విశాఖ మన్యంలో గిరిజన సంస్కృతికి పర్యాయపదంగా మారిన థింసా నృత్యంపై ఇటీవల కాలంలో ఓ వివాదం రాజుకుంటోంది. థింసాను కూచిపూడి తరహాలో రాష్ట్ర అధికారిక నృత్యంగా ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇంకా ఆయన హామీ వాస్తవరూపం దాల్చకుండానే ఒడిశా మేధావులు, కళాకారులు కొత్త వాదన బలంగా వినిపిస్తున్నారు. ధింసా నృత్యం తమ రాష్ట్రానికి చెందిన కళా వారసత్వమని, పేటెంట్ కోసం యత్నిస్తున్నామని, ఏపీకి ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో థింసా నృత్యానికి పుట్టిల్లుగా పరిగణించే చట్రాయిపుట్టు గిరిజన తండాను సందర్శించి అక్కడి కళాకారులతో సాక్షి మాట్లాడింది. ఒడిశా థింసాతో మనకు సంబంధం లేదని, తమ తాత ముత్తాతల నుంచి మన్యం ఒడినే థింసా ఎదిగి తమకు ఉపాధి కల్పిస్తోందని గిరిజన కళాకారులు చెబుతున్నారు. అసలు వివాదమేంటి.. విశాఖ మన్యం చట్రాయిపుట్టు నుంచే థింసా ఎదిగిందనేందుకు గిరిజనుల వాదనలేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే...
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో గిరిజనుల సాంప్రదాయ నృత్యం థింసా. ఇది ఆదివాసీ పదం. దీనికి అభినయం అని అర్థం. తమ మనోభావాలను ప్రతిబింబిస్తూ పాటలు పాడుతూ, సంప్రదాయ వాయిద్యాలు లయబద్ధంగా మ్రోగుతుంటే మహిళలంతా జట్టు కట్టి చేసే ఆనంద నృత్యమే థింసా. పురుషులు గిరిజన సంప్రదాయ డప్పు, సన్నాయి, కొమ్ముబూరలు వంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటే కనీసంగా 10 నుంచి 22 మంది మహిళలు పాట పాడుతూ వలయాకారంలో నృత్యం చేస్తుంటారు. విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు గిరిజనులు ఈ థింసా నృత్యాన్ని తమ సంప్రదాయ నృత్యంగా ఆచరిస్తుంటారు. గిరిజనుల గ్రామ దేవతలను పూజిస్తూ సామూహికంగా బొడా థింసా (పెద్ద నృత్యం), స్త్రీ, పురుషులిద్దరూ పక్షుల ఆరుపులను అనుకరిస్తూ లయబద్ధంగా వలయాలు చుడుతూ ఉద్రేకపూరితంగా చేసే గుండేరి థింసా (పక్షి నృత్యం). వ్యవసాయ పనులు చేసి సాయంత్రం సేదతీరే సమయంలో గొడ్డి బేటా థింసా (రాళ్ళను ఏరే నృత్యం), అడవిలో ఆకుల్ని ఏరుతున్నట్లు అనుకరించే పోతర్ తోలా థింసా (ఆకులను సేకరించే నృత్యం), పులి ఎదురు పడినప్పుడు వేటగాడు ఎలా తప్పించుకోవాలో తెలుపుతూ పులి, మేకలను అనుకరిస్తూ చేసే భాగ్ థింసా (బెబ్బులి నృత్యం).. ఇలా విభిన్న రకాలుగా థింసాను వర్గీకరించారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విభిన్న గిరిజన తెగల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా ఈ నృత్యం తీర్చిదిద్దారని చెబుతారు.
ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యంగా..
గిరిజనులు పగలంతా కాయకష్టం చేసి సాయంత్రం గూడెంలో సేదతీరే సమయంలో ప్రతి నిత్యం ఆడిపాడే నృత్యంగా మొదలైన థింసా.. తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రత్యేక నృత్యంగా గుర్తింపు పొందింది. దేశ, విదేశీ ప్రముఖలు రాష్ట్రానికి, జిల్లాకు విచ్చేసిన సందర్భాల్లో, పర్వదినాలు, శుభకార్యాల్లో గిరిజన కళాకారులతో ఈ థింసా నృత్యం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. తద్వారా ఈ నృత్యరీతి పలువురిని ఆకట్టుకోవడంతో దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం పొందింది. విశాఖ మన్యంలోని అరకు, పాడేరు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత నేపథ్యంలో పర్యాటకుల కోసం ప్రతినిత్యం థింసా నృత్యాలను ఏర్పాటు చేస్తున్నారు. థింసాను కూచిపూడి తరహాలో రాష్ట్ర అధికారిక నృత్యంగా ప్రకటిస్తామని సీఎం చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇంకా ఆయన హామీ వాస్తవరూపం దాల్చకుండానే ఒడిశా మేధావులు, కళాకారులు కొత్త వాదన బలంగా వినిపిస్తున్నారు. థింసా నృత్యం తమ రాష్ట్రానికి చెందిన కళావారసత్వమని, పేటెంట్ కోసం యత్నిస్తున్నామని, ఏపీకి ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నారు.
థింసా పుట్టిల్లు చట్రాయిపుట్టు
విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం చట్రాయిపుట్టు గ్రామం థింసా నృత్యం పుట్టిల్లుగా కీర్తినొందింది. భారతదేశ వ్యాప్తంగా థింసా నృత్యం చేసిన ఘనత చట్రాయిపుట్టు గిరిజన మహిళలకే దక్కింది. పూర్వం దేవతామూర్తులు కూడా ఈ నృత్యం ఆడేవారని, ఇందుకు ఆధారం గా చట్రాయిపుట్టుకు సమీపంలోని సీతమ్మ కొండపై థింసా నృత్యం మాదిరిగా వరుస లో ఉండే శిలలను గిరిజనులు చూపిస్తుం టారు. పగలంతా అడవికి వెళ్లి సాయంత్రా నికి తిరిగొచ్చే గిరిజనులు సేదతీరే క్రమం లో ఆడిపాడే నృత్యం థింసాగా 1970వ దశకంలో ప్రాచుర్యం పొందింది. విషయం ఆ నోటా.. ఈనోటా 1980లో అప్పటి ప్రధా ని ఇందిరా గాంధీకి తెలిసింది. థింసా నృత్యం చూడాలని ఉందని ఆమె కోరడం తో అప్పటి విశాఖ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు చట్రాయి పుట్టికి చెందిన గిరిజనులను ఢిల్లీకి తీసుకు వెళ్లి అక్కడ ధింసా నృత్యం ఏర్పాటు చేయించారు. థింసా చూసి ముగ్ధురాలైన ఇందిర గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.
థింసా కళా వారసత్వాన్ని కాపాడాలి
నాకు ఊహవచ్చినప్పటి నుంచి థింసా ఆడుతున్నాను. ఒడిశాలో ఆడిపాడే డేంసాతో మనకు సంబంధం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చి ఆంధ్రప్రదేశ్ మన్యం బిడ్డలుగా గౌరవం పొందు తున్నాం. ఆ కళావారతస్వాన్ని కాపాడా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
–పాంగి జమున, థింసా కళాకారిణి
ఇందిరమ్మతో ఆడిపాడాం..
1980లో తమ థింసా నృత్యాన్ని మెచ్చి ప్రధాని ఇందిరాగాంధి ఢిల్లీకి ర మ్మని కబురు పంపింది. జిల్లా అ ధికారు లు ఢిల్లీకి 22 మందితో కూడిన థింసా బృందాన్ని తీసుకువెళ్లారు. 40 రోజుల పాటు అక్కడ థింసా నృత్యం చేశాం. ముగ్ధురాలైన ఇందరమ్మ మాతో కలసి డ్యాన్స్ చేశారు. వస్త్రాలతోపాటు ఎన్నో బహుమతులు అందజేశారు. తర్వా త ఎంతో మంది ముఖ్యమంత్రులు, మంత్రులతో కలసి «థింసా నృత్యం చేసాం.
– గౌరి, థింసా సీనియర్ కళాకారిణి
ఒడిశాలో డేంసా...
థింసా నృత్యం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కానీ తరతరాల నుంచి ఆ నృత్యం చేయడం మా మహిళలకు ఆచారంగా మారింది. థింసా నృత్యం విశాఖ ఏజెన్సీలోనే పుట్టిందనేందుకు ఆధారాలున్నాయి. ఒడిశాలోని డేంసా నృత్యంకు, మా థింసా నృత్యంకు చాలా తేడా ఉంది. నాలుగైదు భంగిమల్లో మా మహిళలు థింసా నృత్యమాడుతారు. ఒడిశాలో మాత్రం శరీర అవయావాలు పూర్తిస్థాయిలో కదలకుండానే మహిళలు నృత్యమాడుతారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మా మహిళలు థింసా నృత్యం చేసి, చట్రాయిపుట్టుకు మంచి పేరు తీసుకువచ్చారు.
–గోమంగి మోహన్, చట్రాయిపుట్టు వాస్తవ్యుడు
పేటెంట్ కోసం ప్రభుత్వం కృషి చేయాలి..
గిరిజనుల తరతరాల సాంప్రదాయిక నృత్యం థింసా మన విశాఖ మన్యందే... పేటెంట్ హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.
–ప్రజాకవి వంగపండు ప్రసాదరావు
Comments
Please login to add a commentAdd a comment