పల్లెపై పచ్చని సంతకం.. | Special Story On Visakha District Minumuluru | Sakshi
Sakshi News home page

పల్లెపై పచ్చని సంతకం..

Published Thu, May 28 2020 4:47 AM | Last Updated on Thu, May 28 2020 4:47 AM

Special Story On Visakha District Minumuluru - Sakshi

కొండల్లో సంక్షేమ గీతం పలకాలి..కోనల్లో సేవా దీపం వెలగాలి!కొండ గాలి కొత్త పాట పాడుతోంది. ముళ్లదారుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పక్కా డ్రైనేజీ పనులు పరుగులెత్తుతున్నాయి.. గిరిజన హృదయాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పల్లె గుండె చప్పుడు విందాం.. విశాఖ జిల్లా మినుములూరు వెళ్దాం రండి...

విశాఖ మన్యం (మినుములూరు)
దట్టమైన అడవి. ఆకాశాన్ని తాకే కొండలు. పాతాళాన్ని తలపించే లోయలు... దారీతెన్నూ లేదు.  అయినా నడవాలి. గుట్టలు.. మెట్టలు దాటాలి. గమ్యం సుదూరం. ఆత్మ విశ్వాసమే ఆయుధం.  ఇది మినుములూరు గ్రామ సచివాలయ సైన్యం.  పెన్షన్ల పంపిణీ, ఆదిమ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ  ప్రయాణం.  అయిదు కొండలు  ఎక్కి దిగితే... రాళ్లు, ముళ్ల దారిలో 20  కిలోమీటర్లు  నడిస్తే.. చింతగున్నల, మాదిగబంద  గూడేలు కనిపిస్తాయి. జనాభా 500 మంది.  కొండల నడుమ  కనీస సౌకర్యాలకు బహు దూరంగా ఎక్కడో విసిరేసినట్లు ఉండే  ఈ  గిరిజన గూడేలకు ప్రభుత్వం తరుçఫున అధికారులు, సిబ్బంది ఇంతకు ముందు ఎపుడూ వెళ్లిన దాఖలాలు లేవు. ఇపుడు మినుములూరు సచివాలయ సిబ్బంది వెళ్లి స్ధానికుల బాగోగులు తెలుసుకోవడం ఓ సంచలనం. మన్యంలో పెద్ద చర్చనీయాంశం. 
(ఎస్‌. ఎం. కొండబాబు– పాడేరు)

► మన్యం సముద్ర మట్టానికి 2,700 అడుగుల ఎత్తులో ఉండే ప్రాంతం. మిరియాల సాగుతో మలుపులు తిరిగిన ఘాటీ రోడ్డు ఘాటుగా ఉంటుంది. కొండ గాలికి వీచే కాఫీ పరిమళం సాంత్వన చేకూరుస్తుంది. పచ్చని అడవిలో లేళ్లు, దూకే సెలయేళ్లు  ప్రకృతి అందాలు అబ్బురపరుస్తాయి. మరో పక్క విద్యా, ఆరోగ్య సౌకర్యాల కొరత పట్టిపీడిస్తాయి. ఏ చిన్న రోగమొచ్చినా,  నిండు గర్భిణీ అయినా డోలీ మోత తప్పదు. చిన్న అర్జీ కోసం మండల కేంద్రానికి రావడానికి నరకయాతన పడాల్సిందే. ఇపుడు గ్రామ సచివాలయ వ్యవస్ధ గిరిజన సమస్యలకు పరిష్కారం వెతుకుతోంది. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. గిరిజనులకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామంటూ వలంటీర్ల దళం ముందుకు వస్తోంది.  
కొండ దారుల్లో మారుమూల గూడేలకు వెళుతున్న సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు 
 
► విశాఖ ఏజెన్సీలోని 244 పంచాయతీల గిరిజనులకు గ్రామ సచివాలయ వ్యవస్థ నేడు ఒక వరం. ఒకప్పుడు ఏ సమస్య ఉన్న గంటల తరబడి మారుమూల గూడేల నుంచి మండల కేంద్రానికి చేరుకుని వేరు వేరు శాఖల అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాల్సి వచ్చేది. రేషన్‌కార్డు కావాలన్నా, ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా అన్నిశాఖల అధికారులను కలవడం కష్టమయ్యేది. ఇపుడు గ్రామ సచివాలయాలలో ముఖ్యమైన అన్ని శాఖల ఉద్యోగులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి ఉద్యోగులంతా స్థానిక గిరిజనులే కావడంతో గిరిజనులకు మరింత మేలు కలుగుతోంది.   
► పాడేరు మండలం మినుములూరు సచివాలయం... ఏజెన్సీ 11 మండలాలలోకెల్లా ఉత్తమ సచివాలయంగా ప్రభుత్వ మన్ననలు పొందింది. దీని పరిధిలో 28 గూడేలున్నాయి.

ఫలితాలు ఇవిగో......
► మినుములూరు పరిసర గూడేల్లో తాగునీటి పథకాలు నిరుపయోగంగా ఉండేవి. వాటన్నింటిని సచివాలయ ఉద్యోగులు వినియోగంలోకి తెచ్చి గిరిజనులకు సురక్షిత తాగునీరు అందించారు. మారుమూల సల్దిగెడ్డ గూడేనికి రోడ్డు సౌకర్యం లేక జనం నరకయాతన పడేవారు. ప్రస్తుతం సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. 30 ఏళ్ల నుంచి పరిష్కారం కాని ఈ రోడ్డు సమస్య సచివాలయ వ్యవస్థ ద్వారా తీరింది. పూర్వం నుంచి పక్కా రోడ్డు సౌకర్యానికి నోచుకోని మారుమూల చింతగున్నల, మాదిగబంద గూడేలకు బంగారుమెట్ట జంక్షన్‌ నుంచి రూ.4కోట్ల వ్యయంతో పక్కా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ రోడ్డు ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు మంజూరు అయ్యింది. మరో నెల రోజుల్లో పక్కా రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. 
► 28 గూడేల్లోనూ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు  ఇంటింటా సర్వే నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు పొందలేని వారికి  సచివాలయం ద్వారా న్యాయం చేశారు.అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర వస్తువులను వలంటీర్లే తీసుకుని వెళ్లి గిరిజనులకు పంపిణీ చేశారు. ప్రతి నెల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లను వలంటీర్లు పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులకు పంచాయతీ కేంద్రానికి కాలినడకన వచ్చే పరిస్థితి తప్పింది. 

రూ. 25 వేలు అందుకున్నాం.. 
నా భార్య శాంతికి ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా రూ.15వేలు జమ చేసింది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాను. నాది టైలరింగ్‌ వృత్తి.  ప్రభుత్వం నుంచి  రూ.10వేల ఆర్ధికసాయం అందింది. రెండు పథకాల ద్వారా ఏడాదికి రూ.25వేల నగదును పొందుతున్నాం. 
-కొర్రా నూకరాజు, టైలర్‌

దరఖాస్తు చేసుకున్న వెంటనే పింఛను  
నాకు 53 సంవత్సరాలు. ఎస్టీలకు 50 ఏళ్లు నిండితే పింఛను సౌకర్యం ప్రభుత్వం కల్పించింది.  నేను దరఖాస్తు చేసుకున్న వెంటనే పింఛను సౌకర్యాన్ని పొందాను. ఆ సొమ్ముతో ఆర్ధిక భరోసా ఏర్పడింది.  
-మాసాడ దేవయ్య, గిరిజన రైతు,  


రోడ్డు వేసినందుకు సంతోషంగా ఉంది  
నా చిన్నతనం నుంచి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలినడకన అనేక ఇబ్బందులు పడేవారం. శివారున ఉన్న గూడెం కావడంతో గత పాలకులు రోడ్డు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. మినుములూరు గ్రామ సచివాలయంలో రోడ్డు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే యంత్రాంగం సకాలంలో స్పందించింది. డల్లాపల్లి రోడ్డు నుంచి మా  గూడెం వరకు రెండు కిలోమీటర్ల సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రోడ్డు పనులు శరవేగంగా 
జరుగుతున్నాయి. 
-పాంగి బొంజుబాబు, స్థానికుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement