మన్యానికి చలి
దట్టంగా కురుస్తున్న పొగమంచు
పాడేరు ఘాట్, లంబసింగిలో 4 డిగ్రీలు
మినుములూరు, చింతపల్లిలో 7 డిగ్రీల నమోదు
పాడేరు: విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు సమీపం మినుములూరు కాఫీబోర్డు వద్ద శుక్రవారం 7 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, చింతపల్లి మండలం పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో 4 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలితో మన్యంవాసులు వణికిపోతున్నారు.
రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండటంతో చలిమంటలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏజన్సీలో వరిపంట నూర్పుల సమయం కావడంతో వరి కుప్పల వద్ద కాపలాకాసే గిరిజనులు నరకయాతన పడుతున్నారు. మంచు దట్టంగా కురవడంతో శుక్రవారం పాడేరు సంతకు వచ్చిన గిరిజనులంతా చలితో వణికిపోయారు.