ఎల్లలు దాటి ప్రతిభ చాటిన నృత్య తరంగాలు
సత్తా చాటుతున్న శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం
14 మంది కళాకారులకు బహుమతులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): “గోదావరి నీటిని తాగితే కళాకారులవుతారు’ అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ అనేక మంది సంగీత, నృత్య కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. చరిత్ర పుటల్లో తమదైన ముద్రను వేసి రాజమహేంద్రవరం ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు. ఆ కోవలోకే శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం చేరింది.
ఈనెల 2న మలేషియాలోని టీఎంసీ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో 14 బహుమతులను గెలుచుకుని ఇక్కడి కళాకారులు ప్రతిభ చాటారు. ఇందులో ప్రథమ బహుమతి ఉండటం విశేషం. మలేషియాలోని స్వర్ణ మరియమ్మన్ కుచాంగ్ వారు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు.
ఇందులో 13 దేశాల నుంచి 615 మంది కళాకారులు పాల్గొన్నారు. గాత్రం, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి 68 మంది విద్యార్థులు పాల్గొని 14 మంది బహుమతులు గెలుచుకున్నారు.
ఆన్‌లైన్‌లో పోటీలు
మలేషియాలో జరిగిన ఈ పోటీల్లో ఆన్‌లైన్ ద్వారా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. వీటిని రికార్డ్ చేసుకున్న నిర్వాహకులు అన్నీ పరిశీలించాక బహుమతులు ప్రకటించారు.
స్థానిక శ్రీరాధాకృష్ణ క్షేత్రం మొత్తం 14 బహుమతులు దక్కించుకుంది. ఇందులోమొదటి బహుమతి కూచిపూడి నాట్యానికి రాగా, ఐదు ద్వితీయ బహుమతుల్లో రెండు గాత్రం, ఒకటి సెమీ క్లాసికల్, రెండు కూచిపూడికి వచ్చాయి. తృతీయ బహుమతులు రెండు కూచిపూడి నృత్యానికి, సెమీ క్లాసికల్‌కు రెండు, గాత్రానికి ఒకటి వచ్చాయి.
ఇవి కాకుండా కన్సొలేషన్ బహుమతులు సెమీ క్లాసికల్‌కు ఒకటి, కూచిపూడి నృత్యానికి రెండు వచ్చాయి. ఆయా బహుమతులను మలేషియా నుంచి కొరియర్లో మంగళవారం కళాక్షేత్రానికి వచ్చాయి. ఈ బహుమతులను శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ జి.వి. నారాయణ, డాక్టర్ ఉమా జయశ్రీ కళాకారులకు అందజేశారు.
చదువుతో పాటు డ్యాన్స్ కూడా...
నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చిoది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా. – చెరుకుమిల్లి సిరిచందన
నాట్యం అంటే ప్రాణం
నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచి్చంది. నేను 2024లో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య
అనేక బహుమతులు వచ్చాయి
నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్‌లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య
Comments
Please login to add a commentAdd a comment