
చికాగో: ఓ మగ్గులో మరిగే నీటిని తీసుకొని పైకి విసిరితే ఏమవుతుంది? మనపైనే పడి.. ఒళ్లంతా కాలుతుంది! అయితే ఓ వ్యక్తి తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో మాత్రం మరుగుతున్న నీరు.. అలా ఆకాశంలోకి విసరగానే మంచులా మారి, మాయమైపోతోంది. క్షణాల్లో జరుగుతున్న ఈ అద్భుతాన్ని నెటిజన్లు చూసి అవాక్కవుతున్నారు. అయితే అతడేమీ మ్యాజిక్ చేయడంలేదు. అంతా ప్రకృతి వింతే.
అసలు విషయమేంటంటే.. పోలార్ వోర్టెక్స్ ప్రభావంతో అమెరికాలోని పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో విలవిల్లాడుతున్నాయి. చివరికి ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతాల్లో ఒకటైన నయాగారా సైతం గడ్డకట్టేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే భయాందోళనలకు గురిచేస్తున్న ఈ చలి కొందరికి వినోదాన్ని సైతం పంచుతోంది. కొందరు మంచుతో రకరకలా ప్రయోగాలు చేసేస్తున్నారు. చిత్ర విచిత్ర ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ‘చలి కారణంగా రాజకీయ నేతలు తమ జేబులోనే చేతులు పెట్టుకొని ఉండటం చూస్తున్నాం..’ అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment