సాక్షి, ముంబై : ఈ సారి అల్ఫొన్సో మామిడి పళ్ల సరఫరా 30 నుంచి 60 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయి. ఈ ఏడాది కొంకణ్ రీజియన్‌లో జనవరిలో మామిడి పూత గణనీయంగా రాలిపోయింది. ఈ ప్రభావంతో పంట దిగుబడి తగ్గే అవకాశముందని మామిడి తోటల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అలాగే మార్చి మధ్య కాలం నుంచి పండ్ల సరఫరా కొంతమేర పెరుగుతుందని తెలిపారు. ఎండలు మండుతుండటంతో మామిడి ఉత్పత్తిపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో అల్ఫొన్సో మామిడి ధరలు పెరగడంతో పాటు వినియోగదారుడికి దూరమయ్యే అవకాశం లేకపోలేదు.
మండే ఎండలతో..
గత కొన్ని రోజుల నుంచి మామిడి పూత గణనీయంగా చెట్ల నుంచి రాలిపోతోంది. దీని ప్రభావం మార్చిలో నగరానికి ప్రవేశించే మామిడి పండ్లు, నాణ్యత, పరిమాణంపై పడనుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే రత్నగిరిలో 35 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండలు మండిపోవడంతో మామిడి పండ్లు చిన్న దశలోనే చెట్ల నుంచి కిందకు రాలిపోతున్నాయి. అంతేకాకుండా హ్యుమిడిటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీని వల్ల మామిడి పండ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మామిడి ఉత్పత్తిదారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌కు మామిడి సప్లై తగ్గిందని.. ప్రస్తుతం తాము 4 నుంచి 5 పెట్టెలు మాత్రమే పొందుతున్నామని వ్యాపారులు అంటున్నారు.
కాయలు రాలిపోతున్నాయి
వేడి అధికంగా ఉండటంతో మామిడి కాయలు కూడా చెట్ల నుంచి గణనీయంగా కిందకు రాలుతున్నాయని రత్నగిరిలోని 700 ఎకరాల మామిడి తోట యజమాని మందర్ దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 10 తర్వాత మామిడి పండ్ల సరఫరా మామూలుగానే ఉంటుందన్నారు. పగలు వేడి, రాత్రి చల్లని గాలులతో వాతావరణం విరుద్ధంగా మారడంతో మామిడి కాయలు రాలుతున్నాయన్నారు. మధ్యాహ్న వేళలో వేడి తాపం అధికంగా ఉండటంతో పండు పక్వానికి రాకముందే మగ్గిపోతోందని వివరించారు.
నల్ల మచ్చలతో పాడైపోతున్నాయి
వేడికి మామాడి పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని దేవ్‌గఢ్ తాలూకా మ్యాంగో గ్రోవర్స్ కోఆపరేటివ్ సొసూటీ లిమిటెడ్ డైరెక్టర్ విద్యాధర్ జోషి అన్నారు. అకస్మాత్తుగా ఎండలు పెరిగిపోయి వేడి పెరగడంతో మామిడి పండ్లు త్వరగా పాడైపోతున్నాయన్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ముందుగానే సాధారణం కంటే అధికంగా పెరిగిపోయాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment