సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు నెలకొన్నాయి. దీంతో క్రమంగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత పడిపోయాయి. ఉష్ణోగ్రతల పతనానికి తో డుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
అంతటా తగ్గుదలే...
రాష్ట్ర మంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. కానీ ప్రస్తుతం సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల వారీగా పరిశీలిస్తే మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇంకో రెండు రోజులు ఇలానే
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment