సాక్షి, విశాఖపట్నం: మధ్య భారతదేశం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతుంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం పదిగంటలకు కూడా పొగమంచు వీడలేదు. ఉపరితలంపై ఏర్పడిన అధికపీడనంతో పాటు ఈశాన్యగాలులు తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరోవైపు సముద్రతీరం నుంచి వీస్తున్న వెచ్చటి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 4.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో 4.4,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: బైబై.. డీలక్స్ బస్సుకు సెలవు!
ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల వరకు, విశాఖ ఏజెన్సీలో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో వీస్తున్న గాలుల ప్రభావంతో విశాఖలో చలి పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. క్రమంగా కోస్తాతీర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది క్రమంగా బలహీనపడుతూ బంగాళాఖాతం వైపు చేరుకుంటుందని, క్రమంగా శ్రీలంక తీరం వైపు కదలనుందని తెలిపారు. దీని కారణంగా ఈ నెలాఖరులో దక్షిణకోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మినుములూరులో 7, అరకులోయలో 10.4, నందిగామలో 12.2, విశాఖలో 13.8, కళింగపట్నం, అమరావతిలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: తెలంగాణ గజగజ
Comments
Please login to add a commentAdd a comment