హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల సంఖ్య భారీగా కుదింపు
నిరుద్యోగుల నోట్లో టీడీపీ కూటమి సర్కారు మట్టి
ఇప్పటివరకు ఒక్కో సచివాలయంలో 11 మంది వరకు పనిచేస్తుండగా, రేషనలైజేషన్ తర్వాత 6–8 మందితో సరి
సిబ్బంది కూడా 1.49 లక్షల నుంచి 1.15 లక్షలకు తగ్గింపు
సచివాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారు 1.27 లక్షల మంది
అదనంగా ఉన్నవారు ఇతర శాఖలకు బదిలీ
కేబినెట్ తాజా నిర్ణయం అమలులోకి వస్తే ఈ శాఖలో 34 వేల శాశ్వత ప్రభుత్వోద్యోగాలు దాదాపు రద్దయినట్లే
ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్ల వ్యవస్థకు టీడీపీ కూటమి మంగళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే దిశగా చంద్రబాబు సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరాలన్న సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేయబోతోంది.
ఎందుకంటే.. తాజాగా, శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే... ప్రభుత్వంలో ఒకేసారి దాదాపు 34వేల ఉద్యోగాలు శాశ్వతంగా తగ్గిపోనున్నాయి. రాష్ట్రంలో మొన్న జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. 2.66 లక్షల మంది ఉన్న వలంటీర్ల వ్యవస్థకు ఇప్పటికే దాదాపు మంగళం పాడేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ చేపట్టి అందులో పనిచేసే ఉద్యోగులను భారీగా కుదించనుంది.
1.49 లక్షల ఉద్యోగాలకు 1.15 లక్షలతో సరి..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం, సంక్షేమ పథకం ఎలాంటి అవినీతి, పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా చిట్టచివరి స్థాయి వరకు సంతృప్త స్థాయిలో చేరవేయాలన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి.
ఒక్కో సచివాలయంలో 10–11 మంది చొప్పున మొత్తం 1,49,235 మంది పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించి దిగ్విజయంగా నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో వీటిల్లో సిబ్బంది సంఖ్యను భారీగా కుదిస్తోంది.
ఎంతలా అంటే.. 2,500 కన్నా తక్కువ జనాభా ఉండే 3,562 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరుగురు చొప్పున.. 2,500–3,500 మధ్య జనాభా ఉండే 5,388 సచివాలయాల్లో ఏడుగురు చొప్పున.. 3,500 పైబడి జనాభా ఉండే 6,054 సచివాలయాల్లో ఎనిమిది మంది చొప్పున మాత్రమే కొనసాగించాలన్న నిర్ణయానికి శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా మొత్తం సచివాలయాల్లో ఉద్యోగాల సంఖ్యను 1,15,226 మందికే పరిమితం చేయాలని నిర్ణయించారు. అంటే.. 34వేల పోస్టులకు ఎసరు పెట్టనున్నారు.
15,496 మంది వేరే శాఖలకు బదిలీ
నిజానికి.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లూచేశారు. కానీ, ఎన్నికలతో ఆ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు చేపడుతున్న హేతుబద్ధీకరణ ప్రక్రియ తర్వాత ఆ ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు.. వాటిల్లో 15,496 మంది అదనంగా పనిచేస్తున్నట్లు లెక్కగట్టింది. ఇప్పుడు వీరందరినీ వేరే శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
పాత రోజులు పునరావృతం..
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు 3–4 ఊళ్లకు ఒక్క పంచాయతీ కార్యదర్శి.. ఐదారు ఊర్లకు ఒక వీఆర్వో మాత్రమే ఉన్న పరిస్థితి ఉండేది. వ్యవసాయ అసిస్టెంట్లు అయితే ఎక్కడో ఒకరు ఉండేవారు. ఇక సర్వేయర్లు మండలానికి ఒకరు.. చాలా మండలాలకు ఇన్‌చార్జి సర్వేయర్లు ఉండేవారు.
కానీ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక ప్రతి ఊర్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు నియమితులయ్యారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో చాలా గ్రామాల్లో కీలకమైన ఉద్యోగులు 2–3 ఊళ్లకు ఒకరు చొప్పున ఉండే పరిస్థితి మళ్లీ రానుంది. అలాగే, వీఆర్వో సంఖ్య 11,162 నుంచి 5,562కు తగ్గిపోనుంది.
అంటే.. సగం గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు ఉండని పరిస్థితి దాపురించబోతోంది. సర్వేయర్లదీ ఇదే పరిస్థితి. ఇక ఈ సచివాలయాల్లో ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ ఉద్యోగులు 10,475 మంది ఉండగా, హేతుబద్ధీకరణతో ఆ సంఖ్య 7,524కు పరిమితమవుతుంది. ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు కూడా 8,138 నుంచి 6,359కి తగ్గిపోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment