రెండోరోజు విశాఖ మన్యంలో బంద్
విశాఖ : విశాఖ మన్యంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండోరోజు కూడా బంద్ కొనసాగుతోంది. ఉదయమే ఉద్యోగ సంఘ నాయకులు, వర్తకులు, స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు సంస్థల ఉద్యోగులు గుండ్లు గీయించుకుని, అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇటు పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్‌లో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ టూర్లను ఆపేశారు. మ్యూజియం, గార్డెన్‌లు మూతబడ్డాయి. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటు బంద్ ప్రభావంతో జనజీవనం స్తంభించింది.
ఇక విజయనగరం జిల్లాలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. మానవహారాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దగ్ధంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిక్కోలులో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మహామానవహారం విజయవంతం కావడంతో అడుగడుగునా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ, మానవహారంతోపాటు జాతీయ రహదారిపై స్నానాలు చేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి