గజగజ | The drop in temperature | Sakshi
Sakshi News home page

గజగజ

Published Mon, Dec 22 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

గజగజ

గజగజ

వణికిస్తున్న చలి పులి
8 పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
8 నగరంలో శనివారం 15 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
8 మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి!
 

విజయవాడ : జిల్లాను చలి పులి వణికిస్తోంది. నాలుగైదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో జిల్లా ప్రజలు చలికి తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా చలిగాలులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే  ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచే చలిగాలుల తీవ్రత జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికమవుతోంది. ఉదయం తొమ్మిది గంటలకు కూడా చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పొగమంచు అధికంగా ఆవరిస్తుండటంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో చలికి జిల్లా వాసులు వణికిపోతున్నారు. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి.

మచిలీపట్నంలో పగటి ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, రాత్రివేళ 17 డిగ్రీలు, గుడివాడలో పగలు 29, రాత్రి 18, నందిగామలో పగలు 28, రాత్రి 17, నూజివీడులో పగలు 28, రాత్రి 17, తిరువూరులో పగలు 27, రాత్రి 17 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

వ్యవసాయ పనులకు ఆటంకం... : జిల్లాలో చలిగాలుల తీవ్రత పెరగటంతో సాధారణ జీవనానికి కొంతమేర ఆటంకం ఏర్పడుతోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అధికంగా మంచు కురుస్తుండటంతో ఉదయం 10 గంటలకు వరకు పనులు ప్రారంభించేందుకు సాధ్యం కావడం లేదు. యంత్రాల ద్వారా వరికోతలు కోసిన ప్రాంతాల్లో ధాన్యం ఆరబోతకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా వరి పొలాల్లో కట్టివేత పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు చలి నుంచి కాపాడుకునేందుకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. నగరంతోపాటు గ్రామాల్లోనూ ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లను ధరించి బయటకు వస్తున్నారు. రగ్గులు, ఉన్ని దుస్తుల కొనుగోళ్లు నాలుగైదు రోజులుగా ఊపందుకున్నాయి. పొగమంచు కారణంగా దారి సక్రమంగా కనపడక ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. డిసెంబరులోనే పరిస్థితి ఇలా ఉంటే జనవరిలో మరింత ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement