సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌ను చలి వణికిస్తోంది. రెండు మూడు రోజులుగా నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు పెరుగుతున్న శీతల గాలులతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులను శరీరం స్వీకరించలేకపోతోంది. కాలుష్యానికి శీతల పవనాలు తోడు కావడంతో గొంతు, ముక్కు, చెవి సంబంధిత సమస్యలు పంజా విసురుతున్నాయి. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న కేసుల్లో అత్యధికం ఇలాంటివే కావడం గమనార్హం. మరోవైపు సీజనల్ వ్యాధుల భయం వణికిస్తోంది. చలి తీవ్రత వల్ల స్వైన్‌ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలి కారణంగా కాళ్లు, చేతులు, ముఖం, పెదాలు చిట్లుతున్నాయి. ఇక వెచ్చదనం కోసం జర్కిన్లు, స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మప్లర్లను వినియోగిస్తున్నారు. నగరంలో ఆదివారం కనిష్టంగా 14.9 డిగ్రీలు, గరిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పొంచి ఉన్న స్వైన్‌ఫ్లూ ముప్పు..
గ్రేటర్‌పై స్వైన్‌ఫ్లూ ముప్పేట దాడి చేస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,750కిపైగా కేసులు నమోదు కాగా, వీరిలో 45 మంది మృతిచెందారు. గ్రేటర్ పరిధిలో 800కుపైగా కేసులు నమోదైతే.. 28 మంది మరణించారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ స్వైన్‌ఫ్లూ వైరస్ మరింత బలపడే ప్రమాదం ఉంది. ఇది మరింత మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, పిల్లలు త్వరగా ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉందని, మాస్క్ ధరించడం ద్వారా వైరస్‌బారి నుంచి బయటపడొచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
మద్యం, మాంసంతో సమస్యలు..
వెచ్చదనం కోసం కొందరు రాత్రిపూట మద్యం, మాంసాహారం తీసుకుంటున్నారని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెపుతున్నారు. తీసుకున్న ఆహారం జీర్ణంకాక పొత్తికడుపు ఉబ్బి బిగుతుగా మారుతోందంటున్నారు. ఈ కాలంలో తక్కువ ఆయిల్, మసాలాలతో తయారు చేసిన ఆహారం తీసుకోవాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం(పెరుగన్నం), పండ్ల రసాలు ఉత్తమమని సూచిస్తున్నారు. చలికాలంలో దాహం వేయదు కాబట్టి చాలామంది సరిపడా నీరు తాగడం లేదని, దీంతో శరీరంలో నీటిశాతం తగ్గి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం.. చర్మం వాడిపోవడం జరుగుతుందని చెప్పారు.
సులువుగా జీర్ణమయ్యే ఆహారం మంచిది
సాధ్యమైనంత వరకూ పసిపిల్లలను బయట తిప్పరాదు. కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను వాడాలి. బుగ్గలు కందిపోకుండా మాయిశ్చరైజర్లు రాయాలి. పిల్లలు జలుబు, దగ్గుబారిన పడొచ్చు. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారి తీయొచ్చు. పిల్లలకు సులువుగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.
– డాక్టర్ విజయానంద్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, రెయిన్‌బో ఆస్పత్రి
చర్మం దెబ్బతినకుండా చూడాలి..
చర్మం దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రాత్రి పూట శరీరానికి మాయిశ్చరైజర్లు అప్లయ్ చేయాలి. పెదాలకు లిప్‌గార్డ్ వాడాలి. మంచినీరు సరిపడా తాగాలి. లేదంటే శరీరంలో నీటి శాతం తగ్గి స్కిన్‌గ్లో పోతుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. వీలైనంత వరకు సాయంత్రం తర్వాత బయటికి రాకూడదు.
– డాక్టర్ మన్మోహన్, చర్మ వైద్య నిపుణుడు
నాడీ శోధనతో ఉపశమనం..
ఊపిరి తీసుకోవడం మరీ కష్టంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడీ శోధన’ప్రాక్టీస్ చేయాలి. మంచు కురిసే సమయంలో ఆరుబయట తిరగరాదు. వ్యాయామం చేయరాదు. ఆస్తమా బాధితులు మాస్క్‌లు ధరించాలి. సిమెంట్, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండాలి.
– డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment