
విజృంభిస్తున్న చలిగాలులు
చలిగాలులు విజృంభిస్తున్నాయి.
రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో సాధారణం కంటే 3-5 డిగ్రీల తగ్గుముఖం
కోస్తాలో 1-3 డిగ్రీలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: చలిగాలులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలితీవ్రత పెరుగుతోంది. తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉత్తర తెలంగాణలో చలిగాలుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కోస్తా ఆంధ్రాలో సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాంధ్రలో చలిగాలులు తీవ్రతరమవుతున్నాయి. రాయలసీమలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉత్తర, వాయువ్యదిశగా గాలులు వీస్తుండడంతో విదర్భ, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. అక్కడ నుంచి వచ్చే గాలులు నేరుగా తాకుకుండడంతో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలులు ఎక్కువయ్యాయి.
ఒకవైపు ఉత్తరగాలులు వీస్తుండడం, మరోపక్క మేఘాలు తేలిపోవడంతో ఉత్తరాంధ్రలో చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. వాల్తేరు తుపాను హెచ్చరికల కేంద్రంలో ఈరోజు గరిష్ఠంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒక డిగ్రీ తగ్గింది. రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. చలితీవ్రత రోజురోజుకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం పూట మంచుకురుస్తోంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. హుద్‌హుద్ దెబ్బకు విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో చెట్లన్నీ నేలకూలడంతో ఈ ప్రాంతంలో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు. గతంలో కొండ ప్రాంతాల్లో మాత్రమే చలితీవ్రత ఎక్కువగా ఉండేది. విశాఖ నగరంలో ఆ స్థాయిలో చలిగాలులు ఉండేవి కాదు.
ఆదిలాబాద్ మరో లంబసింగి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చలిపంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుతున్నాయి. గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 4.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు గడిచినా చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి.