minimum temperatures
-
మన్యం గజగజ
చింతపల్లి: మన్యంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దట్టంగా పొగమంచు కురవడంతోపాటు శీతల గాలులు, చలి తీవ్రత పెరిగాయి. దీంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. గురువారం డుంబ్రిగూడలో 8.6 డిగ్రీలు, జి.మాడుగుల, జీకే వీధిల్లో 8.7 డిగ్రీలు, హుకుంపేటలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. అదేవిధంగా అరకులోయలో 9.1, డిగ్రీలు, పెదబయలులో 9.5, చింతపల్లిలో 9.4, పాడేరులో 9.8, ముంచింగ్‌పుట్టులో 11.2, కొయ్యూరులో 13.3, అనంతగిరిలో 15.5 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం నుంచి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నవంబర్ 10, 12, 29, 30 తేదీల్లో 13 నుంచి 13.5 డిగ్రీలు మాత్రమే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు ముందుగానే నమోదు కావడంతో మన్యం ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులు బాగా వీస్తున్నాయి. ఉదయం 9.30 గంటలు దాటే వరకు పొగమంచు వదలడం లేదు. పొగమంచు, చలి తీవ్రత వల్ల వాహనచోదకులు, విద్యార్థులు, పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. -
చలిగాలుల విజృంభణ
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): శీతాకాలం ముగుస్తున్న సమయంలో అల్లూరి సీతారాజు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. చింతపల్లిలో నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 7.6 డిగ్రీలు నమోదవగా, పాడేరు మండలం మినుములూరులో 12 డిగ్రీలు, అరకులోయలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేకువజామున పొగమంచు కురుస్తున్నప్పటికీ 7గంటలకే సూర్యోదయమవుతోంది. -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతోపాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని, జనవరి మొదటి, రెండు వారాల్లో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే... రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది. లక్షద్వీప్, తమిళనాడుతోపాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుపానుకు అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
రానున్న మూడ్రోజులు గజ గజే..
సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రత రాష్ట్రంలో క్రమక్రమంగా పెరుగుతోంది. చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. చలికాలం మధ్యస్థానికి చేరడంతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. -
చింతపల్లిలో 11, అరకులో 12.3 డిగ్రీలు
సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మంచుతెరలు వీడటంలేదు. ఘాట్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా లైట్ల వెలుగులో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం 15.5 డిగ్రీలు నమోదు కాగా ఆదివారం 4.5 డిగ్రీలు తగ్గి 11 డిగ్రీలు నమోదైంది. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 12.3 డిగ్రీలు, పాడేరు మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాఫీబోర్డు వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. మంచు అందాలకు ఫిదా... జిల్లా వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఉన్నప్పటికీ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి అందాలను వీక్షిస్తూ పరవశిస్తున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలోని గుడిసె, చింతపల్లి మండలంలోని లంబసింగిలోని చెరువులవెనం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ, అరకులోయ మండలంలోని మాడగడ హిల్స్ ప్రాంతాలకు వేకువజామునే చేరుకుని పొగమంచు, సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షిస్తున్నారు. -
TS: నేడు, రేపు పలుచోట్ల వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వస్తున్న బలమైన గాలుల ప్రభావం ఫలితంగా నెలకొన్న మార్పులతో ఈ వానలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రమంతటా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వానల కారణంగా వాతావరణం మరింత చల్లబడింది. దీంతో చలితీవ్రత వేగంగా పెరిగింది. సాధారణం కంటే తక్కువగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్‌గా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. అలాగే నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18.4 డిగ్రీలు నమోదు కాగా, ఇక్కడ సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
ఆదిలాబాద్ @ 16.7
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతోనే చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యం కావడం... వాతావరణంలో నెలకొన్న మార్పులతో కొంత కాలంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి. మధ్యలో రెండు మూడురోజులు చలి పెరిగినా తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు క్షీణించడం ప్రారంభించాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోంది. మరో మూడురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 34 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో 16.7 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌తో పాటు మెదక్, నల్లగొండల్లో చలి పెరిగింది. రానున్న మూడురోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత మరింత తగ్గుతాయని చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
దక్షిణాదిలో మార్చి ఎండలు తక్కువే!
సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య! ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాలు కొంచెం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటారా? దేశం మొత్తమ్మీద మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. కానీ, దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మాత్రం వేడి సాధారణం నుంచి అంతకంటే తక్కువ ఉండనుంది. భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ విషయం తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం ఎన్నడూ లేనంతగా, స్పష్టంగా చెప్పాలంటే 1877 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించింది. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఎండీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో విలేకరుల సమావేశం నిర్వహించింది. మార్చి నుంచి మే నెల వరకూ వేసవి తీరుతెన్నులపై తన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం.. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు దేశ ఈశాన్య, తూర్పు, మధ్య ప్రాంతాలతోపాటు వాయువ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు మినహా మిగిలిన అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. మార్చి నుంచి మే నెల మధ్యభాగంలో దేశ మధ్య ప్రాంతం దానికి అనుకుని ఉండే వాయవ్య ప్రాంతాల్లో వడగాడ్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండనుంది. మార్చిలో దేశంలోని మధ్య ప్రదేశంలో వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. సాధారణ స్థాయిలోనే వర్షాలు.. మార్చి నెలలో వర్షపాతం కూడా దేశం మొత్తమ్మీద సాధారణంగానే ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక అంచనాలతో పోల్చినప్పుడు ఈ నెల వర్షాలు 83 –117 శాతం మధ్యలో ఉంటాయని తెలిపింది. దేశ వాయవ్య ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలు నమోదు కావచ్చునని, సెంట్రల్ ఇండియా పశ్చిమ దిక్కున, ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మార్చి నెల వానలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఎల్‌నినో, లానినాలపై ఇప్పుడే చెప్పలేం ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితులపై స్పష్టంగా చెప్పడం ప్రస్తుతానికి వీలుకాదని ఐఎండీ తెలిపింది. ‘‘పసఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతల దృష్ట్యా లానినా పరిస్థితులున్నాయి. రానున్న రోజుల్లో ఇది బలహీనపడి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది’’ అని వివరించింది. రుతుపవనాల సీజన్‌కు ముందు ఈ పరిస్థితులు ఏర్పడవచ్చంది. అంతేకాకుండా... రుతుపవనాలపై ప్రభా వం చూపగల హిందూ మహాసముద్ర ఉపరి తల జలాల ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితిలోనే ఉండే అవకాశమున్నట్లు చెప్పారు. -
కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంచుతోపాటు పొగమంచు కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో మంగళవారం తెల్లవారుజామున 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగుల మండలం కుంతలంలో 4.1, చింతపల్లి మండలం చింతపల్లిలో 4.2, జీకే వీధిలో 4.3, డుంబ్రిగూడలో 4.4, జి.మాడుగుల, హకీంపేటలో 4.7, పాడేరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలోని చాలాప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ తరహాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా ఆగలిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం, అనంతపురం జిల్లా బెళుగుప్పలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పెరగనున్న చలి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని స్పష్టం చేసింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 13.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
కొనసాగుతున్న వాయుగుండం.. ఉరుములు, మెరుపులతో వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి త ర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదు చ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. -
తెలంగాణను వణికిస్తున్న చలి.. అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో అతితక్కువగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ్‌పల్లిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10 డిగ్రీల సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31.6 డిగ్రీల సెల్సీయస్‌గా రికార్డయ్యింది. సాధారణంగా ఈ సమయంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడురోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
Andhra Pradesh: రాష్ట్రంపై చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గతానికి భిన్నంగా రాష్ట్రంలో చలి ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది. శీతాకాలంలో చలి వాతావరణం సాధారణమే అయినా ఈసారి దాని తీవ్రత ఎక్కువైంది. అన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. విజయవాడ వంటి వెచ్చని ప్రదేశాలను కూడా ఈ శీతాకాలం వణికిస్తోంది. 50 ఏళ్ల తర్వాత విజయవాడలో రెండు రోజుల కిందట 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మామూలుగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుంది. శీతాకాలం కూడా అంత తీవ్రమైన చలి వాతావరణం కనిపించదు. కానీ ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఈనెల 18వ తేదీ నుంచి వరుసగా 13.5 నుంచి 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచే చలి తీవ్రత పెరిగి ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే ఉంది. 2 నుంచి 4 డిగ్రీలకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతాయి. విశాఖ మన్యంలో 8 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలుంటాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆ ప్రాంతాలు చలికి గడ్డకడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లోను చలితీవ్రత పెరిగింది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌లో ఈ నెల 18న 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 5.4 డిగ్రీలు గురువారం ఉదయం విశాఖ జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలు నమోదైంది. పెదబయలు, డుంబ్రిగూడల్లో 5.7, జి.మాడుగులలో 5.9, జీకే వీధిలో 6.5, చింతపల్లి 7.7లో, హకుంపేటలో 7.8, పాడేరులో 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేరోజు కర్నూలు నగరంలో 14.2 డిగ్రీలు, విజయవాడలో 14.6, అనంతపురంలో 15.2, తిరుపతిలో 15.8, ఒంగోలు, ఏలూరుల్లో 15.9, శ్రీకాకుళం, కడపల్లో 16.2, గుంటూరులో 16.3, విశాఖపట్నంలో 18.2, కాకినాడలో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి కారణాలివే.. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కిలోమీటర్ల ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలితీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు గాలులు ఉత్తర భారతదేశం నుంచి మన రాష్ట్రానికి నేరుగా వీస్తున్నాయి.తేమ తక్కువగా ఉండడం వల్ల చలిగాలులు పెరిగాయి. చలితీవ్రత మరో 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 15వ తేదీ వరకు మామూలు చలి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చలిలో తిరగవద్దు చలి గాలుల వల్ల శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చలిలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలి ముక్కు, చెవులకు తాకకుండా జాగ్రత్త వహించాలి. – డాక్టర్ గోపీచంద్, పల్మనాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్ -
AP: వణుకుతున్న 'రాష్ట్రం'
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. గ్రామాలు, నగరాలు గజగజ వణుకుతున్నాయి. విజయవాడ నగరంలో చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో బుధవారం తెల్లవారుజామున 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. 50 ఏళ్ల తరువాత విజయవాడలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ చెబుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది. 1970లో డిసెంబర్ 14న అత్యల్పంగా 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 1995, 1984, 2010 సంవత్సరాల్లో 13.7, 13.4, 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం నగరంలో చలితీవ్రత పెరిగింది. రాబోయే రెండురోజులు నగరంలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా అంతా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోను చలిగాలులు కొనసాగుతున్నాయి. బుధవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 5.4 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. పెదబయలులో 5.7, ముంచంగిపుట్టులో 6.3, డుంబ్రిగూడలో 6.8, అరకు వ్యాలీలో 7, గుంటూరులో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్య భారతదేశం నుంచి చల్లటిగాలులు నేరుగా ఏపీ వైపు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మంగళవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 3.9, డుంబ్రిగూడ 4.4, జీకే వీధి 4.8, ముంచంగిపుట్టు 5.1, పెదబయలు 5.2, హుకుంపేట 5.9, పాడేరులో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌లో 7.1 డిగ్రీలు నమోదైంది. విజయవాడలోనూ చలి తీవ్రత పెరగడంతో మంగళవారం 13.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 13.6 నమోదైంది. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరులో 14.2, తిరుపతిలో 15.9, విశాఖలో 18.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర తీరం మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముంచంగిపుట్టులో 12.63 డిగ్రీలు, జి.మాడుగులలో 13.64, డుంబ్రిగూడలో 13.74, అరకులో 13.91, పెదబయలులో 14.61, హుకుంపేటలో 14.80, పాడేరులో 15.16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఈసారి ‘చలించుడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 30 డిగ్రీల కన్నా తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా, మెదక్‌లో అతి ఎక్కువగా 32.6 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. రెండ్రోజులు పొడి వాతావరణం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, హన్మకొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పడిపోయాయి. రానున్న 4 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేకున్నా ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ణ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 48 గంటల తర్వాత అల్పపీడనం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. -
వణికిస్తున్న చలి
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పాడేరు/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలుల తీవ్రత మరో రెండు రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం సాధారణం కంటే 3.7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్లోనే అత్యల్పంగా చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, నందిగామలో 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతిశీతల ప్రాంతాలైన లంబసింగి, పాడేరు ఘాట్, డల్లాపల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. -
కనిష్ట ఉష్ణోగ్రత @ 7.1 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతున్నాయి. చలి తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గగా.. రాత్రిపూట భారీగా పడిపోయాయి. ప్రస్తుతం సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈసారి చలి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆ తర్వాత అదే జిల్లా మోమీన్‌పేట్, సంగారెడ్డి జిల్లా కొహిర్‌లో 7.2 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్, న్యాల్కల్లో 7.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వాతావరణ శాఖ మెట్ స్టేషన్లలో కనిష్టం(సరాసరి)గా ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీలు నమోదు కాగా, దుండిగల్‌లో 12.5 డిగ్రీలు, మెదక్‌లో 12.8, హకీంపేట్‌లో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఆదిలాబాద్, దుం డిగల్, హన్మకొండ, హైదరాబాద్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం స్టేషన్లలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్ బేగంపేట కేంద్రంలో 12.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. మరో రెండ్రోజులు పొడి వాతావరణమే... రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి తీవ్రత పెరుగుతుండటంతో కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీలంక తీరానికి దగ్గరలోని నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది. -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర అండమాన్ దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది తదుపరి 36 గంటల్లో బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉండడంతో రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉండబోదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య పవనాలు ప్రవేశించడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. విశాఖ మన్యంలోని మినుములూరులో 16.5 డిగ్రీలు, అరకులోయలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజులూ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయింది. రామగుండంలో 12, హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీలు నమోదైంది. ఏడు డిగ్రీలు తక్కువగా భద్రాచలంలో 25, హన్మకొండలో 24, హైదరాబాద్‌లో 23 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మన్యం..మరో కశ్మీరం!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం మరో కశ్మీరాన్ని తలపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా సున్నా (0) డిగ్రీకి చేరుకుంది. ఆదివారం రాత్రి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా ‘0’ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ పక్కనే ఉన్న చింతపల్లిలో 1.5 డిగ్రీలు నమోదైంది. ఏజెన్సీలోని దల్లాపల్లి, మోదపల్లిల్లో 3, పాడేరులో 4 డిగ్రీల చొప్పున కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5–10 డిగ్రీలకు పడిపోయి ఏజెన్సీ వాసులను గజగజ వణికిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏజెన్సీలో సాయంత్రం నుంచి మంచు తేలికపాటి వర్షంలా కురుస్తోంది. తెల్లారేసరికి వాహనాలు, ఇళ్ల పైకప్పులపై గడ్డకట్టిన మంచు కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే ఎముకలు కొరికే చలి మొదలవుతోంది. ఉదయం 10 గంటలకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. దీంతో అక్కడ వారు కశ్మీరంలోని మంచుకొండల్లో గడపుతున్న అనుభూతిని పొందుతున్నారు. విశాఖ రికార్డు! మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతల్లో విశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. యాభై ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం రాత్రి 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 6 డిగ్రీలు తక్కువ కావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోనూ 12 డిగ్రీలు నమోదయింది. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లోకెల్లా గుంటూరు జిల్లా రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణంకంటే 4–6 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వణికిస్తున్నాయి. మరో రెండ్రోజులు అతిశీతల గాలులు.. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య భారతదేశంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3–5 డిగ్రీలు నమోదవడం వల్ల అక్కడ శీతల ప్రభావం ఎక్కువ ఉంటోంది. అటు నుంచి దక్షిణం వైపునకు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇదే కోస్తాంధ్రలో చలి వణికించడానికి కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) కొనసాగి చలి తీవ్రతను పెంచుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని మారుమూల జీనబాడు పంచాయతీ వలసలగురువు గ్రామానికి చెందిన తామర్ల రామన్న(70) అనే వృద్ధుడు సోమవారం తెల్లవారుజామున చలితీవ్రతకు తాళలేక మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 5న అల్పపీడనం.. జనవరి 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అండమాన్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అటువైపు చేపల వేటకు వెళ్లవద్దని సోమవారం రాత్రి నివేదికలో ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్ @ 3 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భీంపూర్ మండలం అర్లి, బేలా ప్రాంతాల్లో ఏకంగా మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం జిన్నెదారి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. -
మంచు దుప్పట్లో ఉత్తరాది..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న శీతల గాలులు, తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి.ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరాదిని మంచు కప్పేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో ఆదివారం కనీస ఉష్ణోగ్రత 7.2 డిగ్రీలకు పడిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఇక రాజస్ధాలోని సికార్, భిల్వార పంజాబ్‌లోని ఆదంపూర్‌లో అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 03.0 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్ ప్రాంతంలో శనివారం దేశంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా మైనస్ 19 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, కాకినాడల మధ్య తీరం దాటుతున్న క్రమంలో ఏపీ, ఒడిషా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. -
రాత్రిళ్లు చలి తీవ్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీలు తగ్గి 10 డిగ్రీల చొప్పున నమోదు కావడం గమనార్హం. రామగుండంలో ఐదు డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 4 డిగ్రీలు తగ్గి 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండలో 14, నిజామాబాద్, హకీంపేటల్లో 15, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్తంత పెరిగాయి. ఖమ్మంలోనైతే సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. కాగా శని, ఆదివారాల్లో ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
వణుకుతున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులు, మధ్య భారతంలో అధిక పీడనంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. మెదక్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీలు తక్కువగా 7 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, భద్రాచలంలో 8 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీలు రికార్డయింది. భద్రాచలంలో 1962 జనవరి 5న 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆ తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. ఖమ్మంలో 1946 జనవరి 8న 9.4 డిగ్రీలు నమోదవగా, తాజాగా ఆ రికార్డు బద్దలైంది. ఇక రామగుండంలో 10 డిగ్రీలు, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 11, హన్మకొండలో 12, హకీంపేటలో 13, మహబూబ్‌నగర్‌లో 14, నల్లగొండలో 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గురువారం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మంలో తీవ్రమైన చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.