మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు | Bomb cyclone, winter storm threatening United States | Sakshi
Sakshi News home page

మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు

Published Sat, Dec 24 2022 4:55 AM | Last Updated on Sat, Dec 24 2022 10:21 AM

Bomb cyclone, winter storm threatening United States - Sakshi

గురువారం అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లోని ఓ వీధిలో దట్టంగా మంచు కురుస్తుండగా ఓ వ్యక్తి బ్లాంకెట్‌ కప్పుకుని రోడ్డు దాటుతున్న దృశ్యం

వాషింగ్టన్‌: అమెరికాపై ‘చలి తుఫాను’ విరుచుకుపడింది. కనీవినీ ఎరగని రీతిలో అతి శీతల గాలులతో ఈ మూల నుంచి ఆ మూల దాకా దేశమంతా వణికిపోతోంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్‌ 20 నుంచి మైనస్‌ 30 డిగ్రీల దాకా పడిపోతున్నాయి. జనాభాలో ఏకంగా 60 శాతం, అంటే 20 కోట్ల మందికి పైగా చలి గుప్పిట చిక్కి అల్లాడుతున్నారు. చివరికి సాధారణంగా వెచ్చగా ఉండే దక్షిణాది రాష్ట్రాలు కూడా చలికి వణుకుతున్న పరిస్థితి! దీన్ని తరానికి కేవలం ఒక్కసారి తలెత్తే ‘అసాధారణ పరిస్థితి’గా అమెరికా వాతావరణ శాఖ అభివర్ణించింది.

ప్రస్తుతం తలెత్తిన పరిస్థితి ‘బాంబ్‌ సైక్లోన్‌’గా రూపాంతరం చెందుతోందని పేర్కొంది. దీనివల్ల వాయు పీడనం ఉన్నట్టుండి పడిపోయి పెను తుఫాన్లకు దారి తీస్తుంది.  దేశవ్యాప్తంగా ‘అత్యంత ఆందోళనకర’ వాతావరణ పరిస్థితి నెలకొందని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు కదలొద్దని ప్రజలకు సూచించారు.

వచ్చే రెండు మూడు రోజులు పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చన్న అంచనాల నేపథ్యంలో క్రిస్మస్‌కు సొంతూళ్లకు వెళ్లాల్సిన వాళ్లు తక్షణం బయల్దేరడం మంచిదన్నారు. ఇది గత 40 ఏళ్లలో ‘అత్యంత చల్లని’ క్రిస్మస్‌ కానుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చలి ధాటికి ఇప్పటికే చాలాచోట్ల క్రిస్మస్‌ వీకెండ్‌ సంబరాలు వెనకపట్టు పట్టాయి. ఈ పరిస్థితులు కనీసం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి! పొరుగు దేశమైన కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది.

ప్రాణాంతక గాలులు
అతి శీతల వాతావరణం దృష్ట్యా అమెరికాలో ఇప్పటికే 13కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలాచోట్ల 100 కిలోమీటర్లకు పై చిలుకు వేగంతో అత్యంత చల్లని గాలులు ఈడ్చి కొడుతున్నాయి. వాటి దెబ్బకు దేశవ్యాప్తంగా ఎటు చూసినా కరెంటు సరఫరాలో అంతరాయం నెలకొంది. అసలే అతి శీతల వాతావరణంలో ఆదుకునే కరెంటు కూడా లేక జనం అల్లాడుతున్నారు. కనీసం 4 కోట్ల మంది కరెంటు కోతతో అల్లాడుతున్నట్టు సమాచారం.

సాధారణంగా అతి శీతల వాతావరణముండే డెన్వర్‌లో కూడా గత 32 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఏకంగా మైనస్‌ 31 డిగ్రీలు నమోదైంది! షికాగో, డెన్వర్, డాలస్‌ వంటి పలుచోట్ల సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు కాస్తా గంటల వ్యవధిలోనే మైనస్‌లలోకి పడిపోయాయి!! దాంతో క్రిస్మస్‌ వేళ దేశవ్యాప్తంగా చాలాచోట్ల రోడ్డు రవాణా సేవలు స్తంభించిపోయాయి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని అతి శీతల పరిస్థితుల కారణంగా ఒక్క శుక్రవారమే ఏకంగా మూడు వేలకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా  నడుస్తున్నాయి.

ఏమిటీ బాంబ్‌ సైక్లోన్‌? 
అమెరికాను అల్లాడిస్తున్న అతిశీతల వాతావరణానికి ప్రధాన కారణం ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌. ఆర్కిటిక్‌ నుంచి వీచే అతి శీతల గాలులు కనీవినీ ఎరగనంతటి చలికి, హిమపాతానికి కారణమవుతాయి. ఈ పరిస్థితి స్థిరంగా కొనసాగి మరింత విషమిస్తే బాంబ్‌ సైక్లోన్‌గా పేర్కొంటారు. పొడి, చలి తరహా భిన్న గాలులు ఒక్కసారిగా కలిసిపోతే ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. తేలికైన వెచ్చని గాలి పైకి వెళ్తుంది. ఆ క్రమంలో ఏర్పడే మేఘాల వ్యవస్థ కారణంగా వాయు పీడనం అతి వేగంగా తగ్గిపోయి తుఫాను తరహా పరిస్థితులకు దారి తీస్తుంది. చుట్టూ ఉన్న అతిశీతల పరిస్థితులు మంచు తుఫానుగా మారతాయి. పీడనం ఎంత తగ్గితే దీని తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఒకట్రెండు రోజుల్లో మరింత విషమించవచ్చని అంచనా. బాంబ్‌ సైక్లోన్‌ ధాటికి ఉష్ణోగ్రతలు గంటల్లోనే ఏకంగా 11 డిగ్రీలకు పైగా పతనమవుతుంటాయి! ఫలితంగా ప్రాణాంతకమైన చలి గాలులు చెలరేగుతాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement