శ్రీనగర్. తోటల నగరం. నిషాత్ బాగ్, షాలిమార్ గార్డెన్స్, చషే్మషాహీ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వంటి అత్యంత అందమైన పూదోటలకు, ప్రఖ్యాత దాల్ సరస్సుకు నిలయం. జమ్మూ కశీ్మర్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒకటైన శ్రీనగర్‌లో సోమవారం పోలింగ్ జరగనుంది. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది....
శ్రీనగర్‌లో ముక్కోణపు పోరు
అబ్దుల్లాలదే ఆధిపత్యం జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలుండేవి. జమ్మూ కశీ్మర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక ఐదు జమ్మూ కశీ్మర్ పరిధిలోకి, ఒకటి లద్దాఖ్ కిందకు వెళ్లాయి. శ్రీనగర్‌లో విజయం నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశీ్మర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) మధ్యే చేతులు మారుతుంటుంది. 2017 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఎన్‌సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు.
అంతకుముందు 2014లో ఆయనపై పీడీపీ నేత తారిక్ హమీద్ కర్రా నెగ్గారు. 2009లో ఫరూక్ అబ్దుల్లా, 2004లో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈసారి ఎన్‌సీ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహెదీ, పీడీపీ నుంచి వహీదుర్ రెహమాన్ పర్రా, జమ్మూ కశ్మీర్ ఆప్నీ పార్టీ నేత మహమ్మద్ అష్రఫ్ మిర్ బరిలో ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ, లోక్‌తాంత్రిక్ పారీ్టతో పాటు 18 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో ఆది నుంచీ ఎన్‌సీదే ఆధిపత్యం. 13సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పారీ్టయే విజయం సాధించింది.
ఓటర్లలో నిరుత్సాహం...
శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో 25.5 శాతం, 2014లో 25.86 శాతం పోలింగే నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో మరీ 14.43 శాతానికి పడిపోయింది! ఈసారి కూడా శ్రీనగర్ వాసుల్లో ఓటింగ్ పట్ల నిరుత్సాహమే కనిపిస్తోంది.
వలసదారులకు ఉన్నచోటే ఓటు!
జమ్మూ కశీ్మర్లోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ స్థానాల పరిధిలో 1.13 లక్షల కశీ్మరీ వలసదారులు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 52,100 మంది శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటేయనున్నారు. వీరి కోసం జమ్మూలో 21, ఢిల్లీలో 4, ఉధంపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అంతేగాక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment