నాట్యం అనేది ఆహ్లాదానికే కాదు మానసిక వికాసానికి కూడా అనుకుంటే... నాట్యం అంటే సంతోషమే కాదు మానసికస్థైర్యం కూడా అనుకుంటే... నాట్యం అనేది ఆనందతరంగమే కాదు పర్యావరణహిత చైతన్యం అంటే గుర్తుకు వచ్చే పేరు.... సోహిని రాయ్ చౌదరి....
సోహిని రాయ్ చౌదరి తండ్రి సుబ్రతో రాయ్ సితార్ విద్వాంసుడు. తల్లి ఉమారాయ్ చౌదరి శిల్పి. కోల్‌కత్తాలోని వారి ఇంటిలో ఎప్పుడూ కళాత్మక వాతావరణం ఉండేది. నాలుగు సంవత్సరాల వయసులోనే నృత్యకారిణిగా కాళ్లకు గజ్జె కట్టింది సోహిని రాయ్ చౌదరి. భరతనాట్యం నుంచి మోహినియాట్టం వరకు ఎన్నో నృత్యాలలో ప్రావీణ్యం సాధించింది.
‘మన వైదిక సిద్ధాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవతావాదం, మంచి గురించి చాటి చెప్పాయి. కోవిడ్, ఆర్థికమాంద్యం, యుద్ధంలాంటి అనిశ్చిత కాలాల్లో అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇతరులకు సహాయపడేలా ప్రేరణ ఇస్తాయి. జీవితానికి సానుకూల దృక్పథాన్ని ఇచ్చే శక్తి మన పవిత్ర తత్వాలలో ఉంది’ అంటుంది సోహిని.
వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సులలో సోహిని రాయ్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.‘వేదమంత్రాలతో కూడిన నా నృత్యప్రదర్శన ప్రకృతి గురించి, మన జీవితాల్లో దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా ఉంటుంది. పశుపతిగా శివుడు, అడవులు, జంతువులు, పర్యావరణాన్ని పరిరక్షించేవాడు. ప్రకృతిని మనుషులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, విధ్వంసం సృష్టిస్తున్నారో చెప్పడానికి, ప్రకృతితో సన్నిహిత సంబంధాల కోసం శివతాండవం చేస్తున్నాను’ అంటున్న సోహిని రాయ్ ‘గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ కూడా అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు, సంస్కృతికి సోహిని రాయ్ చౌదరి అంబాసిడర్‌గా మారింది. యూకేలోని ఇండియన్ హైకమిషన్‌కు చెందిన నెహ్రూ సెంటర్‌లో సోహిని చేసిన శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివతాండవంతోపాటు శివుడి గురించి రుషి దాస్ గుప్తా చెప్పిన విలువైన మాటలను వినిపించింది. మార్కండేయ పురాణం, శివపురాణాలలో నుంచి ఒక కథను ఎంపిక చేసుకొని దాన్ని నృత్యరూపకంగా మలుచుకుంది. లండన్ తరువాత అమెరికా, రష్యా, జర్మనీ, స్పెయిన్... మొదలైన దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వబోతోంది.
‘డ్యాన్సింగ్ విత్ ది గాడ్స్’ పేరుతో తొలి పుసక్తం రాసిన సోహిని రాయ్‌కు రచనలు చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె రచనల్లో మహిళా సాధికారత నుంచి రంగస్థలం వరకు, నృత్యోద్యమం నుంచి దేవదాసీల దుస్థితి వరకు ఎన్నో అంశాలు ఉంటాయి. శక్తివాదాన్ని ప్రధానంగా చేసుకొని ఎన్నో రచనలు చేసింది.
‘ఇండియన్ స్టేజ్ స్టోరీస్: కనెక్టింగ్ సివిలైజేషన్స్’ పేరుతో సోహినిరాయ్ రాసిన పుస్తకం భారతీయ రంగస్థలం ఆత్మను పట్టిస్తుంది. ఈ పుస్తకం ద్వారా మన నాగరికతలోని గొప్ప సాంస్కృతిక, సంప్రదాయల గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది. యూరప్‌లోని పద్ధెనిమిది యూనివర్శిటీలలో విజిటింగ్‌ప్రోఫెసర్‌గా పనిచేసింది. ‘సూఫీ తత్వం, రూమీ కవిత్వం, ఠాగూరు మానవతావాదంలో నాకు మహిళాసాధికారత కనిపిస్తుంది’ అంటున్న సోహినిరాయ్ చౌదరి తన నృత్య కళను సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment