
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గతానికి భిన్నంగా రాష్ట్రంలో చలి ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది. శీతాకాలంలో చలి వాతావరణం సాధారణమే అయినా ఈసారి దాని తీవ్రత ఎక్కువైంది. అన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. విజయవాడ వంటి వెచ్చని ప్రదేశాలను కూడా ఈ శీతాకాలం వణికిస్తోంది. 50 ఏళ్ల తర్వాత విజయవాడలో రెండు రోజుల కిందట 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మామూలుగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుంది. శీతాకాలం కూడా అంత తీవ్రమైన చలి వాతావరణం కనిపించదు. కానీ ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఈనెల 18వ తేదీ నుంచి వరుసగా 13.5 నుంచి 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచే చలి తీవ్రత పెరిగి ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే ఉంది.
2 నుంచి 4 డిగ్రీలకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతాయి. విశాఖ మన్యంలో 8 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలుంటాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆ ప్రాంతాలు చలికి గడ్డకడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లోను చలితీవ్రత పెరిగింది. చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌లో ఈ నెల 18న 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అరకులో 5.4 డిగ్రీలు
గురువారం ఉదయం విశాఖ జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలు నమోదైంది. పెదబయలు, డుంబ్రిగూడల్లో 5.7, జి.మాడుగులలో 5.9, జీకే వీధిలో 6.5, చింతపల్లి 7.7లో, హకుంపేటలో 7.8, పాడేరులో 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేరోజు కర్నూలు నగరంలో 14.2 డిగ్రీలు, విజయవాడలో 14.6, అనంతపురంలో 15.2, తిరుపతిలో 15.8, ఒంగోలు, ఏలూరుల్లో 15.9, శ్రీకాకుళం, కడపల్లో 16.2, గుంటూరులో 16.3, విశాఖపట్నంలో 18.2, కాకినాడలో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికి కారణాలివే..
తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కిలోమీటర్ల ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలితీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు గాలులు ఉత్తర భారతదేశం నుంచి మన రాష్ట్రానికి నేరుగా వీస్తున్నాయి.తేమ తక్కువగా ఉండడం వల్ల చలిగాలులు పెరిగాయి. చలితీవ్రత మరో 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 15వ తేదీ వరకు మామూలు చలి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చలిలో తిరగవద్దు
చలి గాలుల వల్ల శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చలిలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలి ముక్కు, చెవులకు తాకకుండా జాగ్రత్త వహించాలి.
– డాక్టర్ గోపీచంద్, పల్మనాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్