visakha manyam
-
Photo Feature: అందాలలో అహో మహోదయం
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాదల పంచాయతీలోని దోమలజోరు, రత్తకండి, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం సుంకి, పరిసర ప్రాంతాలు ఆకుపచ్చగా మారి ముచ్చటగొల్పుతున్నాయి. శీతాకాలం తలపించేలా ఉదయం వేళ మంచు సోయగాలు మరింతగా ఆహ్లాదపరుస్తున్నాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మనోహర లోకంలో విహరిస్తున్నారు. –అరకులోయ రూరల్ అరకులోయలో మంచు సోయగాలు మాదల పంచాయతీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి అందాలు -
మలేరియా కట్టడి చర్యలు భేష్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): మలేరియా పేరు చెబితేనే విశాఖ మన్యం గడగడలాడేది. వ్యాధులు సీజన్ ప్రారంభమైతే ఏజెన్సీలో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగంలో అలజడి రేపేది. అలాంటి మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫాలివ్వడంతో వ్యాధి తీవ్రతతోపాటు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య 56 శాతం తగ్గాయి. ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియాను అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలిసారిగా 2008లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారని జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. దీనికి సంబంధించి ఆమె అందించిన వివరాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి మలేరియా కేసులు నమోదు పూర్తిగా తగ్గి పోవాలని సంకల్పించింది. దీనిలో భాగంగా 2020 నుంచి 2024 వరకూ ఏడాదికి ఒక థీమ్‌తో చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది మలేరియా భారాన్ని తగ్గించడం, జీవితాలను రక్షించడం అనే థీమ్‌తో చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 2030 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యం. గణనీయంగా తగ్గిన కేసులు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండేళ్లుగా మలేరియా కేసులతోపాటు, మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసులు నమోదు 56 శాతానికి తగ్గింది. 2021 లో 239 కేసులు నమోదుకాగా, 2022 లో ఇప్పటి వరకూ 105 కేసులు నమోదయ్యాయి. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
బుల్లి బుల్లి దీవులు.. కేరళను మించి సోయగాలు
సాక్షి, విశాఖపట్నం: కొండ కోనల నడుమ మన్యం అందాలు ఒకవైపు.. యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక కేంద్రాల సోయగాలు మరోవైపు. ఆ అందాలకు మరింత వన్నెలద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. విశాఖ మన్యంలో కేరళ తరహాలో బ్యాక్ వాటర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మనోహరమైన సుజనకోట ప్రాంతంలోని చిన్న చిన్న దీవుల్లో కేరళను మించిన అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. సుజనకోట.. ప్రకృతి మేట బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంగా ముంచంగిపుట్టు మండలం సుజనకోటను గుర్తించారు. సుజనకోటలోని మత్స్యగెడ్డ వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. జి.మాడుగులలో ప్రారంభమై.. హుకుంపేట, పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు వద్ద జోలపుట్టు డ్యామ్‌లో కలుస్తుంది. ఒకవైపు పచ్చని దీవులు, మరోవైపు ఆకర్షణీయమైన సుందర ప్రదేశాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా సుజనకోట పంచాయతీలో మత్స్యగెడ్డ అందాలు కేరళను తలపిస్తుంటాయి. మెలికలు తిరుగుతూ ఎత్తయిన గిరుల మధ్య నుంచి మత్స్యగెడ్డ పాయలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ అందాలను చూసేందుకు నిత్యం వందలాదిగా పర్యాటకులు వస్తుంటారు. బ్యాక్ వాటర్ బోటింగ్.. ఫ్లోటింగ్ రెస్టారెంట్ కేరళ పర్యాటకానికి పేరు తెచ్చింది బ్యాక్ వాటర్స్ అని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే అనుభూతిని సుజనకోటలో పొందవచ్చు. మత్స్యగెడ్డ బ్యాక్‌వాటర్‌ను అభివృద్ధి చేస్తే.. కేరళ వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా అంతర్జాతీయ పర్యాటకుల్ని సైతం ఆకర్షిస్తుంది. బ్యాక్ వాటర్‌లో సేదతీరేలా బోటింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.2.50 కోట్లతో సుజనకోట అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశారు. బ్యాక్‌వాటర్ అందాలను తిలకించిన తర్వాత.. దేశ, విదేశీ టూరిస్టుల అభిరుచికి అనుగుణంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. రెండు మూడు రోజులు ఇక్కడ ప్రకృతి ప్రేమికులు విహరించేందుకు వీలుగా కాటేజీలు నిర్మించనున్నారు. అడ్వెంచర్ టూరిజానికీ.. బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ ప్లాన్ సిద్ధం చేసింది. బోటింగ్‌తో పాటు జిప్‌లైనర్ ద్వారా బ్యాక్ వాటర్ నుంచి కొండల వైపునకు వెళ్లేలా సాహస విన్యాసాలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆమోదం తెలిపిన సీఎం జగన్ కేరళకు బ్యాక్ వాటర్స్ టూరిజం ఎంత పేరు సంపాదించి పెట్టిందో.. అదే మాదిరిగా విశాఖ మన్యం అందాలకు సుజనకోట కూడా అంతే పేరు తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే ప్రకృతి కేరళ కంటే వైభవంగా ఆకట్టుకుంటుంది. పర్యాటకులు రాత్రిపూట బ్యాక్ వాటర్‌లో సేదతీరేలా ప్రాజెక్టు రూపొందిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. అరకు వచ్చే పర్యాటకులు సుజనకోట చేరుకునేందుకు రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్డు మార్గం కూడా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం కలిసొస్తుందని భావిస్తున్నాం. పర్యాటక మన్యహారంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
ఆహా! ఏమి రుచి, తినరా మై మరచి!
సాక్షి, జి.మాడుగుల (పాడేరు): విశాఖ మన్యంలో లభిస్తున్న బొడ్డెంగులంటే గిరిజనులకు ఎంతో ప్రీతి. గిరిజన ప్రాంతాల్లో విరివిగా లభించే బొడ్డెంగులు ఎంతో రుచికరమైన మాంసాహారంగా భావించి ఇక్కడ ప్రజలు లొట్టలేసుకుని తింటారు. బొడ్డెంగులకు ఈ గిరిజన ప్రాంతాల్లో ఎంతో డిమాండ్ ఉంది. బొడ్డెంగులు నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ లభిస్తాయి. గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులు ఉన్న చోట బొడ్డెంగులను గుర్తించి వాటి మొదలు వద్ద తవ్వి సేకరిస్తారు. ప్రతి ఒక్కరు వీటిని సంవత్సరానికి ఒక సారైనా తినకకుండా ఉండరు. ఇవి బయటకు తెల్ల పురుగులు మాదిరిగానే కన్పిస్తాయి. బొడ్డంగుల శరీరమంతా పూర్తిగా కొవ్వు పదార్థం. ఈ ప్రాంతంలో బొడ్డెంగులను మైదాన ప్రాంత రొయ్యలుగా పిలుస్తారు. ఈత దుబ్బుల నుంచి సేకరించిన బొడ్డెంగులను వేపుడు, కూరలుగా తయారు చేసుకొని భోజనం చేస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. బొడ్డెంగులతో కవాబులు (చీకులు) రక్తపుష్టి ఇస్తాయి రక్తహీనత ఉన్నవారు బొడ్డెంగులను వేపుడు, కూరగా తయారు చేసుకుని తింటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని, పౌష్టికాహారమవుతుందని వారు అంటున్నారు. గిరిజనులు ఎక్కువగా భోజనాలు, జీలుగ కల్లు, మద్యం తాగేవారు నంజకం (స్టఫ్)గా, ఇళ్లకు బంధువులు వచ్చినప్పుడు బొడ్డెంగులుతో విందులు ఏర్పాటు చేస్తారు. -
పల్లెపై పచ్చని సంతకం..
కొండల్లో సంక్షేమ గీతం పలకాలి..కోనల్లో సేవా దీపం వెలగాలి!కొండ గాలి కొత్త పాట పాడుతోంది. ముళ్లదారుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పక్కా డ్రైనేజీ పనులు పరుగులెత్తుతున్నాయి.. గిరిజన హృదయాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పల్లె గుండె చప్పుడు విందాం.. విశాఖ జిల్లా మినుములూరు వెళ్దాం రండి... విశాఖ మన్యం (మినుములూరు) దట్టమైన అడవి. ఆకాశాన్ని తాకే కొండలు. పాతాళాన్ని తలపించే లోయలు... దారీతెన్నూ లేదు. అయినా నడవాలి. గుట్టలు.. మెట్టలు దాటాలి. గమ్యం సుదూరం. ఆత్మ విశ్వాసమే ఆయుధం. ఇది మినుములూరు గ్రామ సచివాలయ సైన్యం. పెన్షన్ల పంపిణీ, ఆదిమ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రయాణం. అయిదు కొండలు ఎక్కి దిగితే... రాళ్లు, ముళ్ల దారిలో 20 కిలోమీటర్లు నడిస్తే.. చింతగున్నల, మాదిగబంద గూడేలు కనిపిస్తాయి. జనాభా 500 మంది. కొండల నడుమ కనీస సౌకర్యాలకు బహు దూరంగా ఎక్కడో విసిరేసినట్లు ఉండే ఈ గిరిజన గూడేలకు ప్రభుత్వం తరుçఫున అధికారులు, సిబ్బంది ఇంతకు ముందు ఎపుడూ వెళ్లిన దాఖలాలు లేవు. ఇపుడు మినుములూరు సచివాలయ సిబ్బంది వెళ్లి స్ధానికుల బాగోగులు తెలుసుకోవడం ఓ సంచలనం. మన్యంలో పెద్ద చర్చనీయాంశం. (ఎస్. ఎం. కొండబాబు– పాడేరు) ► మన్యం సముద్ర మట్టానికి 2,700 అడుగుల ఎత్తులో ఉండే ప్రాంతం. మిరియాల సాగుతో మలుపులు తిరిగిన ఘాటీ రోడ్డు ఘాటుగా ఉంటుంది. కొండ గాలికి వీచే కాఫీ పరిమళం సాంత్వన చేకూరుస్తుంది. పచ్చని అడవిలో లేళ్లు, దూకే సెలయేళ్లు ప్రకృతి అందాలు అబ్బురపరుస్తాయి. మరో పక్క విద్యా, ఆరోగ్య సౌకర్యాల కొరత పట్టిపీడిస్తాయి. ఏ చిన్న రోగమొచ్చినా, నిండు గర్భిణీ అయినా డోలీ మోత తప్పదు. చిన్న అర్జీ కోసం మండల కేంద్రానికి రావడానికి నరకయాతన పడాల్సిందే. ఇపుడు గ్రామ సచివాలయ వ్యవస్ధ గిరిజన సమస్యలకు పరిష్కారం వెతుకుతోంది. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. గిరిజనులకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామంటూ వలంటీర్ల దళం ముందుకు వస్తోంది. కొండ దారుల్లో మారుమూల గూడేలకు వెళుతున్న సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ► విశాఖ ఏజెన్సీలోని 244 పంచాయతీల గిరిజనులకు గ్రామ సచివాలయ వ్యవస్థ నేడు ఒక వరం. ఒకప్పుడు ఏ సమస్య ఉన్న గంటల తరబడి మారుమూల గూడేల నుంచి మండల కేంద్రానికి చేరుకుని వేరు వేరు శాఖల అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాల్సి వచ్చేది. రేషన్‌కార్డు కావాలన్నా, ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా అన్నిశాఖల అధికారులను కలవడం కష్టమయ్యేది. ఇపుడు గ్రామ సచివాలయాలలో ముఖ్యమైన అన్ని శాఖల ఉద్యోగులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి ఉద్యోగులంతా స్థానిక గిరిజనులే కావడంతో గిరిజనులకు మరింత మేలు కలుగుతోంది. ► పాడేరు మండలం మినుములూరు సచివాలయం... ఏజెన్సీ 11 మండలాలలోకెల్లా ఉత్తమ సచివాలయంగా ప్రభుత్వ మన్ననలు పొందింది. దీని పరిధిలో 28 గూడేలున్నాయి. ఫలితాలు ఇవిగో...... ► మినుములూరు పరిసర గూడేల్లో తాగునీటి పథకాలు నిరుపయోగంగా ఉండేవి. వాటన్నింటిని సచివాలయ ఉద్యోగులు వినియోగంలోకి తెచ్చి గిరిజనులకు సురక్షిత తాగునీరు అందించారు. మారుమూల సల్దిగెడ్డ గూడేనికి రోడ్డు సౌకర్యం లేక జనం నరకయాతన పడేవారు. ప్రస్తుతం సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. 30 ఏళ్ల నుంచి పరిష్కారం కాని ఈ రోడ్డు సమస్య సచివాలయ వ్యవస్థ ద్వారా తీరింది. పూర్వం నుంచి పక్కా రోడ్డు సౌకర్యానికి నోచుకోని మారుమూల చింతగున్నల, మాదిగబంద గూడేలకు బంగారుమెట్ట జంక్షన్ నుంచి రూ.4కోట్ల వ్యయంతో పక్కా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ రోడ్డు ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు మంజూరు అయ్యింది. మరో నెల రోజుల్లో పక్కా రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ► 28 గూడేల్లోనూ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు ఇంటింటా సర్వే నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు పొందలేని వారికి సచివాలయం ద్వారా న్యాయం చేశారు.అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను వలంటీర్లే తీసుకుని వెళ్లి గిరిజనులకు పంపిణీ చేశారు. ప్రతి నెల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లను వలంటీర్లు పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులకు పంచాయతీ కేంద్రానికి కాలినడకన వచ్చే పరిస్థితి తప్పింది. రూ. 25 వేలు అందుకున్నాం.. నా భార్య శాంతికి ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా రూ.15వేలు జమ చేసింది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాను. నాది టైలరింగ్ వృత్తి. ప్రభుత్వం నుంచి రూ.10వేల ఆర్ధికసాయం అందింది. రెండు పథకాల ద్వారా ఏడాదికి రూ.25వేల నగదును పొందుతున్నాం. -కొర్రా నూకరాజు, టైలర్ దరఖాస్తు చేసుకున్న వెంటనే పింఛను నాకు 53 సంవత్సరాలు. ఎస్టీలకు 50 ఏళ్లు నిండితే పింఛను సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. నేను దరఖాస్తు చేసుకున్న వెంటనే పింఛను సౌకర్యాన్ని పొందాను. ఆ సొమ్ముతో ఆర్ధిక భరోసా ఏర్పడింది. -మాసాడ దేవయ్య, గిరిజన రైతు, రోడ్డు వేసినందుకు సంతోషంగా ఉంది నా చిన్నతనం నుంచి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలినడకన అనేక ఇబ్బందులు పడేవారం. శివారున ఉన్న గూడెం కావడంతో గత పాలకులు రోడ్డు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. మినుములూరు గ్రామ సచివాలయంలో రోడ్డు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే యంత్రాంగం సకాలంలో స్పందించింది. డల్లాపల్లి రోడ్డు నుంచి మా గూడెం వరకు రెండు కిలోమీటర్ల సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -పాంగి బొంజుబాబు, స్థానికుడు -
అందంలో.. మకరందం
వలిసె పూలు.. పసుపు పచ్చగా కనుచూపు మేర పరచినట్లుండే ప్రకృతి పరిచిన ఈ పూదోటల్ని చూసేందుకు విశాఖ మన్యానికి శీతాకాలం పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఏ యూరోప్‌లోనో ఉన్నట్లు అనిపించేలా మన మనసు దోచే ఈ పూలు పిల్లగాలులకు అటూ ఇటూ ఊగుతూ స్వాగతం పలుకుతుంటాయి. ఈ వలిసె పూలు తమ అందంతోనే కాదు మకరందంతోను పర్యాటకుల జిహ్వను వహ్వా అనిపిస్తున్నాయి. అర విరిసిన ఈ పూల మకరందాన్ని జుర్రుకుని తేనెటీగలు అందించే తేనెకు విశాఖ మన్యంలో పర్యాటకుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఔషధ గుణాలతో పాటు మంచి సువాసన, రుచి ఉండడంతో వలిసె సాగు లాభదాయకంగా మారింది. – సాక్షి, విశాఖపట్నం ఇథియోపియా నుంచి విశాఖ మన్యానికి చూసేందుకు అవి పొద్దుతిరుగుడు పూలుగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి వందల ఏళ్ల క్రితం ఇవి విశాఖ మన్యంలోకి ప్రవేశించాయి. ఇక్కడి అనుకూల వాతావరణంతో కొన్నేళ్ల క్రితం వరకూ ఎక్కడ చూసినా వీటి అందాలే కనువిందు చేశాయి. అరుకువ్యాలీ, పాడేరు ప్రాంతాల్లోనే 20 వేల ఎకరాల్లో ఈ వలిసె పూలు ఉండేవి. ఇప్పుడు 10 వేల ఎకరాలకు సాగు పడిపోయింది. ఈ పూలతోటల్లో అక్కడక్కడా నీలం రంగుల పెట్టెలు కనిపిస్తుంటాయి. తేనె సేకరించేందుకు పెట్టినవే అవి. శీతాకాలం రెండు నెలలు ఇక్కడ ఇదొక కుటీర పరిశ్రమ. గిరిజనులే గాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తేనె వ్యాపారులు ఈ కాలంలో ఇక్కడికి వస్తుంటారు. వలిసె పూలలో మకరందం ఆస్వాదించే తేనెటీగల్ని ఈ పెట్టెల్లోకి ఆకర్షించేందుకు తయారీదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ తేనెలో మినరల్స్, విటమిన్లు.. సాధారణంగా తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఈ వలిసె పూల తేనెలో ఎంజైమ్‌లు, మినరల్స్, విటమిన్లు, అమినో ఆమ్లాలు ఉంటాయి. ఈ తేనెను గోరువెచ్చని నీరు, నిమ్మరసంతో కలిపి తాగితే పొట్ట తగ్గడమే కాకుండా జీర్ణశక్తి పెరుగుతుందని అంటున్నారు. తేనెటీగలు పరిసర ప్రాంతాల్లోని పూల నుంచే తెచ్చే మకరందం బట్టి వాసన, రంగు మారుతుంటుంది. తేనె కిలో రూ.350 నుంచి రూ.450 వరకూ ఉంటుంది. ఈ పూల నుంచి వచ్చే విత్తనాల్ని గిరిజనులు పప్పు చేసి నూనె తీస్తారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలో వినియోగిస్తారు. ఎకరాకు వంద కిలోల వరకూ విత్తనాలు వేస్తే ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ వలిపో గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో ఇటీవల కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ వాడుతున్నారు. వలిసిపూల తోటలో తేనె ఉత్పత్తిదారుడు వెంకటశివరావు పర్యాటకులే కొనుగోలుదారులు మన్యంలో నీలగిరి చెట్లు, కాఫీ తోటల సాగు విస్తీర్ణం ఎక్కువ. సాధారణ రోజుల్లో వీటి పూల నుంచి తెచ్చే మకరందంతోనే తేనెటీగలు పట్టు పెడతాయి. శీతాకాలంలో మాత్రం వలిసె పూలు వస్తాయి. నీలగిరి, కాఫీ పూల కన్నా వలిసె పూల మకరందంతో అధికంగా తేనె దిగుబడి వస్తుంది. ఈ పరిశ్రమ మాకు లాభసాటిగా ఉంది. – వెంకటశివరావు, తేనె ఉత్పత్తిదారుడు, కురిడి, డుంబ్రిగూడ మండలం వారాంతంలో ఎక్కువ గిరాకీ ఈ సీజన్లో అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది వలిసె పూల తేనె కొంటారు. శని, ఆదివారాల్లో ఐదారు వేల రూపాయల తేనె అమ్ముతాం. మేము ఉత్పత్తి చేసే తేనె పర్యాటకులే ఎక్కువగా కొంటారు. – సుహాసిని, తేనె ఉత్పత్తిదారురాలు, చాపరాయి, డుంబ్రిగూడమండలం ఒక పెట్టె నుంచి 35–40 కిలోల తేనె సేకరణ ప్రస్తుతం సుమారు 250 ఎకరాల్లోని వలిసె పూల తోటల్లో తేనెపట్టు పెట్టెలు ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో పూల సాంద్రతను బట్టి వంద వరకూ పెట్టెలు పెడతారు. ఒక్కో పెట్టెలో లక్ష వరకూ ఆడ తేనెటీగలు, వంద మగ తేనెటీగలు, రాణి తేనెటీగ ఉంటాయి. ఈ ఒక్కో పెట్టె నుంచి వారానికి మూడు నుంచి నాలుగు కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది. సీజన్లో పెట్టెకు 35 నుంచి 40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు నుంచి పాడేరు వెళ్లే రోడ్డు మార్గంలో వలిసె పూల తోటల్లో మనకి చాలాచోట్ల తేనె ఉత్పత్తి పరిశ్రమలు కనిపిస్తుంటాయి. అరకు–కిరండూల్ రైల్వే మార్గంలోనూ మనకు దర్శనమిస్తుంటాయి. -
విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగనట్టుగా సమాచారం. అయితే ఈ కాల్పులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతిచెందిన వారిని గిరిజనులుగా అనుమానిస్తున్నారు. . కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మన్యం..మరో కశ్మీరం!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం మరో కశ్మీరాన్ని తలపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా సున్నా (0) డిగ్రీకి చేరుకుంది. ఆదివారం రాత్రి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ‘0’ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ పక్కనే ఉన్న చింతపల్లిలో 1.5 డిగ్రీలు నమోదైంది. ఏజెన్సీలోని దల్లాపల్లి, మోదపల్లిల్లో 3, పాడేరులో 4 డిగ్రీల చొప్పున కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5–10 డిగ్రీలకు పడిపోయి ఏజెన్సీ వాసులను గజగజ వణికిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏజెన్సీలో సాయంత్రం నుంచి మంచు తేలికపాటి వర్షంలా కురుస్తోంది. తెల్లారేసరికి వాహనాలు, ఇళ్ల పైకప్పులపై గడ్డకట్టిన మంచు కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే ఎముకలు కొరికే చలి మొదలవుతోంది. ఉదయం 10 గంటలకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. దీంతో అక్కడ వారు కశ్మీరంలోని మంచుకొండల్లో గడపుతున్న అనుభూతిని పొందుతున్నారు. విశాఖ రికార్డు! మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతల్లో విశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. యాభై ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం రాత్రి 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 6 డిగ్రీలు తక్కువ కావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోనూ 12 డిగ్రీలు నమోదయింది. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లోకెల్లా గుంటూరు జిల్లా రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణంకంటే 4–6 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వణికిస్తున్నాయి. మరో రెండ్రోజులు అతిశీతల గాలులు.. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య భారతదేశంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3–5 డిగ్రీలు నమోదవడం వల్ల అక్కడ శీతల ప్రభావం ఎక్కువ ఉంటోంది. అటు నుంచి దక్షిణం వైపునకు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇదే కోస్తాంధ్రలో చలి వణికించడానికి కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) కొనసాగి చలి తీవ్రతను పెంచుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని మారుమూల జీనబాడు పంచాయతీ వలసలగురువు గ్రామానికి చెందిన తామర్ల రామన్న(70) అనే వృద్ధుడు సోమవారం తెల్లవారుజామున చలితీవ్రతకు తాళలేక మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 5న అల్పపీడనం.. జనవరి 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అండమాన్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అటువైపు చేపల వేటకు వెళ్లవద్దని సోమవారం రాత్రి నివేదికలో ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్ @ 3 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భీంపూర్ మండలం అర్లి, బేలా ప్రాంతాల్లో ఏకంగా మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం జిన్నెదారి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. -
జోరువానలో.. 12 కిలోమీటర్లు డోలీలో..
-
మన్యం ఒడిలోనే ఎదిగిన థింసా..
విశాఖ మన్యంలో గిరిజన సంస్కృతికి పర్యాయపదంగా మారిన థింసా నృత్యంపై ఇటీవల కాలంలో ఓ వివాదం రాజుకుంటోంది. థింసాను కూచిపూడి తరహాలో రాష్ట్ర అధికారిక నృత్యంగా ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇంకా ఆయన హామీ వాస్తవరూపం దాల్చకుండానే ఒడిశా మేధావులు, కళాకారులు కొత్త వాదన బలంగా వినిపిస్తున్నారు. ధింసా నృత్యం తమ రాష్ట్రానికి చెందిన కళా వారసత్వమని, పేటెంట్ కోసం యత్నిస్తున్నామని, ఏపీకి ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో థింసా నృత్యానికి పుట్టిల్లుగా పరిగణించే చట్రాయిపుట్టు గిరిజన తండాను సందర్శించి అక్కడి కళాకారులతో సాక్షి మాట్లాడింది. ఒడిశా థింసాతో మనకు సంబంధం లేదని, తమ తాత ముత్తాతల నుంచి మన్యం ఒడినే థింసా ఎదిగి తమకు ఉపాధి కల్పిస్తోందని గిరిజన కళాకారులు చెబుతున్నారు. అసలు వివాదమేంటి.. విశాఖ మన్యం చట్రాయిపుట్టు నుంచే థింసా ఎదిగిందనేందుకు గిరిజనుల వాదనలేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే... సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో గిరిజనుల సాంప్రదాయ నృత్యం థింసా. ఇది ఆదివాసీ పదం. దీనికి అభినయం అని అర్థం. తమ మనోభావాలను ప్రతిబింబిస్తూ పాటలు పాడుతూ, సంప్రదాయ వాయిద్యాలు లయబద్ధంగా మ్రోగుతుంటే మహిళలంతా జట్టు కట్టి చేసే ఆనంద నృత్యమే థింసా. పురుషులు గిరిజన సంప్రదాయ డప్పు, సన్నాయి, కొమ్ముబూరలు వంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటే కనీసంగా 10 నుంచి 22 మంది మహిళలు పాట పాడుతూ వలయాకారంలో నృత్యం చేస్తుంటారు. విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు గిరిజనులు ఈ థింసా నృత్యాన్ని తమ సంప్రదాయ నృత్యంగా ఆచరిస్తుంటారు. గిరిజనుల గ్రామ దేవతలను పూజిస్తూ సామూహికంగా బొడా థింసా (పెద్ద నృత్యం), స్త్రీ, పురుషులిద్దరూ పక్షుల ఆరుపులను అనుకరిస్తూ లయబద్ధంగా వలయాలు చుడుతూ ఉద్రేకపూరితంగా చేసే గుండేరి థింసా (పక్షి నృత్యం). వ్యవసాయ పనులు చేసి సాయంత్రం సేదతీరే సమయంలో గొడ్డి బేటా థింసా (రాళ్ళను ఏరే నృత్యం), అడవిలో ఆకుల్ని ఏరుతున్నట్లు అనుకరించే పోతర్ తోలా థింసా (ఆకులను సేకరించే నృత్యం), పులి ఎదురు పడినప్పుడు వేటగాడు ఎలా తప్పించుకోవాలో తెలుపుతూ పులి, మేకలను అనుకరిస్తూ చేసే భాగ్ థింసా (బెబ్బులి నృత్యం).. ఇలా విభిన్న రకాలుగా థింసాను వర్గీకరించారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విభిన్న గిరిజన తెగల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా ఈ నృత్యం తీర్చిదిద్దారని చెబుతారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యంగా.. గిరిజనులు పగలంతా కాయకష్టం చేసి సాయంత్రం గూడెంలో సేదతీరే సమయంలో ప్రతి నిత్యం ఆడిపాడే నృత్యంగా మొదలైన థింసా.. తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రత్యేక నృత్యంగా గుర్తింపు పొందింది. దేశ, విదేశీ ప్రముఖలు రాష్ట్రానికి, జిల్లాకు విచ్చేసిన సందర్భాల్లో, పర్వదినాలు, శుభకార్యాల్లో గిరిజన కళాకారులతో ఈ థింసా నృత్యం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. తద్వారా ఈ నృత్యరీతి పలువురిని ఆకట్టుకోవడంతో దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం పొందింది. విశాఖ మన్యంలోని అరకు, పాడేరు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత నేపథ్యంలో పర్యాటకుల కోసం ప్రతినిత్యం థింసా నృత్యాలను ఏర్పాటు చేస్తున్నారు. థింసాను కూచిపూడి తరహాలో రాష్ట్ర అధికారిక నృత్యంగా ప్రకటిస్తామని సీఎం చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇంకా ఆయన హామీ వాస్తవరూపం దాల్చకుండానే ఒడిశా మేధావులు, కళాకారులు కొత్త వాదన బలంగా వినిపిస్తున్నారు. థింసా నృత్యం తమ రాష్ట్రానికి చెందిన కళావారసత్వమని, పేటెంట్ కోసం యత్నిస్తున్నామని, ఏపీకి ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. థింసా పుట్టిల్లు చట్రాయిపుట్టు విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం చట్రాయిపుట్టు గ్రామం థింసా నృత్యం పుట్టిల్లుగా కీర్తినొందింది. భారతదేశ వ్యాప్తంగా థింసా నృత్యం చేసిన ఘనత చట్రాయిపుట్టు గిరిజన మహిళలకే దక్కింది. పూర్వం దేవతామూర్తులు కూడా ఈ నృత్యం ఆడేవారని, ఇందుకు ఆధారం గా చట్రాయిపుట్టుకు సమీపంలోని సీతమ్మ కొండపై థింసా నృత్యం మాదిరిగా వరుస లో ఉండే శిలలను గిరిజనులు చూపిస్తుం టారు. పగలంతా అడవికి వెళ్లి సాయంత్రా నికి తిరిగొచ్చే గిరిజనులు సేదతీరే క్రమం లో ఆడిపాడే నృత్యం థింసాగా 1970వ దశకంలో ప్రాచుర్యం పొందింది. విషయం ఆ నోటా.. ఈనోటా 1980లో అప్పటి ప్రధా ని ఇందిరా గాంధీకి తెలిసింది. థింసా నృత్యం చూడాలని ఉందని ఆమె కోరడం తో అప్పటి విశాఖ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు చట్రాయి పుట్టికి చెందిన గిరిజనులను ఢిల్లీకి తీసుకు వెళ్లి అక్కడ ధింసా నృత్యం ఏర్పాటు చేయించారు. థింసా చూసి ముగ్ధురాలైన ఇందిర గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. థింసా కళా వారసత్వాన్ని కాపాడాలి నాకు ఊహవచ్చినప్పటి నుంచి థింసా ఆడుతున్నాను. ఒడిశాలో ఆడిపాడే డేంసాతో మనకు సంబంధం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చి ఆంధ్రప్రదేశ్ మన్యం బిడ్డలుగా గౌరవం పొందు తున్నాం. ఆ కళావారతస్వాన్ని కాపాడా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. –పాంగి జమున, థింసా కళాకారిణి ఇందిరమ్మతో ఆడిపాడాం.. 1980లో తమ థింసా నృత్యాన్ని మెచ్చి ప్రధాని ఇందిరాగాంధి ఢిల్లీకి ర మ్మని కబురు పంపింది. జిల్లా అ ధికారు లు ఢిల్లీకి 22 మందితో కూడిన థింసా బృందాన్ని తీసుకువెళ్లారు. 40 రోజుల పాటు అక్కడ థింసా నృత్యం చేశాం. ముగ్ధురాలైన ఇందరమ్మ మాతో కలసి డ్యాన్స్ చేశారు. వస్త్రాలతోపాటు ఎన్నో బహుమతులు అందజేశారు. తర్వా త ఎంతో మంది ముఖ్యమంత్రులు, మంత్రులతో కలసి «థింసా నృత్యం చేసాం. – గౌరి, థింసా సీనియర్ కళాకారిణి ఒడిశాలో డేంసా... థింసా నృత్యం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కానీ తరతరాల నుంచి ఆ నృత్యం చేయడం మా మహిళలకు ఆచారంగా మారింది. థింసా నృత్యం విశాఖ ఏజెన్సీలోనే పుట్టిందనేందుకు ఆధారాలున్నాయి. ఒడిశాలోని డేంసా నృత్యంకు, మా థింసా నృత్యంకు చాలా తేడా ఉంది. నాలుగైదు భంగిమల్లో మా మహిళలు థింసా నృత్యమాడుతారు. ఒడిశాలో మాత్రం శరీర అవయావాలు పూర్తిస్థాయిలో కదలకుండానే మహిళలు నృత్యమాడుతారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మా మహిళలు థింసా నృత్యం చేసి, చట్రాయిపుట్టుకు మంచి పేరు తీసుకువచ్చారు. –గోమంగి మోహన్, చట్రాయిపుట్టు వాస్తవ్యుడు పేటెంట్ కోసం ప్రభుత్వం కృషి చేయాలి.. గిరిజనుల తరతరాల సాంప్రదాయిక నృత్యం థింసా మన విశాఖ మన్యందే... పేటెంట్ హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. –ప్రజాకవి వంగపండు ప్రసాదరావు -
మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
విశాఖపట్నం: మన్యంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ మన్యంలో అనారోగ్యాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. -
తెలుగుదేశం నేతల విడుదల
విడిచిపెట్టిన మావోయిస్టులు.. పది రోజుల ఉత్కంఠకు తెర జీకేవీధి: విశాఖ మన్యంలో 10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. మావోయిస్టుల అదుపులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తెల్లవారుజామున క్షేమంగా ఊరు చేరుకున్నారు. మావోయిస్టుల నిర్బంధంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల కృషి ఫలించింది. దీంతో టీడీపీ నేతలైన ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండ లం బాలయ్యలను మావోయిస్టులు క్షేమంగా విడిచిపెట్టారు. ఈనెల 6వ తేదీన జీకేవీధి మండలం కొత్తూరు గ్రామం వద్ద టీడీపీ నేతలైన ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అపహరించిన సంగతి తెలిసిందే. అదుపులో ఉన్న గిరిజన టీడీపీ నేతలకు ఎలాంటి హాని తల పెట్టవద్దని గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కుటుంబ సభ్యులు, అఖిలపక్షం నేతలు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో ఈనెల 13 లోగా ప్రభుత్వం బాక్సైట్‌పై ప్రకటన చెయ్యాలని, లేదంటే తమ అధీనంలో ఉన్న గిరిజన టీడీపీ నేతలను హతమారుస్తామంటూ మావోయిస్టులు అల్టిమేటం విధించారు. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చిన సీఎం చంద్రబాబు బాక్సైట్‌పై తమ ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తన అభిప్రాయం వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు మావోయిస్టులు మానవతా దృక్పథంతో బుధవారం సాయంత్రం ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ అడవుల్లో టీడీపీ నేతలను సురక్షితంగా ఉపాధ్యాయ సంఘాలకు అప్పగించారు. బాక్సైట్ జోలికొస్తే టీడీపీ అంతుచూస్తాం: మావోయిస్టు అగ్రనేతలు బాక్సైట్ తవ్వకాలు చేపడితే టీడీపీ అంతు చూస్తామని మావోయిస్టు అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏవోబీ సరిహద్దు చిత్రకొండ అడవు ల్లో బుధవారం సాయంత్రం వీరు ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు కైలాసం, ఆజాద్, నవీన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల వల్ల తాము జీవనాధారం కోల్పోతామని ప్రజాకోర్టులో 20 గ్రామాలకు చెందిన ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. -
విశాఖ మన్యం గజగజ
పాడేరు ఘాట్‌లో 3 డిగ్రీలు లంబసింగిలో 4 డిగ్రీలు నమోదు చింతపల్లి/పాడేరు, న్యూస్‌లైన్: చలి తీవ్రతతో విశాఖ మన్యం గజగజలాడుతోంది. ఇటీవల 15 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు శనివారం ఒక్కసారిగా క్షీణించాయి. పాడేరు ఘాట్‌రోడ్డులోని మోదమాంబ పాదాల వద్ద అత్యల్పంగా 3 డి గ్రీలు, చింతపల్లి మండలం లంబసింగిలో 4, పాడేరు మండలం మినుములూరులో 5, చింతపల్లి మండల కేంద్రంలో 7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శుక్రవారం మినుములూరులో 12, చింతపల్లిలో 15 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదై చలిగాలులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులోనే ఉష్ణోగ్రతలు భారీగా (ఏడెనిమిది డిగ్రీలు) తగ్గడంతో మన్యం వాసులు వణికిపోతున్నారు. ఈ శీతాకాలం ప్రారంభమయ్యాక ఇంతతక్కువ ఉష్ణోగ్రతలు ఇదే తొలిసారి. సూర్యోదయం 9 గంటలకు, సూర్యాస్తమయం మూడున్నరకే అవుతోంది. అరకు లోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, సీలేరు, మాచ్‌ఖండ్ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు చలికి తాళలేకపోతున్నారు. -
రెండోరోజు విశాఖ మన్యంలో బంద్
-
రెండోరోజు విశాఖ మన్యంలో బంద్
విశాఖ : విశాఖ మన్యంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండోరోజు కూడా బంద్ కొనసాగుతోంది. ఉదయమే ఉద్యోగ సంఘ నాయకులు, వర్తకులు, స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు సంస్థల ఉద్యోగులు గుండ్లు గీయించుకుని, అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇటు పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్‌లో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ టూర్లను ఆపేశారు. మ్యూజియం, గార్డెన్లు మూతబడ్డాయి. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటు బంద్ ప్రభావంతో జనజీవనం స్తంభించింది. ఇక విజయనగరం జిల్లాలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. మానవహారాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దగ్ధంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిక్కోలులో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మహామానవహారం విజయవంతం కావడంతో అడుగడుగునా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ, మానవహారంతోపాటు జాతీయ రహదారిపై స్నానాలు చేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి