intensity of the cold
-
అమ్మో.. చలి
రెండు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్ / కొండాపురం (నెల్లూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. రెండు రాష్ట్రాలనూ మంచుదుప్పటి కమ్మేస్తోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోతున్నాయి. భారీ ఎత్తున మంచు కురవడం, చలిగాలులు వీస్తుండటంతో ప్రజల పరిస్థితి మంచుగడ్డపై కూర్చున్నట్టుగా మారింది. ముఖ్యంగా గడిచిన నాలుగు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఉదయం 10 గంటల వరకూ ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల స్థాయికి పడిపోయాయి. ఈ నెల 15వ తేదీ వరకు పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తీవ్రమైన చలిగాలుల కారణంగానే ఇక్కడ పరిస్థితి నెలకొందని చెప్పారు. కాగా, గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 10 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం, నల్లగొండల్లో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. చలికి స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నవారు అనుమానంతో ఆసుపత్రులకు పరుగు పెడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం కూడా తగ్గుతుందని అటు వాతావరణశాఖ, ఇటు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీల్లో మరీ ఎక్కువగా... రికార్డుస్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ విషమంగా ఉంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది. ఇక్కడ నీరు గడ్డకట్టే స్థాయిలో చలి తీవ్రత ఉంది. ఇక చింతపల్లిలో మూడు డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద ఐదు డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు గుడి ప్రాంతంలో రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నందిగామ, రెంటచింతలలో 10 డిగ్రీల కనిష్ట ఉషోగ్రత నమోదైంది. అనంతపురంలో 11.9, కర్నూలులో 12.9, ఆరోగ్యవరం, బాపట్లలలో 13, కళింగపట్నంలో 13.6, విజయవాడలో 15, తిరుపతిలో 15.5, కాకినాడలో 16.2, నెల్లూరులో 19.4, విశాఖపట్నంలో 19.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది. రంపచోడవరం, చింతపల్లి, పాడేరు, సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు అలాగే ఉంటోంది. దీంతో రోడ్లు కూడా కనిపించక వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తిరుమలలో చలి ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
చలి తీవ్రతకు ముగ్గురు బలి
సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతకు తట్టుకోలేక వరంగల్ జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో చొగొండి పిచ్చయ్య(70) మృతి చెందాడు. తన నివాసంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు నిద్రించాడు. చలితీవ్రతతో సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మసాగర్ మండలంలోని మల్లికుదుర్లకు చెందిన కారెంపల్లి జనార్దన్ రెడ్డి (68 ) చలితీవ్రతకు తట్టుకోలేక సోమవారం ప్రాణాలు విడిచాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం గాంధీనగర్ గ్రామ ఆవాసం బాషనాయక్ తండాకు చెందిన బాణోత్ బాషనాయక్(97) చలి తీవ్రతకు అనారోగ్యానికి గురై ఆదివారం రాత్రి మృతి చెందాడు. -
చలి చంపేస్తోంది..
తెలంగాణ, ఏపీల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం: చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. దక్షిణ తెలంగాణతో పోల్చితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి గజగజలాడిస్తోంది. విశాఖ మన్యంలో అత్యల్పంగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 27న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఆ శాఖ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి. దీంతో చలి నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్పపీడనం వల్ల ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ తెలిపారు. అల్పపీడనం ప్రభావం ముఖ్యంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమపై కనిపిస్తుందన్నారు. అయినప్పటికీ మేఘాలు ఆవరించడం వల్ల తెలంగాణ, కోస్తాంధ్రల్లో ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు. ఉత్తరాది నుంచి చలిగాలుల ప్రభావం ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవవచ్చని పేర్కొంది. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో సాధారణంకంటే 3 డిగ్రీలు, తెలంగాణలో 4 డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే.. గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో 11, వరంగల్‌లో 14.1, కరీంనగర్ 12.1, నిజామాబాద్‌లో 13.7, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లాల్లో 14.7, ఖమ్మం జిల్లాలో 14.8, నల్లగొండ జిల్లాలో 15.4, మహబూబ్‌నగర్ జిల్లాలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖ ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం వద్ద బుధవారం 3 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 0 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు చలిని తట్టుకోలేక సాయంత్రానికే మైదాన ప్రాంతాలకు పయనమవుతున్నారు. కాగా, వచ్చే 24 గంటల్లో హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 13 డి గ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. -
రాష్ట్రాలను వదలని చలి
కోస్తాంధ్రలో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలోనూ గజగజ సాక్షి, విశాఖపట్నం/పాడేరు: చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కోస్తాంధ్రలో శీతల ప్రతాపం అధికంగా ఉంది. 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే రికార్డవుతున్నాయి. అక్కడ కొన్నిచోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ విభాగం మంగళవారం నివేదికలో తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చలి ప్రభావం బాగా ఉంటుందని వివరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా, విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దిగజారడంతో పాటు మంచు దట్టంగా కురుస్తోంది. లంబసింగిలో ఆదివారం సున్నా డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం 3.5 డిగ్రీలు నమోదైంది. చలి తీవ్రతకు పది మంది మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతకు వేర్వేరు జిల్లాల్లో మంగళవారం పది మంది మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లాలో పుసపాటి ఉప్పలయ్య(56) , ముదిగిరి కొమురయ్య(70), గాడిపల్లి కాశీం(80), పాపమ్మ(65)లు చలికి తట్టుకోలేక తనువు చాలించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో కువ్వ బాలన్న(50) మెదక్ జిల్లాకు చెందిన బాలమ్మ (80) చలితీవ్రతకు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్రం భీంరావు(65), ఆత్రం పూసిబాయి(70), ఆత్రం భీంరావు(65)లు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వేర్వేరు సందర్భాల్లో మరణించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నాగులు(80) చలికి తట్టుకోలేక మృతిచెందాడు.