సాక్షి, జి.మాడుగుల (పాడేరు): విశాఖ మన్యంలో లభిస్తున్న బొడ్డెంగులంటే గిరిజనులకు ఎంతో ప్రీతి. గిరిజన ప్రాంతాల్లో విరివిగా లభించే బొడ్డెంగులు ఎంతో రుచికరమైన మాంసాహారంగా భావించి ఇక్కడ ప్రజలు లొట్టలేసుకుని తింటారు. బొడ్డెంగులకు ఈ గిరిజన ప్రాంతాల్లో ఎంతో డిమాండ్ ఉంది. బొడ్డెంగులు నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ లభిస్తాయి. గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులు ఉన్న చోట బొడ్డెంగులను గుర్తించి వాటి మొదలు వద్ద తవ్వి సేకరిస్తారు. ప్రతి ఒక్కరు వీటిని సంవత్సరానికి ఒక సారైనా తినకకుండా ఉండరు. ఇవి బయటకు తెల్ల పురుగులు మాదిరిగానే కన్పిస్తాయి. బొడ్డంగుల శరీరమంతా పూర్తిగా కొవ్వు పదార్థం. ఈ ప్రాంతంలో బొడ్డెంగులను మైదాన ప్రాంత రొయ్యలుగా పిలుస్తారు. ఈత దుబ్బుల నుంచి సేకరించిన బొడ్డెంగులను వేపుడు, కూరలుగా తయారు చేసుకొని భోజనం చేస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి.
బొడ్డెంగులతో కవాబులు (చీకులు)
రక్తపుష్టి ఇస్తాయి
రక్తహీనత ఉన్నవారు బొడ్డెంగులను వేపుడు, కూరగా తయారు చేసుకుని తింటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని, పౌష్టికాహారమవుతుందని వారు అంటున్నారు. గిరిజనులు ఎక్కువగా భోజనాలు, జీలుగ కల్లు, మద్యం తాగేవారు నంజకం (స్టఫ్)గా, ఇళ్లకు బంధువులు వచ్చినప్పుడు బొడ్డెంగులుతో విందులు ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment