A Large Swath of the US Braced for a Dangerous Mix of Sub-Zero Temperatures - Sakshi
Sakshi News home page

అంధకారంలో అగ్రరాజ్యం.. అమెరికాలో మంచు తుఫాను విశ్వరూపం

Published Sun, Dec 25 2022 1:46 AM | Last Updated on Sun, Dec 25 2022 9:53 AM

US braces for Dangerous blast of cold with wind chills less than 40C in parts - Sakshi

వాషింగ్టన్‌: ఊహించినట్టే అమెరికాలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. దేశంలో 3,500 కిలోమీటర్ల పొడవున బీభత్సం సృష్టిస్తోంది. వాతావరణ శాఖ అనుమానించిట్టుగానే ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌ కాస్తా శక్తిమంతమైన బాంబ్‌ సైక్లోన్‌గా రూపాంతరం చెందుతోంది. దాని దెబ్బకు చాలా రాష్ట్రాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు మైనస్‌ 45 డిగ్రీల కంటే కూడా దిగువకు పడిపోయాయి! గడ్డ కట్టించే చలికి 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వీసే అతి శీతల గాలులు తోడయ్యాయి.

దాంతో జీవితంలో కనీవినీ ఎరుగనంతటి ఎముకలు కొరికే చలి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తూర్పు అమెరికాలో పరిస్థితి భయానకంగా ఉంది. పెను గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. దాంతో దేశంలో అత్యధిక ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. 20 లక్షలకు పైగా ఇళ్లు, కార్యాలయాల్లో అంధకారం అలముకుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మంచు తుఫానుతో 20 కోట్ల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు.

క్రిస్మస్‌ విరామ సమయంలో ఇంటి నుంచి బయట కాలు పెట్టే వీల్లేక, చలి నుంచి తప్పించుకునే మార్గం లేక వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. భరించలేని చలి కారణంగా న్యూయార్క్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు! 13 రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితి అమల్లోకి రావడం తెలిసిందే.

దీన్ని దేశ చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా భావిస్తున్నారు. పొరుగు దేశం కెనడాలో కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఒంటారియో, క్యుబెక్‌ తదితర ప్రాంతాలు కూడా భరించలేని చలి, కరెంటు అంతరాయాలతో అతలాకుతలమవుతున్నాయి. బ్రిటిష్‌ కొలంబియా నుంచి న్యూఫౌండ్‌ లాండ్‌ దాకా కెనడాలోని మిగతా చోట్ల కూడా మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో విమాన సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. 

పశ్చిమ అమెరికాలోని మోంటానాలో ఉష్ణోగ్రత మైనస్‌ 45 డిగ్రీలకు పడిపోయింది. పలు మధ్య రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. వ్యోమింగ్‌లో రాష్ట్ర చరిత్రలోనే  అత్యల్పంగా మైనస్‌ 42 డిగ్రీలు నమోదైంది. అయోవా తదితర చోట్ల మైనస్‌ 38 డిగ్రీలకు తగ్గడం లేదు. డెన్వర్, కొలరాడో వంట రాష్ట్రాల్లో గత 40 ఏళ్లలో తొలిసారిగా మైనస్‌ 25 డిగ్రీలకు పడిపోయింది. టెన్నెసీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత 30 ఏళ్లలో తొలిసారిగా సున్నా కంటే దిగువకు పడిపోయింది. 

ఇంతటి అతి శీతల వాతావరణంలో మంచు బారిన పడితే అవయవాలను శిథిలం చేసే ప్రాణాంతకమైన ఫ్రాస్ట్‌ బైట్‌ బారిన పడేందుకు ఐదు నిమిషాలు కూడా పట్టదని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని సూచించింది. 

ఎటు చూసినా గ్రిడ్‌ వైఫల్యంతో అమెరికా కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి కరెంటు కోతలతో అల్లాడిపోతోంది. ఒక్క నార్త్‌ కాలిఫోర్నియాలోనే 2 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా ఆగిపోయింది! వర్జీనియా, టెన్నెసీ తదితర రాష్టాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. స్టౌలు, డిష్‌వాషర్లు, లైట్ల వాడకం కూడా నిలిపేయాలని విద్యుత్‌ సరఫరా సంస్థలు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది!! 

మరోవైపు అత్యంత ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం 6,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. దాంతో క్రిస్మస్‌ సంబరాల కోసం సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు బయల్దేరిన వాళ్లు మార్గమధ్యంలో చిక్కుకున్నారు. గురువారం 3000కు పైగా విమానాలు రద్దవడం తెలిసిందే. 

మంచు తుఫాను వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటిదాకా 20 మందికి పైగా మరణించారు. హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోవడంతో పాటు కన్ను పొడుచుకున్నా ఏమీ కన్పించని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో న్యూయార్క్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు విధించారు. 
ఇప్పటికే 20 కోట్ల మందికి పైగా ప్రజలకు హెచ్చరికలు, ఆంక్షల పరిధిలో ఉన్నట్టు జాతీయ వాతావరణ సంస్థ పేర్కొంది. అతి శీతల పరిస్థితులు, ప్రచండమైన గాలులు మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చని హెచ్చరించింది. 

చలి భరించరానంతగా పెరిగిపోవడంతో న్యూయార్క్‌ గవర్నర్‌ కేథీ హోచల్‌ ఎమర్జెన్సీ రాష్ట్రంలో ప్రకటించారు. ‘‘ఎటు చూసినా మంచే. గడ్డ కట్టించే చలే. రాష్ట్రంలో చాలా చోట్ల హిమపాతం తీవ్రంగా ఉంది. మరికొన్ని చోట్ల వరద ముప్పు పొంచి ఉంది. ఇది నిజంగా ప్రాణాంతకమైన పరిస్థితే’’ అంటూ వాపోయారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి వచ్చే సాహసం చేయొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. 

న్యూయార్క్, న్యూజెర్సీ వంటి తీర ప్రాంతాల్లో వరదలు కూడా ముంచెత్తుతున్నాయి. సాధారణంగా చాలావరకు వెచ్చగానే ఉండే లూసియానా, అలబామా, ఫ్లోరిడా, జార్జియా వంటి దక్షిణాది రాష్ట్రాలు కూడా చలికి అల్లాడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement