మదనపల్లె ఘటనతో మొదలు..
పలుచోట్ల పనికిరాని ఫైల్స్ కాలిపోతే హంగామా
అధికారులు, ఉద్యోగులను వెంటాడుతున్న ప్రభుత్వం
గత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారంటూ వేధింపులు
గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఇదే తీరు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.
ఒక్క సివిల్ సర్వీసు అధికారులే కాకుండా గ్రూప్–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపులకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో ప్రకటన చేయించింది.
ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతోపాటు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కిందిస్థాయి ఉద్యోగులు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవరానికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజమహేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికారులు, ఉద్యోగులను
అనుమానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేకపోయింది.
ముద్ర వేసి ఇబ్బందులు..
ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్‌సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులపై పార్టీ ముద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment