![కాశ్మీర విలయం మానవ తప్పిదమే..](/styles/webp/s3/article_images/2017/09/2/81411064821_625x300.jpg.webp?itok=q8J3Lofl)
కాశ్మీర విలయం మానవ తప్పిదమే..
కాశ్మీర్‌లో అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కారణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండాపోయాయి.
కాశ్మీర్ అనగానే జివ్వుమనిపించే హిమ పాతాలు, దాల్ సరస్సు అందాలు స్ఫురణకు రావడం సహజం. అందులోనూ శ్రీనగర్ అంటే సుంద రమైన వనాలకు, పూలతోటలకు ప్రసిద్ధి. అయితే అదంతా గతం. ఇపుడు శ్రీనగర్ వరదనీటిలో మునకలేస్తున్నది. నయనమనోహరమైన పూదోట లన్నీ నడుం లోతులో మునిగి ఉన్నాయి. వీధు లను వరద ముంచెత్తింది. వందేళ్లలో కనీవిని ఎరుగని జలవిపత్తు కాశ్మీర్‌ను కకావికలం చేసింది. వందల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో నిర్వాసితుల య్యారు. ఎన్నడూ లేనిది ఈ జల విలయా నికి కారణమేమిటి? ప్రశాంత కాశ్మీరంలో ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులు?
జమ్మూ కాశ్మీర్‌లో వరదలు ప్రకృతి వైపరీ త్యమేనా... అంటే.. కానేకాదు ఇది మానవ తప్పిద ఫలితమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కార ణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండా పోయాయి. శ్రీనగర్‌లో ఒకప్పుడు 2400 హెక్టార్లలో విస్తరించి ఉన్న దాల్ సరస్సు ఇపుడు 1200 హెక్టార్లకు పరిమితమైపో యింది. శ్రీనగర్‌కు ఎగువన 20,200 హెక్టా ర్లలో విస్తరించి ఉండే ఉలార్ సరస్సు 2,400 హెక్టార్లకు కుంచించుకుపోయింది.
కాశ్మీర్‌లోయలో జీలం నది ఉరవడిని తట్టుకోవడానికి సరస్సుల దాపులనుండే చిత్తడినేలలు ఎంతగానో ఉపకరి స్తాయి. అయితే కాశ్మీర్‌లో గత 30 ఏళ్లలో 50 శాతం చిత్తడి నేలలు అంతరించిపోయాయి. సరస్సుల సమీపంలో ఉండే విశాలమైన చిత్తడినేలలన్నీ కుంచించుకుపోయాయి. ఉలార్ సరస్సునే తీసుకుంటే.. ఈ సరస్సు సమీపంలోని నేలలను కాశ్మీరీ మహరాజాలు, చివరకు బ్రిటిష్‌వారు సైతం ఎంతో జాగ్రత్తగా పరిరక్షిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇవి వరద నీటిని స్పాంజిలాగా పీల్చుకుంటాయి. అయితే అనేక సంవత్సరాలుగా ఇవి ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య కార్యకలాపాలకు ఆలవాలంగా మారిపోయాయి.
జీలం నది పొడవునా అనేకచోట్ల ఆక్రమణలు జరిగాయి. వెడల్పు తగ్గడంతో నది ఉరవడి పెరిగింది. దీంతో పాటు శ్రీనగర్‌లోని దిగువ ప్రాంతాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. వరదనీటి విడుదలకు ఉపకరించే చిన్నచిన్న కాల్వలు చాలావరకు పూడిపోయాయి. జీలం వరదల నుంచి శ్రీనగర్‌ను రక్షించేందుకు గాను శతాబ్దం కిందట దోగ్రా పాలకుడు ప్రతాప్ సింగ్ నిర్మించిన జీలంబండ్ కూడా ఆక్రమణలపాలయ్యింది.వాస్తవానికి జీలం పరివాహకప్రాంతాలకు ముఖ్యంగా శ్రీనగర్‌కు వరద ప్రమాదం పొంచి ఉందని అనేకమార్లు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయితే ప్రభుత్వం ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. అసలు జమ్ము కాశ్మీర్‌కు వరదల గురించి హెచ్చరించే వ్యవస్థ ఏదీలేదు. జీలం నది శ్రీన గర్‌ను చేరుకోవడానికి ముందు దక్షిణ కాశ్మీర్‌లో ఆరు రోజుల పాటు ప్రవహిస్తుంది. అనంతనాగ్ సమీపంలో సంగం వద్ద నీటిమట్టం పెరగడం కూడా స్పష్టమైన సూచికలా పనిచేస్తుంది. ఎగువ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురు స్తున్నా, దక్షిణ కాశ్మీర్‌లో జీలం నది ఉరవడి పెరు గుతున్నా అధికార యంత్రాంగం, ఒమర్ ప్రభు త్వం అప్రమత్తం కాలేదు. వారి మొద్దు నిద్ర శ్రీన గర్‌కు ప్రాణాంతకంగా పరిణమించింది.
జమ్ము కాశ్మీర్‌కు తీవ్ర వరద ముప్పు పొంచి ఉన్నదని 2010లో వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. తగిన మౌలిక సదుపాయాల కల్పనకు, వరద నివారణ చర్యలకుగాను 22,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుకు అప్పటి రాష్ర్ట ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఆ తర్వా త వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించేశాయి. దీంతో పాటు అభివృద్ధి పేరుతో జరిగిన అనేక కార్యక్రమాలు కాశ్మీర్ నీటిపారుదల వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టాయి. కాశ్మీర్ లోయలో నిర్మించిన కొత్త రైల్వే లైన్లు, హైవేలు నగరాన్ని లోతట్టు ప్రాంతంగా మార్చివేశాయి. కొత్తగా ఏర్పాటయిన నాలుగులైన్ల హైవే ప్రాజెక్టు శ్రీనగర్ మురుగునీటిపారుదల వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇవన్నీ జలవిలయాన్ని సృష్టించాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు మేల్కో వాలని, కాశ్మీర్‌లో చిత్తడినేలల పరిరక్షణకూ అడవుల పరిరక్షణ చట్టం -1980 వంటి పటిష్టమైన చట్టం ఉండాలని పర్యావరణ వేత్తలంటున్నారు. అయితే చట్టాలు చేయడం తోనే సరిపోదు. ప్రకృతిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయం కూడా అవసరమే. అది లేనపుడు మనకు వైపరీత్యాల నుంచి రక్షణ లేనట్లే. అందుకు కాశ్మీర్ జలవిలయమే ప్రత్యక్ష ఉదాహరణ.
పోతుకూరు శ్రీనివాసరావు