temperatures down
-
ఫిన్లాండ్, స్వీడన్లో రికార్డు స్థాయి చలి
స్టాక్‌హోమ్: నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లను చలి వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఎముకలు కొరికే చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో మూడు దేశాల్లోనూ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్వీడన్‌లోని ఉత్తరప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1999 తర్వాత –43.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ తెలిపింది. 1951లో, తిరిగి 1999లోనూ –49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తు చేసింది. పొరుగునే ఉన్న ఫిన్లాండ్లోని వైలివియెస్కాలో ఉష్ణోగ్రత మంగళవారం –37.8 డిగ్రీలుగా నమోదైంది. -
ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రాణం తీసిన పొగమంచు! బహ్రెయిచ్(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్–బల్రామ్పూర్ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. -
చలి పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు నెలకొన్నాయి. దీంతో క్రమంగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత పడిపోయాయి. ఉష్ణోగ్రతల పతనానికి తో డుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. అంతటా తగ్గుదలే... రాష్ట్ర మంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. కానీ ప్రస్తుతం సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల వారీగా పరిశీలిస్తే మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకో రెండు రోజులు ఇలానే రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
మారుతున్న ఉష్ణోగ్రతలు హానికరం.. వైద్యుల హెచ్చరిక
పగటి ఉష్ణోగ్రత పెరుగుదల, రాత్రిపూట చలి కారణంగా జ్వరం, గొంతు చికాకు మరియు దగ్గు, కంటి ఇన్ఫెక్షన్ వంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించలేనివారికి ఇది హానికరమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య ఇటీవలి అధిక వ్యత్యాసం ఆందోళనకరంగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల్లో వైవిధ్యాలు వాతావరణ మార్పులకు సంకేతమని, ఇవి అనారోగ్యాల పెరుగుదలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు వైవిధ్యం సాధారణ నిద్రకు భంగం కలిగిస్తాయని, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలే కాక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ వాతావరణ మార్పుల సమయంలో వేడి గాలి, పొడి గాలి, ఆరుబయట ఎక్కువ సమయం గడపడం వల్ల అనారోగ్య స్థాయి పెరుగుతోంది. ఉష్ణోగ్రత 40ని డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలసట, చురుకుదనం కోల్పోవడం, కండరాల నొప్పులు, మూర్ఛలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి కంటి, గొంతు, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ► బయట ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి ► పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ► మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది ► రోగనిరోధక శక్తికోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి ► అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. -
మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు
వాషింగ్టన్: అమెరికాపై ‘చలి తుఫాను’ విరుచుకుపడింది. కనీవినీ ఎరగని రీతిలో అతి శీతల గాలులతో ఈ మూల నుంచి ఆ మూల దాకా దేశమంతా వణికిపోతోంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల దాకా పడిపోతున్నాయి. జనాభాలో ఏకంగా 60 శాతం, అంటే 20 కోట్ల మందికి పైగా చలి గుప్పిట చిక్కి అల్లాడుతున్నారు. చివరికి సాధారణంగా వెచ్చగా ఉండే దక్షిణాది రాష్ట్రాలు కూడా చలికి వణుకుతున్న పరిస్థితి! దీన్ని తరానికి కేవలం ఒక్కసారి తలెత్తే ‘అసాధారణ పరిస్థితి’గా అమెరికా వాతావరణ శాఖ అభివర్ణించింది. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితి ‘బాంబ్ సైక్లోన్’గా రూపాంతరం చెందుతోందని పేర్కొంది. దీనివల్ల వాయు పీడనం ఉన్నట్టుండి పడిపోయి పెను తుఫాన్లకు దారి తీస్తుంది. దేశవ్యాప్తంగా ‘అత్యంత ఆందోళనకర’ వాతావరణ పరిస్థితి నెలకొందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు కదలొద్దని ప్రజలకు సూచించారు. వచ్చే రెండు మూడు రోజులు పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చన్న అంచనాల నేపథ్యంలో క్రిస్మస్కు సొంతూళ్లకు వెళ్లాల్సిన వాళ్లు తక్షణం బయల్దేరడం మంచిదన్నారు. ఇది గత 40 ఏళ్లలో ‘అత్యంత చల్లని’ క్రిస్మస్ కానుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చలి ధాటికి ఇప్పటికే చాలాచోట్ల క్రిస్మస్ వీకెండ్ సంబరాలు వెనకపట్టు పట్టాయి. ఈ పరిస్థితులు కనీసం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి! పొరుగు దేశమైన కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రాణాంతక గాలులు అతి శీతల వాతావరణం దృష్ట్యా అమెరికాలో ఇప్పటికే 13కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలాచోట్ల 100 కిలోమీటర్లకు పై చిలుకు వేగంతో అత్యంత చల్లని గాలులు ఈడ్చి కొడుతున్నాయి. వాటి దెబ్బకు దేశవ్యాప్తంగా ఎటు చూసినా కరెంటు సరఫరాలో అంతరాయం నెలకొంది. అసలే అతి శీతల వాతావరణంలో ఆదుకునే కరెంటు కూడా లేక జనం అల్లాడుతున్నారు. కనీసం 4 కోట్ల మంది కరెంటు కోతతో అల్లాడుతున్నట్టు సమాచారం. సాధారణంగా అతి శీతల వాతావరణముండే డెన్వర్‌లో కూడా గత 32 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఏకంగా మైనస్ 31 డిగ్రీలు నమోదైంది! షికాగో, డెన్వర్, డాలస్ వంటి పలుచోట్ల సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు కాస్తా గంటల వ్యవధిలోనే మైనస్లలోకి పడిపోయాయి!! దాంతో క్రిస్మస్ వేళ దేశవ్యాప్తంగా చాలాచోట్ల రోడ్డు రవాణా సేవలు స్తంభించిపోయాయి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని అతి శీతల పరిస్థితుల కారణంగా ఒక్క శుక్రవారమే ఏకంగా మూడు వేలకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏమిటీ బాంబ్ సైక్లోన్? అమెరికాను అల్లాడిస్తున్న అతిశీతల వాతావరణానికి ప్రధాన కారణం ఆర్కిటిక్ బ్లాస్ట్. ఆర్కిటిక్ నుంచి వీచే అతి శీతల గాలులు కనీవినీ ఎరగనంతటి చలికి, హిమపాతానికి కారణమవుతాయి. ఈ పరిస్థితి స్థిరంగా కొనసాగి మరింత విషమిస్తే బాంబ్ సైక్లోన్‌గా పేర్కొంటారు. పొడి, చలి తరహా భిన్న గాలులు ఒక్కసారిగా కలిసిపోతే ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. తేలికైన వెచ్చని గాలి పైకి వెళ్తుంది. ఆ క్రమంలో ఏర్పడే మేఘాల వ్యవస్థ కారణంగా వాయు పీడనం అతి వేగంగా తగ్గిపోయి తుఫాను తరహా పరిస్థితులకు దారి తీస్తుంది. చుట్టూ ఉన్న అతిశీతల పరిస్థితులు మంచు తుఫానుగా మారతాయి. పీడనం ఎంత తగ్గితే దీని తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఒకట్రెండు రోజుల్లో మరింత విషమించవచ్చని అంచనా. బాంబ్ సైక్లోన్ ధాటికి ఉష్ణోగ్రతలు గంటల్లోనే ఏకంగా 11 డిగ్రీలకు పైగా పతనమవుతుంటాయి! ఫలితంగా ప్రాణాంతకమైన చలి గాలులు చెలరేగుతాయి. -
Telangana: చలి.. చలి!
సాక్షి, హైదరాబాద్: చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పతనమవుతున్నాయి. నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నాటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో 33.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. చాలాచోట్ల సాధా రణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదు కావడం రాష్ట్రంలో చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రా నున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతటా తక్కువే.. ప్రస్తుతం సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధా రణ కనిష్ట ఉష్ణోగ్రతలతో పోలిస్తే గురు వారం హన్మకొండలో 4.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. మెదక్‌లో 4.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 3.5 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, అదిలాబాద్, రామగుండంలోనూ సాధారణం కంటే రెండు డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. జాగ్రత్తగా ఉండాలి.. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తు లో వేగంగా గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు ఈశాన్య దిశల నుంచి వచ్చే గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, హృద్రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. -
సూర్యుడికి ఆయుక్షీణం
లండన్: జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందట. సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనని, ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చెబుతోంది. భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్ఏ ప్రయోగించిన గైయా స్పేస్ అబ్జర్వేటరీ(స్పేస్‌క్రాఫ్ట్) భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది. సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్ నిల్వలే. సూర్యుడి ఉపరితలం ఉన్న హైడ్రోజన్ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తుతో హైడ్రోజన్ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట! దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. సూర్యగోళం మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు. -
వణుకుతున్న వాయవ్య భారతం
జైపూర్: శీతగాలులు వాయవ్య భారతాన్ని వణికిస్తున్నాయి. రాజస్తాన్, పంజాబ్‌లలో గడ్డకట్టించే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. వరుసగా రెండోరోజు కూడా రాజస్తాన్‌లోని ఫతేపూర్, చురుల్లో రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఫతేపూర్‌లో మైనస్ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్ 2.6 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. గడిచిన 12 ఏళ్లలో చురులో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆదివారం సికార్, కరౌలి, చిత్తోర్‌గఢ్ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సికార్‌లో మైనస్ 2.6 డిగ్రీలు, కరౌలీలో మైనస్ 0.6, చిత్తోర్‌గఢ్‌లో మైనస్ 0.2 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భిల్వారాలో జీరో డిగ్రీలు, పిలానీలో 0.1, నాగౌర్‌లో 0.2, అల్వార్‌లో 0.4, బనస్థలిలో 1.5, సంగారియాలో 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీలు హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ కూడా చలి గుప్పిట్లో గజగజ వణికిపోతున్నాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హల్వారాలో జీరో డిగ్రీలు, భటిండా 0.1, ఫరీద్‌కోట్‌లో 1, పటాన్‌కోట్‌లో 1.5 డిగ్రీలకు శనివారం రాత్రి కనిష్ట ఉప్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం తీవ్ర చలిగాలు వీచాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్రకు బేస్‌క్యాంప్ అయిన కశ్మీర్‌లోని గుల్మార్గ్ రిసార్ట్‌లో మైనస్ 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బారాముల్లాలో మైనస్ 6.5 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాగునీటిని సరఫరా చేసే పైపుల్లో మంచు గడ్డకట్టుకుపోయింది. పలు సరస్సులు గడ్డకట్టాయి. కాకపోతే కశ్మీర్ ప్రజలకు ఇది అలవాటే కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. -
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: కోస్తా తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఉత్తర గాలులు వీస్తుండడం.. వీటికి అనుబంధంగా రాయలసీమ మీదుగా వీస్తున్న ఈశాన్య గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 3–5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖ, రాయలసీమలోని పశ్చిమ ప్రాంతాల్లో 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు. చలి గాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకూ రోడ్లపైకి ప్రజలు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విశాఖ మన్యంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో 5.8 డిగ్రీలు, అరకు లోయలో 9.6, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చింతపల్లి @ 5.6 డిగ్రీలు
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకూ నమోదవుతుంటాయి. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కి.మీ. ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. విశాఖ మన్యంలో వారం రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర తీరం మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముంచంగిపుట్టులో 12.63 డిగ్రీలు, జి.మాడుగులలో 13.64, డుంబ్రిగూడలో 13.74, అరకులో 13.91, పెదబయలులో 14.61, హుకుంపేటలో 14.80, పాడేరులో 15.16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
రాత్రి చలితో.. పగలు ఎండతో.. జాగ్రత్త సూమా
సాక్షి, అమలాపురం : మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతోంది. శివరాత్రి దాటితే వేసవి ఎండలు వచ్చినట్టు భావిస్తారు. కానీ ఈసారి శివరాత్రి కన్నా ముందే వేసవి వచ్చినట్టుగా వాతావరణం కనిపిస్తోంది. గత 20 రోజుల్లో మధ్యలో మూడు నాలుగు రోజులు మినహా పగటి వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండ చురుక్కుమంటోంది. ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రాత్రి చలి తీవ్రత తగ్గడం లేదు. తెల్లవారు జామున మంచుదుప్పటి కప్పేస్తోంది. మరీ ముఖ్యంగా గడచిన రెండు రోజుల నుంచి జిల్లా మంచుముసుగులో చిక్కుకుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ మంచు కమ్ముకుంటోంది. ఉదయం పది దాటాక భానుడు చుర్రుమనిపించేస్తున్నాడు. జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కోనసీమ కేంద్రమైన అమలాపురం, జిల్లా కేంద్రమైన కాకినాడలో ఉష్ణోగ్రతల కన్నా విచిత్రంగా ఏజెన్సీలోని రంపచోడవరం, చింతూరుల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. పగటి పూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీలోని చింతూరులో 35, ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంతోపాటు మైదానంలో రాజమహేంద్రవరంలో 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చల్లని ప్రాంతమైన మారేడుమిల్లిలో 32 డిగ్రీలు నమోదు కాగా, అమలాపురం, కాకినాడల్లో 31 డిగ్రీలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలకు వస్తే జిల్లాలో అతి తక్కువగా మారేడుమిల్లిలో 16 డిగ్రీలు, రంప చోడవరంలో 18, చింతూరు, రాజమహేంద్రవరాల్లో 19, అమలాపురంలో 20, కాకినాడలో 24 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య వాతావరణం తేడాగా ఉండడం వల్ల ప్రజలు పలు రోగాల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరాలు, దగ్గు వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. ఇక కొబ్బరికి ప్రమాదంగా మారిన రూగోస్ వైట్ ఫ్లై (తెల్లదోమ) ఉధృతి పెరగడానికి ఇదే అనువైన కాలం. ఆరోగ్యం అప్రమత్తం సుమా.. వాతావరణ మార్పులతో వైరల్ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైరల్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ఆయా అనారోగ్య లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ► మంచులో ఎక్కువగా తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వస్తే ► మంచు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► అతి శీతల నీరు తాగకూడదు. బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ► గొంతునొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించి వైద్యం చేయించుకోవాలి. ► డ్రైనేజీల సమీపంలో నివసించే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల బెడద లేకుండా జాగ్రత్త పడాలి. వైద్యులను సంప్రదించాలి ప్రస్తుత వాతావరణ మార్పులతో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మంచులో ఎక్కువగా తిరగకూడదు. దగ్గు, జ్వరం తదితర ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యసాయం పొందాలి. – డాక్టర్ చైతన్య, సూపరింటెండెంట్, మండపేట ప్రభుత్వ ఆస్పత్రి -
మసక మసక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 6 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా మరిపెడ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, నల్లగొండ జిల్లాలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. హన్మకొండలో సాధారణం కంటే 8.6 డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో చిరు జల్లులు.. ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆదివారం హైదరాబాద్‌లో పలు చోట్ల శీతలగాలులతోపాటు చిరు జల్లులు కురిశాయి. ఆదివారం నగరంలో సాధారణం కంటే 8.2 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 27 మి.మీ, ఉప్పల్‌లో 26, అల్వాల్‌లో 19.8, సికింద్రాబాద్‌లో 16 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. -
మీ ఆరోగ్యాన్ని... దుస్తులే చెబుతాయి!
ఫిట్నెస్ కోసం మనం స్మార్ట్‌వాచ్‌ల వంటి బోలెడన్ని పరికరాలు వాడేస్తున్నామా... యూబీసీ ఓకనగాన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు ఇకపై ఇవేవీ అవసరం లేదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. తాము ఎంచక్కా ఉతికేసుకున్నా పనిచేయగల సెన్సర్లను అభివృద్ధి చేశామని.. వీటిని పోగులుగా వాడుకున్న దుస్తులను వేసుకుంటే మీ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే ఈ సెన్సర్ దుస్తుల్లోని పోగులు సాగిపోవడం ఆధారంగా మన కదలికలను గుర్తిస్తాయి. కాకపోతే ఈ పోగులను గ్రాఫీన్ నానోప్లేట్లెట్స్తో శుద్ధి చేయాల్సి ఉంటుంది. పీజో రెసిస్టివిటీ అనే భౌతిక ధర్మం ఆధారంగా ఈ సెన్సర్లు పనిచేస్తాయని, గుండెచప్పుళ్లను గుర్తించడంతోపాటు, ఉష్ణోగ్రత నియంత్రణకు వీటిని వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మినా హూర్ఫర్ అంటున్నారు. స్పాండెక్స్ వంటి వస్త్రాల్లో సెన్సర్లు ఉన్న పోగులను ఏర్పాటు చేసి దాన్ని సిలికాన్ షీట్లతో చుట్టేస్తే... అవి నిత్యం మన వివరాలను నమోదు చేస్తూ అవసరమైనప్పుడు సమాచారం అందిస్తాయని.. శరీరంలో నీళ్లు తగ్గితే తాగమని సూచించడం, ఒత్తిడికి గురైనప్పుడు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడం వంటి పనులన్నీ ఈ సెన్సర్ ఆధారిత వస్త్రాలు చేయగలవని మినా అంటున్నారు. ప్రస్తుతానికి తాము సెన్సర్లను పరీక్షించే దశలో ఉన్నామని.. సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవకాశముందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ సరికొత్త, చౌక సెన్సర్ దుస్తులు మార్కెట్లోకి వచ్చేస్తాయని అన్నారు. -
సిటీ గజగజ..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మంచు, చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు చలి తీవ్రత కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా పడిపోతున్న పగటి పూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగా నమోదు అవుతున్నాయి. జనవరి 14 తర్వాత క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఇటీవలి తుపాను కారణంగా మళ్లీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 12.8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. అది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. పగటి పూట సైతం సగటు కంటే తక్కువగానే నమోదైంది. మంగళవారం నగరంలో 26.7 డిగ్రీలు నమోదు కాగా, ఇది కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. ఈ ఉష్ణోగ్రతలు స్వైన్ ఫ్లూకు కారణమయ్యే హెచ్1ఎన్1 వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని వైద్యులు హెచ్చరించారు. నగర వాసులు స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. -
పగలూ గజగజ
సాక్షి, హైదరాబాద్/కోహిర్ (జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతు న్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గం. వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో మంగళవారం ఉదయం రికార్డు స్థాయిలో 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ), జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 3.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. ఇక కోహిర్ మండలానికి పక్కనే ఉన్న మర్పల్లి, ఆసిఫాబాద్ జిల్లా కొమురంభీం మండలం గిన్నెధారిలో 3.8 డిగ్రీల æచొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 4.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి, వికారాబాద్ జిల్లా నాగారంలో 4.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండ్రోజుల పాటు చలిగాలులు.. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ రెండ్రోజులు ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, నిజామా బాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 5 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఢిల్లీ @ 2.6 c
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రజలను చలిపులి వణికిస్తోంది. ఢిల్లీలో శనివారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 2.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇది ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం. మరోవైపు పొగమంచు కారణంగా దృశ్యత 1,500 మీటర్లకు పడిపోయింది. ఇక పాలెం విమానాశ్రయంలో 800 మీటర్ల దూరంలోని వస్తువులు సైతం కనిపించకుండా మంచు దుప్పటి కమ్మేసింది. ఈ విషయమై భారత వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు సాధారణ స్థాయిలోనే కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టంగా కురుస్తోందని తెలిపారు. ఆకాశం నిర్మలంగానే ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. హరియాణా, ఢిల్లీ, చండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సోమవారం వరకూ చలిగాలులతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ, మిగిలిన కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పంజాబ్‌తో పాటు ఉత్తర, పశ్చిమ రాజస్తాన్‌లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీలో శనివారం వాయు నాణ్యత సూచీ 398 పాయింట్లకు చేరుకున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు.. ఇక జమ్మూకశ్మీర్‌లోని లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్ర వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 7.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది గత మూడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం. కాజీగంద్లో మైనస్ 6.2, కుప్వారాలో మైనస్ 6, అమర్నాథ్ యాత్రికులకు బేస్ క్యాంప్‌గా ఉన్న పెహల్గామ్లో మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత నమోదయింది. -
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపైకి ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవలే నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడం, ఈశాన్య రుతు పవనాలు ప్రవేశిస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండలో 5 డిగ్రీలు తక్కువగా, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క ఖమ్మంలోనే సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, డిసెంబర్ నాటికి తీవ్రమైన చలి ఉంటుందని రాజారావు వెల్లడించారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో రాత్రి 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 11 డిగ్రీలుగా రికార్డయింది. ఖమ్మంలో 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఐదు డిగ్రీలు తక్కువగా రామగుండంలో 12, భద్రాచలంలో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హకీంపేటలో 13, హైదరాబాద్‌లో 14, మహబూబ్‌నగర్‌లో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
లేహ్‌లో మైనస్ 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లఢక్‌లోని లేహ్‌లో గురువారం రాత్రి అత్యల్పంగా మైనస్ 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు రాత్రి మైనస్ 7.1 డిగ్రీలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కార్గిల్‌లో మైనస్ 9.2 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 2.8 డిగ్రీలు, దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగంఢ్లో మైనస్ 2.4 డిగ్రీలు, గుల్మార్గ్లోని స్కీ రిసార్ట్‌లో మైనస్ 5.4 డిగ్రీలు, పహల్గామ్ వద్ద మైనస్ 2.4 డిగ్రీలు నమోదయ్యాయి. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రత లు పడిపోతున్నా యి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా 8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలంలో ఏకంగా 8 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 7 డిగ్రీలు తక్కువగా, రామగుండంలో 5 డిగ్రీలు తక్కువగా 10 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లలో 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేట, నల్లగొండల్లో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
వణికిస్తున్న చలిగాలులు
-
వణికిస్తున్న చలిగాలులు
హైదరాబాద్: తెలంగాణలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఈ పరిస్థితులు మరో మూడు రోజుల పాటు ఉంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఆదివారం పేర్కొంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 9 డిగ్రీలు, రామగుండంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 11, హైదరాబాద్‌లో 13 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే ఒకటి నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొన్నిచోట్ల మూడు రోజులపాటు చలిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు స్వెట్టర్లు, జర్కిన్లు ధరించే బయటకు రావాలని సూచించింది. పిల్లలు, పెద్దలు చలిగాలుల నుంచి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.