
శ్రీనగర్‌లో గడ్డకట్టిన దాల్ సరస్సు పైభాగం
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా చలిగాలుల ఉధృతితో వణికిపోతున్న ఉత్తర భారతానికి ఇంకో రెండ్రోజులపాటు ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం శుక్రవారం తెలిపింది. తూర్పు, మధ్యభారతదేశ ప్రాంతాల్లో నూ చలితీవ్రత పెరగనుందని తెలిపింది. వాయవ్య దిక్కు నుంచి వస్తున్న శీతల పవనాలు కొనసాగుతున్న కారణంగా పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ ఉత్తర ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌లలో రానున్న రెండు రోజులు చలి లేదా అతిశీతల పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ తెలిపింది.
కొత్త సంవత్సరం తొలిరోజు, అంతకుముందు రోజుల్లో దేశ వాయువ్య, మధ్య ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశముంది. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు –5.6 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ విభాగం తెలిపింది. కశ్మీర్, లడాఖ్‌ల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి వెళ్లాయి. కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని గుల్మార్గ్‌లో ఉష్ణోగ్రతలు – 9.5 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోగా, పహల్గామ్ రిసార్ట్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు – 12.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.