పాడేరు ఘాట్‌లో 3 డిగ్రీలు
లంబసింగిలో 4 డిగ్రీలు నమోదు
చింతపల్లి/పాడేరు, న్యూస్‌లైన్: చలి తీవ్రతతో విశాఖ మన్యం గజగజలాడుతోంది. ఇటీవల 15 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు శనివారం ఒక్కసారిగా క్షీణించాయి. పాడేరు ఘాట్‌రోడ్డులోని మోదమాంబ పాదాల వద్ద అత్యల్పంగా 3 డి గ్రీలు, చింతపల్లి మండలం లంబసింగిలో 4, పాడేరు మండలం మినుములూరులో 5, చింతపల్లి మండల కేంద్రంలో 7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శుక్రవారం మినుములూరులో 12, చింతపల్లిలో 15 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదై చలిగాలులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులోనే ఉష్ణోగ్రతలు భారీగా (ఏడెనిమిది డిగ్రీలు) తగ్గడంతో మన్యం వాసులు వణికిపోతున్నారు.
ఈ శీతాకాలం ప్రారంభమయ్యాక ఇంతతక్కువ ఉష్ణోగ్రతలు ఇదే తొలిసారి. సూర్యోదయం 9 గంటలకు, సూర్యాస్తమయం మూడున్నరకే అవుతోంది. అరకు లోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, సీలేరు, మాచ్‌ఖండ్ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు చలికి తాళలేకపోతున్నారు.