లంబసింగిలో ఉదయం 11 గంటల సమయంలో లైట్లు వేసుకొని వెళుతున్న వాహనం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం మరో కశ్మీరాన్ని తలపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా సున్నా (0) డిగ్రీకి చేరుకుంది. ఆదివారం రాత్రి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ‘0’ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ పక్కనే ఉన్న చింతపల్లిలో 1.5 డిగ్రీలు నమోదైంది. ఏజెన్సీలోని దల్లాపల్లి, మోదపల్లిల్లో 3, పాడేరులో 4 డిగ్రీల చొప్పున కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5–10 డిగ్రీలకు పడిపోయి ఏజెన్సీ వాసులను గజగజ వణికిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏజెన్సీలో సాయంత్రం నుంచి మంచు తేలికపాటి వర్షంలా కురుస్తోంది. తెల్లారేసరికి వాహనాలు, ఇళ్ల పైకప్పులపై గడ్డకట్టిన మంచు కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే ఎముకలు కొరికే చలి మొదలవుతోంది. ఉదయం 10 గంటలకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. దీంతో అక్కడ వారు కశ్మీరంలోని మంచుకొండల్లో గడపుతున్న అనుభూతిని పొందుతున్నారు.
విశాఖ రికార్డు!
మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతల్లో విశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. యాభై ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం రాత్రి 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 6 డిగ్రీలు తక్కువ కావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోనూ 12 డిగ్రీలు నమోదయింది. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లోకెల్లా గుంటూరు జిల్లా రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణంకంటే 4–6 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వణికిస్తున్నాయి.
మరో రెండ్రోజులు అతిశీతల గాలులు..
రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య భారతదేశంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3–5 డిగ్రీలు నమోదవడం వల్ల అక్కడ శీతల ప్రభావం ఎక్కువ ఉంటోంది. అటు నుంచి దక్షిణం వైపునకు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇదే కోస్తాంధ్రలో చలి వణికించడానికి కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) కొనసాగి చలి తీవ్రతను పెంచుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని మారుమూల జీనబాడు పంచాయతీ వలసలగురువు గ్రామానికి చెందిన తామర్ల రామన్న(70) అనే వృద్ధుడు సోమవారం తెల్లవారుజామున చలితీవ్రతకు తాళలేక మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
5న అల్పపీడనం..
జనవరి 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అండమాన్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అటువైపు చేపల వేటకు వెళ్లవద్దని సోమవారం రాత్రి నివేదికలో ఐఎండీ తెలిపింది.
ఆదిలాబాద్ @ 3 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భీంపూర్ మండలం అర్లి, బేలా ప్రాంతాల్లో ఏకంగా మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం జిన్నెదారి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment