temperature effect
-
మారుతున్న ఉష్ణోగ్రతలు హానికరం.. వైద్యుల హెచ్చరిక
పగటి ఉష్ణోగ్రత పెరుగుదల, రాత్రిపూట చలి కారణంగా జ్వరం, గొంతు చికాకు మరియు దగ్గు, కంటి ఇన్ఫెక్షన్ వంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించలేనివారికి ఇది హానికరమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య ఇటీవలి అధిక వ్యత్యాసం ఆందోళనకరంగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల్లో వైవిధ్యాలు వాతావరణ మార్పులకు సంకేతమని, ఇవి అనారోగ్యాల పెరుగుదలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు వైవిధ్యం సాధారణ నిద్రకు భంగం కలిగిస్తాయని, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలే కాక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ వాతావరణ మార్పుల సమయంలో వేడి గాలి, పొడి గాలి, ఆరుబయట ఎక్కువ సమయం గడపడం వల్ల అనారోగ్య స్థాయి పెరుగుతోంది. ఉష్ణోగ్రత 40ని డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలసట, చురుకుదనం కోల్పోవడం, కండరాల నొప్పులు, మూర్ఛలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి కంటి, గొంతు, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ► బయట ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి ► పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ► మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది ► రోగనిరోధక శక్తికోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి ► అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. -
అల్ఫొన్సో మామిడికి ఎండల ఎఫెక్ట్!
సాక్షి, ముంబై : ఈ సారి అల్ఫొన్సో మామిడి పళ్ల సరఫరా 30 నుంచి 60 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయి. ఈ ఏడాది కొంకణ్ రీజియన్‌లో జనవరిలో మామిడి పూత గణనీయంగా రాలిపోయింది. ఈ ప్రభావంతో పంట దిగుబడి తగ్గే అవకాశముందని మామిడి తోటల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అలాగే మార్చి మధ్య కాలం నుంచి పండ్ల సరఫరా కొంతమేర పెరుగుతుందని తెలిపారు. ఎండలు మండుతుండటంతో మామిడి ఉత్పత్తిపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో అల్ఫొన్సో మామిడి ధరలు పెరగడంతో పాటు వినియోగదారుడికి దూరమయ్యే అవకాశం లేకపోలేదు. మండే ఎండలతో.. గత కొన్ని రోజుల నుంచి మామిడి పూత గణనీయంగా చెట్ల నుంచి రాలిపోతోంది. దీని ప్రభావం మార్చిలో నగరానికి ప్రవేశించే మామిడి పండ్లు, నాణ్యత, పరిమాణంపై పడనుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే రత్నగిరిలో 35 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండలు మండిపోవడంతో మామిడి పండ్లు చిన్న దశలోనే చెట్ల నుంచి కిందకు రాలిపోతున్నాయి. అంతేకాకుండా హ్యుమిడిటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీని వల్ల మామిడి పండ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మామిడి ఉత్పత్తిదారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌కు మామిడి సప్లై తగ్గిందని.. ప్రస్తుతం తాము 4 నుంచి 5 పెట్టెలు మాత్రమే పొందుతున్నామని వ్యాపారులు అంటున్నారు. కాయలు రాలిపోతున్నాయి వేడి అధికంగా ఉండటంతో మామిడి కాయలు కూడా చెట్ల నుంచి గణనీయంగా కిందకు రాలుతున్నాయని రత్నగిరిలోని 700 ఎకరాల మామిడి తోట యజమాని మందర్ దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 10 తర్వాత మామిడి పండ్ల సరఫరా మామూలుగానే ఉంటుందన్నారు. పగలు వేడి, రాత్రి చల్లని గాలులతో వాతావరణం విరుద్ధంగా మారడంతో మామిడి కాయలు రాలుతున్నాయన్నారు. మధ్యాహ్న వేళలో వేడి తాపం అధికంగా ఉండటంతో పండు పక్వానికి రాకముందే మగ్గిపోతోందని వివరించారు. నల్ల మచ్చలతో పాడైపోతున్నాయి వేడికి మామాడి పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని దేవ్‌గఢ్ తాలూకా మ్యాంగో గ్రోవర్స్ కోఆపరేటివ్ సొసూటీ లిమిటెడ్ డైరెక్టర్ విద్యాధర్ జోషి అన్నారు. అకస్మాత్తుగా ఎండలు పెరిగిపోయి వేడి పెరగడంతో మామిడి పండ్లు త్వరగా పాడైపోతున్నాయన్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ముందుగానే సాధారణం కంటే అధికంగా పెరిగిపోయాయని వెల్లడించారు. -
కాగితపు నీడ !
ఎండలు మండుతున్నాయి.. ఎండ వేడిమికి జీవరాశులన్నీ విలవిల్లాడుతున్నాయి. మొక్కలు సైతం మలమల మాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. అరటి సాగు చేసిన రైతులు మొక్కలను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఒక్కో అరటి మొక్క రూ.12 వెచ్చించి ఎకరాకు 1200 మొక్కలు నాటితే ఎండ తీవ్రతకు కనీసం 50 శాతం మొక్కలు బతకడమూ గగనమైంది. పుట్లూరు మండలంలోని కడవకల్లు, చెర్లోపల్లి, ఓబుళాపురం తదితర గ్రామాల్లో అరటì మొక్కలు సాగు చేసిన వాటిపై ‘వి’ ఆకారంలో పేపర్‌ను మడిచి మొక్కపై ఎండ నేరుగా పడకుండా రక్షణ కల్పిస్తున్నారు. ఇలా పేపర్ల ద్వారా 15 రోజుల పాటు రక్షణ కల్పించి, మొక్కలను బతికించుకుంటే ఎలాంటి నష్టమూ జరగదని రైతులు చెప్తున్నారు. అరటి మొక్కలను కాపాడుకోవడానికి వినియోగిస్తున్న న్యూస్ పేపర్లు కిలో రూ.20 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. - పుట్లూరు (శింగనమల)