పైగా చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంన్నారు. ఇక బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు ఢిల్లీలో వాయునాణ్యత సూచీ 319 పాయింట్లతో వెరీ పూర్ కేటగిరీలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో రాజధాని గాలిలో తేమ పెరుగుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. -
కాటేసిన కుంపటి
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగిపోయింది. పెథాయ్ తుపాను ప్రభావంతో వీచిన శీతలగాలులకు తెలంగాణ గజగజ వణికిపోయింది. అయితే ఈ శీతల గాలులనుంచి తప్పించుకునేందుకు వేసుకున్న చలిమంటే ఓ తల్లీ, కొడుకుల ఊపిరి తీసింది. చలిమంటకోసం ఏర్పాటు చేసుకున్న బొగ్గులకుంపటి నుంచి పొగలు కమ్ముకుని ఊపిరాడక ఆ తల్లీ కొడుకులిద్దరూ నిద్రలోనే మృతి చెందారు. హృదయవిదారకమైన ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం, జల్లూరు గ్రామానికి చెందిన కె.సత్యబాబు, బుచ్చమ్మ (39) దంపతులు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ 25లో నివసించే సంకీర్త్ ఆదిత్యారెడ్డి ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కూతురుతోపాటు కొడుకు పద్మరాజు (20) కూడా ఉన్నారు. ఆదిత్యారెడ్డి పెంపుడు కుక్క బుధవారం మృతి చెందడంతో దానిని ఖననం చేసేందుకు పనిమనిషి సత్యబాబు డ్రైవర్‌తో కలిసి కారులో ఉప్పల్‌కు వెళ్లారు. బాగా చలిగాలులు వీస్తుండటంతో సత్యబాబు భార్య బుచ్చమ్మ, కొడుకు పద్మరాజు తమ సర్వెంట్ క్వార్టర్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిప్పులు రాజేసుకుని చలిమంట వేసుకున్నారు. మంచం కింద ఓ బొగ్గులకుంపటి, టీవీ వద్ద ఇంకో కుంపటి ఏర్పాటు చేసి గాలికి నిప్పులు ఆరిపోకుండా గది వేడిగా ఉండాలనే ఉద్దేశంతో కిటికీలు, తలుపులు మూసేశారు. బుచ్చమ్మ కుర్చీలో కూర్చుని, పద్మరాజు మంచంపై పడుకుని టీవీ చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఊపిరాడకేనా?.. ఇల్లంతా పొగ నిండుకోవడంతో బుచ్చమ్మ, పద్మరాజులిద్దరూ ఊపిరాడక నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం మూడు గంటలకు ఆదిత్యారెడ్డి ఇంటికి అతిథులు రావడంతో టీ పెట్టేందుకు బుచ్చమ్మను పిలవాలని యజమానురాలు ఇంకో పనిమనిషిని పంపగా... ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో పడుకున్నారనుకుని తిరిగి వెనక్కి వచ్చేసింది. కొద్దిసేపటికి సత్యబాబు వెంకటగిరిలో సామాన్లు తీసుకుని ఇంటికివచ్చి తలుపులు కొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూడగా ఇల్లంతా పొగలువ్యాపించి ఉంది. సత్యబాబు డ్రైవర్‌తో కలిసి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్ళి చూడగా కుర్చీపై భార్య, మంచంపై కొడుకు విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ ఎస్సై శంకర్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
రాష్ట్రం.. గజగజ
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: చలి.. చలి! చిన్నా పెద్దా ఒకటే వణుకు... ఉష్ణోగ్రతల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పగలు, రాత్రి అనే తేడా తెలియడం లేదు. భానుడి కిరణాలు సోకక ఎటు చూసినా, ఎప్పుడు చూసినా మసక మసకగానే కనిపిస్తోంది. చలి పులి పట్టపగలే అందరినీ గజగజలాడిస్తోంది. శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 45 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇక నోరులేని మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పెథాయ్ తుపాను ప్రభావంతో అతి శీతలమైన ఈదురు గాలులు ఈడ్చి కొడుతుండటంతో రాష్ట్రం మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర చలితో వణికిపోతోంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలిగా ఉంటోంది. ఒక్కసారిగా పెరిగిన చలి జనం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న శీతల పవనాలకు తట్టుకోలేక సోమవారం 26 మంది ప్రాణాలు కోల్పోగా మంగళవారం 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో వడగాడ్పు మరణాలు భారీగా నమోదైనా చలిగాలులకు ఇంత పెద్ద ఎత్తున మృత్యువాత పడటం అరుదని పేర్కొంటున్నారు. వణికిస్తున్న ఉత్తరాది గాలులు బంగాళాఖాతంలో అల్పపీడనం/వాయుగుండం/తుపాన్లు ఏర్పడినప్పుడు మేఘాలు ఆవరించి ఉంటాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండదు. అయితే నిన్నటిదాకా కొనసాగిన పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి కోస్తా వైపు చల్ల గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి చలి తీవ్రత పెరుగుతోంది. ఇళ్లలోనే గడుపుతున్నా ఇబ్బంది పెడుతోంది. డిసెంబర్ 22వతేదీ నుంచి సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు పయనించడం వల్ల భూమికి దూరమవుతాడు. ఫలితంగా సూర్యకిరణాలు వాలుగా పడుతూ ఎండ తీవ్రత తగ్గి రాత్రి ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా (సాధారణం కంటే 3–10 డిగ్రీలు) తక్కువగా నమోదవుతున్నాయి. ఇది క్రమంగా మరింత తగ్గి చలి విజృంభిస్తుందని, అదే సమయంలో పొగమంచు కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు.. రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా పడిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు విజయవాడలో 9, మచిలీపట్నంలో 8, తునిలో 7, నరసాపురంలో 7, జంగమేశ్వరపురంలో 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం స్పల్పంగా మాత్రమే ఉండటం గమనార్హం. చలి భారీగా పెరగడంతో ఉదయం 9 గంటలకు కూడా ట్యాప్ తిప్పితే నీళ్లు షాక్ కొడుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే చలిమంటలు వేస్తున్నారు. పంటలకు కాపలాగా పొలాల్లో పడుకునే వారు దుంగలు రాజేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలికి శరీరం గడ్డ కట్టుకుపోయేలా ఉందని వృద్ధులు పేర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు కూడా చలిగా ఉండటంతో బయటకు వెళ్లినవారు వణుకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజామునే ఉదయం నడక కోసం వెళ్లేవారు ఈ చలితో సమయాన్ని మార్చుకుని 8 –9 గంటల మధ్య వెళుతున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు వణికిపోతున్నారు. సూర్యరశ్మి లేకపోవటంతో అరటి, బొప్పాయి ఆకులపై కురిసిన మంచు నీటి బిందువుల్లా ఉండిపోతోంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారు చలి తీవ్రత వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు. చలి నేపథ్యంలో స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు బాగా గిరాకీ పెరిగింది. వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో రాకపోకలకు ఇబ్బందులు ఏజెన్సీ ప్రాంతంలో రాత్రిపూట పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రాత్రిపూట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరకులో పర్యాటకుల కోసం రిసార్టు నిర్వాహకులు రాత్రిపూట చలిమంటలు ఏర్పాటు చేస్తున్నారు. గాజు కిటికీలకు బయట భాగంలో మంచు దట్టంగా ఆవరిస్తోంది. జనవరిలో మరింత ఉధృతం... విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పూర్తిస్థాయిలో పడిపోలేదు. విశాఖ జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబరు చివరికి సున్నా డిగ్రీలకు చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 – 8 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడే ఇక్కడి వారు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతే ఇళ్ల ఎదుట చలిమంటలు వేసి నిద్రిస్తారు. దీంతో కొంతవరకూ చలి నుంచి ఊరట లభిస్తుంది. చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, అరకు, మారేడుమిల్లి, సీతంపేట ఏజెన్సీల్లో జనవరిలో చలి తీవ్రరూపం దాల్చుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి ముదురుతుంది. రక్తనాళాలు పూడుకుపోయే ప్రమాదం.. చలి బాగా పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గుండె, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి సూచించారు. ‘చలికి శరీరంలో రక్తానికి గడ్డ కట్టే స్వభావం ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళాలు పూడుకుపోతాయి. అందువల్ల హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, బలహీనులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. చలి నుంచి కాపాడుకోవాలి ఇలా.... – చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని మఫ్లర్, టోపీ ధరించాలి. – ఇళ్లలోకి చల్ల గాలి రాకుండా కిటికీలు మూసివేయాలి. – అవకాశం ఉన్నవారు గది వాతావరణం పడిపోకుండా ఎయిర్ కండిషనర్లు వాడుకోవచ్చు. – ద్విచక్ర వాహనాలపై రాత్రిపూట, తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని టోపీ ధరించాలి.స్వెట్టర్లు వాడాలి. – ఉదయం నడక అలవాటు ఉన్నవారు సూర్యోదయమైన తర్వాత వెళ్లడం మంచిది.