
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ,
.. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.
ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!
ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment