
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్‌సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.
ప్రాణం తీసిన పొగమంచు!
బహ్రెయిచ్(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్–బల్‌రామ్‌పూర్ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment