
రాష్ట్రాలను వదలని చలి
కోస్తాంధ్రలో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలోనూ గజగజ
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కోస్తాంధ్రలో శీతల ప్రతాపం అధికంగా ఉంది. 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే రికార్డవుతున్నాయి. అక్కడ కొన్నిచోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ విభాగం మంగళవారం నివేదికలో తెలిపింది.
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చలి ప్రభావం బాగా ఉంటుందని వివరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా, విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దిగజారడంతో పాటు మంచు దట్టంగా కురుస్తోంది. లంబసింగిలో ఆదివారం సున్నా డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం 3.5 డిగ్రీలు నమోదైంది.
చలి తీవ్రతకు పది మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: చలి తీవ్రతకు వేర్వేరు జిల్లాల్లో మంగళవారం పది మంది మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లాలో పుసపాటి ఉప్పలయ్య(56) , ముదిగిరి కొమురయ్య(70), గాడిపల్లి కాశీం(80), పాపమ్మ(65)లు చలికి తట్టుకోలేక తనువు చాలించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో కువ్వ బాలన్న(50) మెదక్ జిల్లాకు చెందిన బాలమ్మ (80) చలితీవ్రతకు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్రం భీంరావు(65), ఆత్రం పూసిబాయి(70), ఆత్రం భీంరావు(65)లు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వేర్వేరు సందర్భాల్లో మరణించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నాగులు(80) చలికి తట్టుకోలేక మృతిచెందాడు.