ఐదుగురు మృతి, అంధకారంలో 2 లక్షల మంది
2,400 విమానాలు రద్దు
వాషింగ్టన్: తుఫాను కారణంగా తూర్పు అమెరికా అంతటా భారీ మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఐదుగురు మృతి చెందారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. 2,400కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాషింగ్టన్‌లో ఒక అడుగు వరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) అంచనా వేసింది. పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభావిత రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అమెరికా రాజధానిలోని ఇళ్లన్నీ మంచులో కూరుకుపోయాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని పాఠశాలలు మూసివేశారు. కాన్సాస్, మిస్సోరి సహా పలు రాష్ట్రాల్లో మంచు తుఫాను పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. కెంటకీ, మిస్సోరి, వర్జీనియా, మేరీల్యాండ్ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోడ్లను క్లియర్ చేయడానికి అత్యవసర నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గవర్నర్లు, స్థానిక అధికారులు కోరారు. ఆగ్నేయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్లు, టోర్నడోలు వస్తాయని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. మంచు దట్టంగా పేరుకుపోతుందని, శక్తివంతమైన గాలులతో చెట్లు కూలిపోతాయని, దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment