చలి@11.2
తగ్గని శీతలగాలుల ఉద్ధృతి
వచ్చే 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం
సిటీబ్యూరో: ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, మంచు గ్రేటర్‌పై ముసురుకుంటున్నాయి. గత మూడు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. చలిసిటీజనులను గజ గజలాడిస్తోంది. సోమవారం కనిష్టంగా 11.2 డిగ్రీలు, గరిష్టంగా 27.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 41 శాతానికి పడిపోయింది. చలికితోడు ఉదయం వేళ కురుస్తున్న మంచు కారణంగా ఆస్తమారోగులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో ఉన్నా చలి వణికిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గడంతో పాటు, శీతల గాలుల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో నగరం వైపు వీస్తున్న శీతల గాలులు ఉద్ధృతి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరై, చలిలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.