సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవం వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సచివాలయాలను కేటగిరులుగా విభజించి ఉద్యోగులను కుదిరించింది.
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40 వేల ఉద్యోగుల సంఖ్యకు చంద్రబాబు సర్కార్ కోతపెట్టింది. సచివాలయ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.
ఇక, ఇదే సమయంలో సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరిగా విభజించింది. ఈ క్రమంలో ఏ-కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఆరుకి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, బీ-కేటగిరి సచివాలయంలో సిబ్బందిని ఏడుకి కుదించారు. సీ-కేటగిరి సచివాలయంలో సిబ్బంది ఎనిమిదికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఉద్యోగాల్లో భారీగా కోత విధించారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రూపాల్లో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.
ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా లేదా, ఏర్పాటై ఉంటే అందులో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు, నేతలకు సమాచారం లేదన్నారు. తమ విభాగంలో చేపట్టనున్న మార్పులు, చేర్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వంతోపాటు సంబంధిత మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment