మన్యంలో చలిగాలులు
వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతం
లంబసింగిలో 9 డిగ్రీలు
వృద్ధులు, చిన్నారులు విలవిల
పాడేరు/చింతపల్లి: మన్యంలో చలిగాలులు వీస్తున్నాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలులతో రెండు రోజులుగా చలితీవ్రత పెరిగింది. ఆదివారం పాడేరులో 13 డిగ్రీలు, మోదాపల్లిలో 10 డిగ్రీలు, చింతపల్లిలో 12 డిగ్రీలు, లంబసింగిలో 9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా కాఫీ తోటలు ఉండే మోదాపల్లి, మినుములూరు, అరకు, అనంతగిరి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో పగలు కూడా చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది.
ఉదయం 10 గంటలు వరకు మంచు తెరలు వీడడం లేదు. సాయంత్రం 5 నుంచే ఆదివాసీలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. రాత్రిళ్లు నెగడులను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో ఏటా నవంబర్ నుంచి చలి ముదురుతుంది. పది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చలితీవ్రత పెరిగింది. ఆదివారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్ని దుస్తులకు డిమాండ్ ఏర్పడింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు.