పగటి ఉష్ణోగ్రత పెరుగుదల, రాత్రిపూట చలి కారణంగా జ్వరం, గొంతు చికాకు మరియు దగ్గు, కంటి ఇన్ఫెక్షన్ వంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించలేనివారికి ఇది హానికరమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య ఇటీవలి అధిక వ్యత్యాసం ఆందోళనకరంగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల్లో వైవిధ్యాలు వాతావరణ మార్పులకు సంకేతమని, ఇవి అనారోగ్యాల పెరుగుదలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు వైవిధ్యం సాధారణ నిద్రకు భంగం కలిగిస్తాయని, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలే కాక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ఈ వాతావరణ మార్పుల సమయంలో వేడి గాలి, పొడి గాలి, ఆరుబయట ఎక్కువ సమయం గడపడం వల్ల అనారోగ్య స్థాయి పెరుగుతోంది. ఉష్ణోగ్రత 40ని డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలసట, చురుకుదనం కోల్పోవడం, కండరాల నొప్పులు, మూర్ఛలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి కంటి, గొంతు, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి
► బయట ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి
► పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
► మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది
► రోగనిరోధక శక్తికోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి
► అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment